కాళేశ్వరం ఇంజినీర్లకు ఈడీ నోటీసులు!

కాళేశ్వరం ఇంజినీర్లకు  ఈడీ నోటీసులు!
  • ఈ వారంలోనే  ఇచ్చేందుకు ఏర్పాట్లు
  • గతేడాది మురళీధర్‌‌‌‌రావు, నూనె శ్రీధర్‌‌‌‌,  భూక్యా హరిరాంను 
  • అరెస్ట్ చేసిన ఏసీబీ వీరి అక్రమాస్తుల విలువ 
  • ప్రస్తుత మార్కెట్‌‌‌‌లో రూ.600 కోట్లకుపైనే
  • ఈ ముగ్గురిపై విడివిడిగా ఈసీఐఆర్‌‌‌‌‌‌‌‌లు నమోదు చేసిన ఈడీ.. 
  • మనీ లాండరింగ్‌‌‌‌ కోణంలో దర్యాప్తు
  • త్వరలో విచారించేందుకు రంగం సిద్ధం 
  • చేస్తున్న ఈడీ, షెడ్యూల్ ప్రకారం నోటీసులు

హైదరాబాద్‌‌, వెలుగు: కాళేశ్వరం ప్రాజెక్ట్‌‌లో ఇంజినీర్లుగా పనిచేసి, భారీగా అక్రమాస్తులు కూడబెట్టిన మాజీ ఇంజినీర్‌‌ ఇన్‌‌ చీఫ్‌‌ (ఈఎన్సీ) మురళీధర్‌‌రావు, మరో ఈఎన్సీ భూక్యా హరిరాం, చొప్పదండి ఎస్సారెస్పీ డివిజన్‌‌–-8 ఎగ్జిక్యూటివ్‌‌ ఇంజినీర్‌‌‌‌గా పనిచేసిన నూనె శ్రీధర్‌‌కు నోటీసులు ఇచ్చేందుకు ఎన్‌‌ఫోర్స్‌‌ మెంట్ డైరెక్టరేట్‌‌(ఈడీ) రంగం సిద్ధం చేసింది. ప్రివెన్షన్ ఆఫ్ మనీలాండరింగ్‌‌ కింద విచారించేందకు షెడ్యూల్‌‌ రెడీ చేస్తున్నది. ఆదాయానికి మించి ఆస్తుల కేసులో ఈ ముగ్గురినీ గతేడాది ఏసీబీ అరెస్ట్‌‌ చేసిన సంగతి తెలిసిందే. సోదాల్లో వీరికి సంబంధించిన విల్లాలు, అత్యంత ప్రైమ్‌‌ లొకేషన్లలోని ప్లాట్లు, భూములు, బ్యాంకు డిపాజిట్లు తదితర అన్ని కలిపి ప్రస్తుత మార్కెట్‌‌ వ్యాల్యూ ప్రకారం దాదాపు రూ.600 కోట్లుకు పైగా ఆస్తులను గుర్తించింది. ఈ క్రమంలోనే ఏసీబీ నమోదు చేసిన కేసుల ఆధారంగా ఈ ముగ్గురిపై విడివిడిగా ఈడీ ఎన్‌‌ఫోర్స్‌‌మెంట్‌‌ కేస్‌‌ ఇన్‌‌ఫర్మేషన్‌‌ రిపోర్ట్(ఈసీఐఆర్‌‌‌‌) రిజిస్టర్ చేసింది. వీరందరికీ ఈ వారంలోనే నోటీసులు ఇచ్చేందుకు ఈడీ అధికారులు సిద్ధమవుతున్నారు.

కాళేళ్వరం ప్రాజెక్ట్‌‌లో చక్రం తిప్పిన మురళీధర్‌‌‌‌రావు 

బీఆర్‌‌ఎస్‌‌ హయాంలో లక్ష కోట్లతో నిర్మించిన కాళేశ్వరం సహా రాష్ట్రంలో పలు భారీ ప్రాజెక్టుల నిర్మాణంలో మాజీ ఈఎన్సీ మురళీధర్‌‌రావు, మరో ఈఎన్సీ హరిరాం, ఈఈ నూనె శ్రీధర్‌‌ కీలకంగా పనిచేశారు. వీరంతా కాంట్రాక్టర్లు, సబ్ కాంట్రాక్ట్‌‌ కంపెనీల నుంచి భారీగా ముడుపులు తీసుకున్నట్లు ఏసీబీ ఫిర్యాదులు అందాయి. ఈ మేరకు ఏసీబీ కేసులు నమోదు చేసి దర్యాప్తు చేసింది. అధికారాన్ని అడ్డంపెట్టుకుని సంపాదించిన అక్రమాస్తులను సోదాల్లో గుర్తించింది. కాగా, కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణ సమయంలో ఈఎన్‌‌సీగా చక్రం తిప్పిన మురళీధర్‌‌రావు ఆయన కుమారుడు అభిషేక్‌‌రావు కంపెనీల ద్వారా భారీ అక్రమాలకు పాల్పడ్డారనే ఆరోపణలు ఉన్నాయి. అభిషేక్‌‌రావు బినామీగా ఉన్న కాంట్రాక్టు సంస్థలకు వందల కోట్ల రూపాయల విలువ చేసే కాంట్రాక్టులు కట్టబెట్టారని, అవినీతి సొమ్మును ఆయన కంపెనీల్లోకి పెట్టుబడులుగా పెట్టారని ఏసీబీ గుర్తించింది. వీటికి సంబంధించిన సమాచారాన్ని ఈడీ అధికారులు ఏసీబీ నుంచి ఇప్పటికే సేకరించినట్లు తెలిసింది.
థాయ్‌‌లాండ్‌‌లో డెస్టినేషన్‌‌ వెడ్డింగ్‌‌, 

అతిథులకు ఫ్లైట్‌‌ టికెట్లు

కాళేశ్వరం ఈఈగా పనిచేసిన నూనె శ్రీధర్‌‌ కూడా భారీ అక్రమాలకు పాల్పడినట్లు ఏసీబీ విచారణలో తేలింది. తన కుమారుడి వివాహ వేడుకలు (డెస్టినేషన్‌‌ వెడ్డింగ్‌‌) థాయ్‌‌లాండ్‌‌లో నిర్వహించారని ఆధారాలు సేకరించింది. ఈ వేడుకలకు హాజరయ్యే అతిథుల కోసం శ్రీధర్‌‌‌‌ ప్రత్యేక విమానంలో టికెట్లు బుక్ చేశాడు. దీంతో పాటు కరీంనగర్ సహా హైదరాబాద్‌‌లో హోటల్స్‌‌ బిజినెస్‌‌లో పెట్టుబడులు పెట్టినట్లు గుర్తించింది. ఈ క్రమంలోనే కాళేశ్వరం ఇరిగేషన్‌‌ ప్రాజెక్ట్‌‌ కార్పొరేషన్ లిమిటెడ్‌‌  డైరెక్టర్‌‌, ఎండీగా విధులు నిర్వహించిన ఈఎన్‌‌సీ భూక్యా హరిరాం కూడా వందల కోట్లు అక్రమాస్తులు కూడబెట్టినట్లు ఏసీబీ ఇప్పటికే గుర్తించింది. అవినీతి సొమ్ముతో మురళీధర్‌‌‌‌రావు, నూనె శ్రీధర్‌‌, హరీరాం పెట్టిన పెట్టుబడులపై ఈడీ అధికారులు ఆరా తీస్తున్నారు. ఏసీబీ నుంచి సేకరించిన వివరాల ఆధారంగా ఈసీఐఆర్‌‌లు నమోదు చేశారు. ఒక్కో కేసులో విడివిడిగా దర్యాప్తు విచారించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. బినామీలు, కుటుంబ సభ్యుల పేర్లతో వివిధ వ్యాపారాల్లోకి మళ్లించిన సొమ్మును మనీలాండరింగ్‌‌ కింద పరిగణిస్తూ దర్యాప్తు చేయనున్నట్లు తెలిసింది.