బషీర్ బాగ్,- వెలుగు: ప్రజాగాయకుడు గద్దర్, సియాసత్ ఉర్దూ పత్రిక ఎడిటర్ జహీర్ అలీ ఖాన్ ల మరణం తెలంగాణ సమాజానికి తీరనిలోటు అని పలువురు వక్తలు అభిప్రాయపడ్డారు. సమాజంలో మార్పు కోసం గద్దర్ పాటలు రాశారని, తన లౌకికవాదంతో జహీర్ అలీఖాన్ ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చారని గుర్తు చేశారు. హైదరాబాద్ నాంపల్లిలోని తెలుగు వర్సిటీలో శుక్రవారం గద్దర్ , జహీర్ అలీ ఖాన్ ల సంస్మరణ సభలో ప్రెస్ అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ , సినీ గేయ రచయిత సుద్దాల అశోక్ తేజ, రచయిత్రి ఓల్గా, నటి ఉదయభాను పాల్గొన్నారు.
ఈ సందర్భంగా అల్లం నారాయణ మాట్లాడుతూ గద్దర్ తన ఆట, పాటలతో కోట్లాది మందిని ప్రభావితం చేశాడని కొనియాడారు. భూమిపై అలాంటి ప్రజా యుద్ధనౌక మళ్లీ పుట్టడని పేర్కొన్నారు. తెలంగాణ ఉద్యమంలో జహీర్ అలీఖాన్ పాత్ర ప్రత్యేకమైనదని గుర్తు చేశారు. ఆయన మరణం ఉర్దూ జర్నలిజానికి తీరని లోటు అని పేర్కొన్నారు.
కాలానికే పాటలు నేర్పిండు..
ముషీరాబాద్: కాలానికే పాటలు నేర్పి పరుగులు పెట్టించిన గొప్ప వ్యక్తి గద్దర్ అని రాష్ట్ర పెన్షనర్స్ అసోసియేషన్ పేర్కొంది. బాగ్ లింగంపల్లిలోని పెన్షనర్స్ అసోసియేషన్ ఆఫీసులో గద్దర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించి ఆయన సమాజానికి చేసిన సేవలను కొనియాడింది. అసోసియేషన్ అధ్యక్ష, కార్యదర్శులు రాజేంద్రబాబు, నర్సింగరావు, అసోసియేషన్ ప్రతినిధులు పాల్గొన్నారు.