కేరళ సీఎం పినరయి విజయన్ కు షాక్ తగిలింది. KIIFB మసాలా బాండ్ కేసులో సీఎం పినరయి విజయన్, మాజీ ఆర్థిక మంత్రి థామస్ ఇస్సాక్, సీఎం ప్రధాన కార్యదర్శి కేఎం అబ్రహం లకు నోటీసులు జారీ చేసింది ఈడీ. ఈ కేసులో రూ. 466 కోట్ల ఫెమా ఉల్లంఘనల జరిగినట్లు ఆరోపణలు ఉన్న క్రమంలో నోటీసులు జారీ చేసినట్లు తెలిపారు ఈడీ అధికారులు.
ఈ కేసుకు సంబంధించి ఫెమా దర్యాప్తు ముగిసిన తర్వాత షోకాజ్ నోటీసులు జారీ చేసి.. విచారణలో తేలిన ఉల్లంఘనల మేరకు జరిమానా విధించే అవకాశం ఉంది.
KIIFB మసాలా బాండ్ కేసు ఏంటి.. ?
KIIFB మసాలా బాండ్ల ద్వారా సేకరించిన రూ. 2 వేల కోట్లకు సంబంధించిన కార్యకలాపాలు ఫెమా మార్గదర్శకాలకు అనుగుణంగా ఉన్నాయా లేదా అన్న కోణంలో దర్యాప్తు చేస్తోంది ఈడీ. 2019లో భారతదేశంలో ఇలాంటి బాండ్లు రిలీజ్ చేసిన మొదటి రాష్ట్రం కేరళ. ఆ ఏడాది KIIFB లండన్ స్టాక్ ఎక్స్ చేంజ్ లో తన తొలి మసాలా బాండ్ జారీ చేయడం ద్వారా సుమారు రూ. 2 వేల కోట్లు సేకరించింది.
రాష్ట్ర అభివృద్ధి కోసం రూ. 50 వేల కోట్లను సమీకరించే ప్లాన్ లో భాగంగా ఈ నిధులుపలు ప్రధాన ప్రాజెక్టులకు మళ్లించింది ప్రభుత్వం.బాండ్ల ఆదాయానికి సంబంధించి నిధుల మళ్లింపు, ఫోరెక్స్ కి సంబంధించి అవకతవకలు జరిగాయన్న ఆరోపణలు ఉన్నాయి.
