హైదరాబాద్, వెలుగు: ప్రీ-లాంచ్ హౌసింగ్ ప్రాజెక్టుల పేరుతో 300 మందికి పైగా డిపాజిటర్లను మోసం చేసిన భువనతేజ ఇన్‌ఫ్రా రియల్ ఎస్టేట్ ప్రాజెక్ట్స్ కేసులో ఈడీ దర్యాప్తు ముమ్మరం చేసింది. నానక్‌రాంగూడలోని భువన తేజ డైరెక్టర్ వెంకట సుబ్రహ్మణ్యం ఇంటితో పాటు సూరారంలోని మార్కెటింగ్ డైరెక్టర్ బీబీ గుప్తా నివాసం సహా ఐదు ప్రాంతాల్లో బుధవారం ఏకకాలంలో సోదాలు నిర్వహించింది.
ఈ సోదాల్లో ప్రీలాంచ్ స్కీమ్ పేరుతో డిపాజిటర్ల నుంచి వసూలు చేసిన డిపాజిట్లకు సంబంధించిన డాక్యుమెంట్లను సేకరించింది. నిర్ణీత గడువులోగా డిపాజిటర్లకు ఫ్లాట్లు అందించక పోవడంతో పాటు ప్రీలాంచ్ పేరుతో వసూలు చేసిన డబ్బును రియల్ ఎస్టేట్ వ్యాపారంలోకి మళ్లించినట్టు గుర్తించింది. ప్రీ లాంచ్ పేరుతో రూ.80 కోట్లు మోసం చేసిన భువనతేజ ఇన్‌ఫ్రాపై గతేడాది హైదరాబాద్ సీసీఎస్‌లో నమోదైంది. ఎకనామిక్ అఫెన్సెస్ వింగ్ నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్ ఆధారంగా ఈడీ దర్యాప్తు ప్రారంభించింది.
హ్యాపీ హోమ్స్ ఫేజ్-1,ఫేజ్-2, భువంటేజా ఆరా ఫేజ్-2 ఫ్లాట్‌ల విక్రయాలను ప్రీ లాంచ్ పేరుతో మార్కెటింగ్ చేసినట్లు సీసీఎస్ పోలీసులు దర్యాప్తులో వెలుగు చూసింది. అపార్ట్‌మెంట్లు కట్టకుండా, ఫ్లాట్‌లు కేటాయించకుండా మోసం చేసినట్లు పోలీసులు గుర్తించారు.
తెలంగాణ రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ నుంచి ఎలాంటి అనుమతులు పొందకుండానే ప్రీలాంచ్ ప్రాజెక్టు చేసినందుకు రెరా ఫైన్‌కూడా వేసింది. ఈ కేసులో కంపెనీ డైరెక్టర్ వెంకట సుబ్రహ్మణ్యం సహా ఫణిభూషణ్ రావును సీసీఎస్ పోలీసులు గతంలో అరెస్ట్ చేశారు. సీసీఎస్ ఎకనామిక్ అఫెన్సెస్ వింగ్ కేసు ఆధారంగా ఈడీ మనీలాండరింగ్ కింద దర్యాప్తు చేపట్టింది. ఈ సోదాల వివరాలను గురువారం వెల్లడించే అవకాశాలున్నాయి.

