కవిత అరెస్టు జరిగిందిలా.. పంచనామా రెడీ చేసిన ఈడీ

 కవిత అరెస్టు జరిగిందిలా.. పంచనామా రెడీ చేసిన ఈడీ

బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత అరెస్టుపై ఈడీ అరెస్ట్ ప్రొసీజర్ పంచనామాను రూపొందించింది. దాని ప్రకారం ఈరోజు మధ్యాహ్నం 1.45 నుంచి 6.45 గంటల వరకు ఆమె ఇంట్లో సోదాలు చేశారు. పీఎంఎల్ఏ యాక్ట్-19ను అనుసరించి సాయంత్రం 5.20 గంటలకు అరెస్టు చేసి శంషాబాద్ ఎయిర్ పోర్టుకు తరలించారు. ఈ రాత్రంతా ఢిల్లీలోని ఈడీ కార్యాలయంలోనే కవిత ఉంటారు. విచారణ కస్టడీని కోరుతూ రేపు మధ్యాహ్నం రౌస్ అవెన్యూ కోర్టులో ఈడీ ఆమెను హాజరుపరచనుంది.

ఎమ్మెల్సీ కవితను కాసేపట్లో ఢిల్లీలోని తమ కార్యాలయానికి ఈడీ తీసుకురానుంది. హైదరాబాద్‌లో ఆమె అరెస్టు సమయంలో బీఆర్ఎస్ శ్రేణులపై లాఠీఛార్జ్‌తో ఢిల్లీ పోలీసులు అప్రమత్తమయ్యారు. ఈడీ  కార్యాలయం వద్ద ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా భారీగా బలగాలు మోహరించాయి. కవిత ఈ రాత్రి ఇదే కార్యాలయంలో ఉంటారు. శనివారం ఉదయం వైద్య పరీక్షల తర్వాత అధికారులు ఆమెను రౌస్ అవెన్యూ కోర్టులో హాజరుపరుస్తారు.

కవిత సోదరుడు, మాజీ మంత్రి కేటీఆర్ హుటాహుటిన ఢిల్లీకి బయల్దేరారు. కవిత అరెస్టుపై సీనియర్ న్యాయవాదులతో చర్చించనున్న ఆయన.. ఈ అంశంపై ఏ విధంగా ముందుకెళ్లాలనే దానిపై సమాలోచనలు చేసే అవకాశం ఉంది. అటు తన అరెస్టుపై రేపు సుప్రీంలో కవిత పిటిషన్ దాఖలు చేయనున్నారు.