మనీలాండరింగ్ కేసు.. ఆప్ ఎమ్మెల్యే ఇళ్లపై ఈడీ దాడులు

మనీలాండరింగ్ కేసు.. ఆప్ ఎమ్మెల్యే ఇళ్లపై ఈడీ దాడులు

మనీలాండరింగ్ దర్యాప్తులో భాగంగా ఢిల్లీలోని ఆప్ ఎమ్మెల్యే అమానతుల్లాఖాన్‌తో పాటు మరికొందరిపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్- ఈడీ వారికి చెందిన నివాసాలు, ఇతర కార్యాలయాలపై దాడులు చేసినట్లు అధికారిక వర్గాలు తెలిపాయి. ఆయన ప్రస్తుతం ఢిల్లీ అసెంబ్లీలోని ఓఖ్లా నియోజకవర్గానికి ప్రాతినిథ్యం వహిస్తుండగా.. ఖాన్ ఢిల్లీ వక్ఫ్‌ బోర్డ్‌ ఛైర్మన్ గా ఉన్న సమయంలో అక్రమ నియామకాలకు సంబంధించిన కేసులో సీబీఐ, ఏసీబీ నమోదు చేసిన కేసుల ఆధారంగా ఈడీ దర్యాప్తు చేస్తోంది.

ఓఖ్లా నియోజకవర్గం ఎమ్మెల్యే అమానతుల్లా ఖాన్‌.. గతంలో ఢిల్లీ వక్ఫ్‌ బోర్డ్‌ చైర్మన్‌గా పనిచేశారు. ఆ సమయంలో ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా 32 మందికి ఉద్యోగాలు ఇచ్చారని ఆయనపై అప్పట్లో ఆరోపణలు వచ్చాయి. ఇదే కాకుండా ఢిల్లీ వక్ఫ్ బోర్డుకు చెందిన పలు ఆస్తులను అక్రమంగా అద్దెకు ఇచ్చారని కూడా సమాచారం. ఈ క్రమంలో ఆయన ఇంట్లో అధికారులు సోదాలు చేపట్టారు. ప్రివెన్షన్ ఆఫ్  మనీలాండరింగ్ యాక్ట్ (పీఎంఎల్‌ఏ) నిబంధనల ప్రకారం ఈడీ ఈ సోదాలు జరుపుతోంది. ఇదే కేసులో ఖాన్ ను ఢిల్లీ ఏసీబీ అరెస్టు చేయగా.. సెప్టెంబర్ లో ఆయనకు బెయిల్ మంజూరైంది.

అంతకుముందు ఢిల్లీ లిక్కర్ స్కామ్ కు సంబంధించిన కేసులో ఆమ్‌ ఆద్మీ నేత, రాజ్యసభ సభ్యుడు సంజయ్ సింగ్‌ను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అక్టోబర్ 4న అరెస్ట్‌ చేసింది. ఇది జరిగిన కొద్దిరోజుల్లోనే మరో ఆప్‌ నేత, ఎమ్మెల్యే అమానతుల్లా ఖాన్‌ ఇంట్లో ఈడీ దాడులు చేయడం చర్చనీయాంశంగా మారింది. ఈ పరిణామంలో ఆప్ పార్టీకి దెబ్బ మీద దెబ్బ తగినట్టుగా అయింది. ఇదే పార్టీకి చెందిన మనీష్ సిసోడియా ఇప్పటికీ జైళ్లోనే ఉండగా.. ఈ తరహా దాడులు, అరెస్టులను ఆప్ పార్టీ ఖండిస్తూ వస్తోంది.