కవిత, కేజ్రీవాల్ ఇద్దరినీ ఎదురెదురుగా కూర్చోబెట్టి.. ఈడీ విచారణ

కవిత, కేజ్రీవాల్ ఇద్దరినీ ఎదురెదురుగా కూర్చోబెట్టి.. ఈడీ విచారణ

లిక్కర్ స్కాంలో కస్టడీలో ఉన్న ఢిల్లీ సీఎం కేజ్రీవాల్.. అదే విధంగా కల్వకుంట్ల కవిత.. ఇద్దరినీ ఎదురెదురుగా కూర్చోబెట్టి విచారణ చేయనున్నారు ఈడీ అధికారులు. వీరిద్దరూ ఇప్పుడు ఈడీ కస్టడీలోనే ఉన్నారు. ఈ క్రమంలోనే కేసులో లావాదేవీలకు సంబంధించి.. ఇప్పటి వరకు వీరిని వేర్వేరుగా విచారించారు. ఇద్దరూ చెప్పిన సమాధానాలను నోట్ చేసుకున్న ఈడీ అధికారులు.. ఇప్పుడు ఇద్దరినీ ఎదురెదురుగా కూర్చోబెట్టి విచారణ చేయనున్నారు. దీంతో లిక్కర్ స్కాంలో లావాదేవీల వ్యవహారం క్లయిమాక్స్ కు రానున్నట్లు తెలుస్తుంది. 

లిక్కర్ స్కామ్​లో సౌత్ గ్రూప్ నుంచి కవిత కింగ్ పిన్​గా వ్యవహరిస్తే.. పాలసీ రూపకల్పన, అమలులో కేజ్రీవాల్ కీ రోల్ పోషించారని ఈడీ వర్గాలు అంటున్నాయి. అందువల్ల వీరిద్దరిని కలిపి విచారిస్తే.. స్కామ్​కు సంబంధించిన అన్ని వివరాలు బయటకు వస్తాయని భావిస్తున్నాయి. కేజ్రీవాల్ కు కోర్టు ఆరు రోజుల కస్టడీ విధించిన సంగతి తెలిసిందే. కవిత కస్టడీని కోర్టు పొడిగిస్తే వీరిద్దరిని కలిపి విచారించేందుకు అవకాశం ఉంటుంది.  

మరో వైపు  కవిత కస్టడీ ఇవాళ్టితో ముగుస్తుండటంతో  కవితను కోర్టులో హాజరుపరిచింది ఈడీ.  కవిత విచారణకు సహకరించడం లేదని.. కేసులో ఉన్న మరిన్ని అంశాలు రాబట్టేందుకు మరో  ఐదు రోజులు కస్డడీకి ఇవ్వాల్సిందిగా కోరింది. నలుగురు స్టేట్మెంట్ గురించి కవితని అడిగాం. కిక్ బ్యాగ్స్ గురించి అడిగాం. ఫోన్లలో డేటా డిలీట్ చేశారు. కుటుంబ ఆదాయపు పన్ను, వ్యాపారాల వివరాలు అడిగాం.కానీ ఇప్పటివరకు ఇవ్వలేదు. మేకా శరణ్ నివాసంలో ఇప్పటికీ ఇంకా సోదాలు జరుగుతున్నాయని ఈడీ తరపు న్యాయవాది కోర్టుకు తెలిపారు.

తన అరెస్ట్ అక్రమమని..న్యాయపోరాటం చేస్తామని కవిత తరపు న్యాయవాది  రమేష్ గుప్తా వాదించారు . ఈడీ కస్టడీ లో ఉన్నప్పుడు కవిత డాక్యుమెంట్స్ ఎలా ఇస్తారని ప్రశ్నించారు. బెయిల్ కోసం పిటిషన్ వేశామని.. బెయిల్ పిటిషన్ పై ఈడీకీ నోటీసులివ్వాలని కోరారు.  ఇరు వర్గాల వాదనలు విన్న ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టు తీర్పును రిజర్వ్ చేసింది.