HCA అవకతవకల కేసులో బిగ్ ట్విస్ట్.. రంగంలోకి ఈడీ.. కేసు వివరాలు ఇవ్వాలని సీఐడీకి లేఖ

HCA అవకతవకల కేసులో బిగ్ ట్విస్ట్.. రంగంలోకి ఈడీ.. కేసు వివరాలు ఇవ్వాలని సీఐడీకి లేఖ

హైదరాబాద్: హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (HCA) కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. హెచ్‌సీఏ అవకతవకల వ్యవహారంలోకి కేంద్ర దర్యాప్తు సంస్థ ఎన్‎ఫోర్స్‎మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) రంగంలోకి దిగింది. ఈ మేరకు హెచ్‌ఏసీ కేసు వివరాలు ఇవ్వాలని సీఐడీకి లేఖ రాసింది ఈడీ. ఎఫ్‌ఐఆర్, రిమాండ్ రిపోర్టులు, వాంగ్మూలాలు ఇవ్వాలని లేఖలో కోరింది. 

సీఐడీ నుంచి వివరాలు రాగానే కేసు కేసు నమోదు చేసి ఈడీ దర్యాప్తు మొదలుపెట్టనున్నట్లు సమాచారం. హెచ్‎సీఏ అవకతవకల కేసులో ఇప్పటికే హెచ్‌సీఏ అధ్యక్షుడు జగన్మోహన్‌రావు సహా ఐదుగురిని సీఐడీ అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే.  ఈడీ ఎంట్రీ ఇవ్వడంతో ఈ కేసు ఎలాంటి మలుపు తీసుకోబోతుందనే దానిపై ఉత్కంఠ నెలకొంది.

కాగా, టికెట్ల కోసం ఎస్ఆర్‎హెచ్ యాజమాన్యాన్ని బెదిరించడం, హెచ్‎సీఏ నిధులు దుర్వినియోగం చేశారన్న ఆరోపణలపై హెచ్‎సీఏ అధ్యక్షుడు జగన్మోహన్ రావుతో పాటు హెచ్‎సీఏ సెక్రటరీ దేవరాజ్, ట్రెజరర్ జగన్నాథ్ శ్రీనివాస్ రావు, సీఈవో సునీల్ కుమార్, శ్రీ చక్ర క్రికెట్ క్లబ్ జనరల్ సెక్రెటరీ రాజేందర్ యాదవ్, రాజేందర్ యాదవ్ భార్య కవిత మొత్తం ఆరుగురిపై సీఐడీ పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసులో జగన్మోహన్ రావుకు మల్కాజిగిరి కోర్టు 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ విధించింది. 

జగన్మోహన్ రావుతో పాటు ఈ కేసులోని మిగితా నిందితులకు కూడా 14 రోజుల రిమాండ్ విధిస్తూ మల్కాజిగిరి కోర్టు గురువారం (జూలై 10) ఆదేశాలు జారీ చేసింది. నిందితులను చర్లపల్లి జైలుకు తరలించాలని పోలీసులను న్యాయస్థానం ఆదేశించింది. కోర్టు ఆదేశాల మేరకు నిందితులను చర్లపల్లి జైలుకు తరలించారు పోలీసులు. ఈ కేసులో A6గా ఉన్న మహిళా నిందితురాలు కవితను మాత్రం చంచల్ గూడా మహిళ జైలుకు తరలించారు. 

ALSO READ : బీజేపీది మొసలి కన్నీరు.. బీసీల నోటికాడి కూడును లాగొద్దు : మంత్రి పొన్నం

ఈ కేసులో నిందితుడిగా ఉన్న సెక్రటరీ దేవరాజ్ పరారీలో ఉండగా మిగిలిన నిందితులందరిని బుధవారం (జూలై 9) రాత్రి అదుపులోకి తీసుకుని ప్రశ్నించారు. అనంతరం వైద్య పరీక్షలు నిర్వహించి గురువారం (జూలై 10) మల్కాజిగిరి కోర్టులో హాజరుపర్చారు. పోలీసుల అభ్యర్థన మేరకు నిందితులకు 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ విధించింది మల్కాజిగిరి కోర్టు.