
- మాజీ మంత్రి తలసాని ఓఎస్డీ కల్యాణ్ కుమార్ ఇంట్లో భారీగా నగదు పట్టివేత!
- అతణ్ని అదుపులోకి తీసుకుని విచారిస్తున్న అధికారులు
- మరో ఆరుగురి ఇండ్లు, ఆఫీసుల్లోనూ తనిఖీలు
- బినామీ అకౌంట్ల వివరాలు సేకరణ
- నేడు పూర్తి వివరాలు వెల్లడించనున్న ఈడీ
- ఈ స్కీమ్‌లో 700 కోట్లు దారిమళ్లినట్టు ఇప్పటికే గుర్తించిన ఏసీబీ
హైదరాబాద్, వెలుగు:బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో జరిగిన గొర్రెల పంపిణీ స్కామ్‌లో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ) దర్యాప్తు ముమ్మరం చేసింది. మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఓఎస్డీగా పని చేసిన గుండమరాజు కల్యాణ్ కుమార్‌ను బుధవారం అదుపులోకి తీసుకుంది. ఆయనను హైదరాబాద్ బషీర్‌బాగ్‌లోని ఈడీ కార్యాలయానికి తరలించి విచారిస్తున్నారు. అంతకుముందు దిల్‌సుఖ్‌నగర్‌లోని కల్యాణ్‌కుమార్ నివాసంలో ఈడీ సోదాలు నిర్వహించింది. రెండు క్యాష్ మిషిన్లను తెప్పించి నగదును లెక్కించింది.
ఇంట్లో సీజ్ చేసిన క్యాష్, డాక్యుమెంట్లు సహా గొర్రెల స్కీమ్‌కు సంబంధించిన డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకుంది. వీటి ఆధారంగా కల్యాణ్‌కుమార్‌ను విచారించింది. కల్యాణ్‌కుమార్ ఇంటితో పాటు గొర్రెలు, మేకల అభివృద్ధి సమాఖ్య మాజీ సీఈవో రాంచందర్ నాయక్, మాజీ అసిస్టెంట్ డైరెక్టర్లు రవికుమార్, కేశవసాయి, శ్రీనివాస్ రావు, కాంట్రాక్ట్ సంస్థ ‘లోలోనా ది లైవ్’యజమానులు మొయిద్దీన్, ఇక్రముద్దీన్ ఇండ్లు, ఆఫీసులు సహా మొత్తం 8 ప్రాంతాల్లో ఈడీ అధికారులు తనిఖీలు చేశారు. దాదాపు 50 మందితో కూడిన 8 ఈడీ బృందాలు సోదాల్లో పాల్గొన్నాయి. గొర్రెల పంపిణీ పథకానికి సంబంధించిన డాక్యుమెంట్లు, లబ్ధిదారుల ఎంపిక, ‘లోలోనా ది లైవ్’కంపెనీ రికార్డుల ఆధారంగా ఈడీ దర్యాప్తు చేస్తున్నది. సోదాలకు సంబంధించిన పూర్తి వివరాలను గురువారం వెల్లడిస్తామని ఈడీ అధికారులు తెలిపారు.
ఇట్ల దొరికిపోయారు..
హైదరాబాద్ కొండాపూర్‌లోని ‘లోలోనా ది లైవ్ కంపెనీ’కి అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం గొర్రెల సరఫరా కాంట్రాక్ట్ ఇచ్చింది. ఆ సంస్థకు చెందిన సయ్యద్ మొయిద్దీన్‌తో పాటు పశుసంవర్థక శాఖ అసిస్టెంట్ డైరెక్టర్లు రవికుమార్, కేశవసాయి కలిసి ఏపీలోని పల్నాడు, ప్రకాశం, గుంటూరు జిల్లాల్లో పర్యటించారు. 2017 నుంచి గొర్రెలను సప్లయ్ చేస్తున్న 18 మంది రైతుల వద్ద 133 యూనిట్ల గొర్రెలను కొనుగోలు చేశారు. ఇందుకు సంబంధించిన రూ.2.10 కోట్లు వారి అకౌంట్స్‌లో డిపాజిట్ చేస్తామని చెప్పారు. కానీ నలుగురు అధికారులు కలిసి తమకు తెలిసిన వారి పేర్లతో బినామీ ఖాతాలు తెరిచారు. సర్కార్ నుంచి వచ్చిన డబ్బును రైతుల అకౌంట్లలో కాకుండా తమ బినామీ ఖాతాల్లోకి ట్రాన్స్‌ఫర్ చేశారు. బినామీ అకౌంట్ హోల్డర్స్‌నే రైతులుగా రికార్డుల్లో చూపారు. ఎలక్షన్ కోడ్ కారణంగా ఆలస్యం జరిగిందని అసలైన రైతులను నమ్మించారు. ఎలక్షన్స్ కోడ్ ముగిసిన తర్వాత కూడా రైతులకు చేరాల్సిన డబ్బు వాళ్ల అకౌంట్స్‌లో డిపాజిట్ కాలేదు. దీంతో అనుమానం వచ్చిన బాధిత రైతులు మాసబ్‌ట్యాంక్‌లోని పశుసంవర్థక శాఖ ఆఫీసులో ఆరా తీశారు. తమకు రావాల్సిన రూ.2.10 కోట్లు అధికారుల బినామీల అకౌంట్లలో డిపాజిట్ అయినట్లు గుర్తించి, గచ్చిబౌలి పోలీసులకు ఫిర్యాదు చేశారు.
700 కోట్ల స్కామ్..
గొర్రెల పంపిణీ స్కీమ్‌లో బయటపడ్డ అక్రమాలను సీరియస్‌గా తీసుకున్న కాంగ్రెస్ ప్రభుత్వం.. ఈ కేసును ఏసీబీకి బదిలీ చేసింది. 2023 డిసెంబర్‌లో గచ్చిబౌలి పీఎస్‌లో నమోదైన ఎఫ్‌ఐఆర్ ఆధారంగా కేసు నమోదు చేసిన ఏసీబీ అధికారులు దర్యాప్తు ప్రారంభించారు. ఏపీలోని పలు జిల్లాలకు చెందిన బినామీ అకౌంట్లకు డబ్బులు ట్రాన్స్‌ఫర్ అయినట్టు గుర్తించారు. గొర్రెలు విక్రయించిన 14 మంది రైతుల స్టేట్‌మెంట్లను రికార్డ్ చేశారు. బినామీ అకౌంట్స్ క్రియేట్ చేయడంలో కీలకంగా వ్యవహరించిన తలసాని ఓఎస్డీ కల్యాణ్ కుమార్, రవికుమార్, కేశవ సాయిలు, రఘుపతి రెడ్డి, సంగు గణేష్ సహా మొత్తం 17 మందిని అరెస్ట్ చేశారు. రెండు విడతలుగా జరిగిన గొర్రెల పంపిణీ స్కీమ్‌లో రీస్లైకింగ్ దందా ద్వారా రూ.700 కోట్లు దారిమళ్లినట్టు ప్రాథమిక ఆధారాలు సేకరించిన ఏసీబీ.. దానిపై ప్రభుత్వానికి నివేదిక అందించింది.
మనీలాండరింగ్ కోణంలో ఈడీ దర్యాప్తు..
ఏసీబీ ఎఫ్‌ఐఆర్ ఆధారంగా ఈడీ అధికారులు పోయినేడాది జూన్‌లో ఎన్‌ఫోర్స్‌మెంట్ కేస్ ఇన్‌ఫర్మేషన్ రిపోర్ట్(ఈసీఐఆర్) నమోదు చేసి, మనీలాండరింగ్ కోణంలో దర్యాప్తు ప్రారంభించారు. ఇందులో భాగంగా కీలక సూత్రధారిగా భావిస్తున్న మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ఓఎస్డీ కల్యాణ్‌కుమార్‌ను తాజాగా అదుపులోకి తీసుకొని విచారణ చేస్తున్నారు. ఏపీలో కొనుగోలు చేసిన గొర్రెలు, వాటి రవాణా ఏజెన్సీలు, వాహనాలు, గొర్రెల యూనిట్ల రికార్డులను ఇప్పటికే ఈడీ అధికారులు పరిశీలించారు. ఈ క్రమంలోనే ‘లోలోనా ది లైవ్’కంపెనీకి గొర్రెల కాంట్రాక్ట్ఎవరు ఇప్పించారు? రైతుల అకౌంట్లలో జమ కావాల్సిన రూ.2.10 కోట్లు బినామీ అకౌంట్ల ద్వారా ఎవరికి చేరాయి? ఈ మొత్తం వ్యవహారంలో ఎవరికి అంతిమ ప్రయోజనం జరిగింది? అనే వివరాలు ఆరా తీస్తున్నారు. దీంతోపాటు రీసైక్లింగ్దందా ద్వారా రూ.700 కోట్లు దారిమళ్లినట్టు ఏసీబీ తేల్చినందున.. ఆ వ్యవహారంపైనా దృష్టిపెట్టారు. ఈ క్రమంలో గొర్రెల స్కీమ్ కోసం బీఆర్ఎస్ప్రభుత్వం మొత్తంగా ఎన్ని కోట్లు చెల్లించింది? అవి గొర్రెల కొనుగోలుకే వెచ్చించారా? లేదంటే దారి మళ్లాయా? అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. ఇందులో భాగంగా జిల్లాల వారీగా లబ్ధిదారుల వివరాలు, సెల్ నంబర్లు, బ్యాంకు అకౌంట్ల వివరాలు సేకరించి వెరిఫైచేస్తున్నారు.