
- సర్కార్కు విద్యా కమిషన్ సలహా కమిటీ రిపోర్టు
కరీంనగర్, వెలుగు: రాష్ట్రంలోని కొన్ని గురుకులాలను సెమీ రెసిడెన్షియల్స్ మోడ్తోను నడపాలని, ఆ స్కూళ్లలో సీట్లు వచ్చిన సమీప గ్రామాల విద్యార్థులు రాకపోకలు సాగించేందుకు బస్సు సౌకర్యం కల్పిస్తే సత్ఫలితాలు ఉండొచ్చని విద్యా కమిషన్ సలహా కమిటీ అభిప్రాయపడినట్లు తెలిసింది. గురుకులాల్లో ఇటీవల విద్యార్థుల ఆత్మహత్యలు పెరుగుతున్న నేపథ్యంలో వారిపై ఒత్తిడి తగ్గించేందుకు సెమీ రెసిడెన్షియల్ విధానం పనికొస్తుందని సూచించింది. సెమీ రెసిడెన్షియల్ పద్ధతిలో ఉదయం టిఫిన్, మధ్యాహ్నం భోజనం, సాయంత్రం స్నాక్స్ వరకు స్కూల్లో ఇవ్వొచ్చని పేర్కొన్నట్లు తెలిసింది.
చాలా ఏళ్లుగా గురుకులాల లాంటి రెసిడెన్షియల్ విధానంతో ఆత్మహత్యలు, ఆత్మహత్యాయత్నాలు పెరుగుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే విద్యార్థులపై పెరుగుతున్న ఒత్తిడిని తగ్గించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై విద్యా కమిషన్ కు అనుబంధంగా ఉన్న సలహా కమిటీ గురుకులాలకు వెళ్లి ఇటీవల అధ్యయనం చేసింది. ఈ సందర్భంగా విద్యార్థులు, వారి కుటుంబ సభ్యులు, గురుకులాల టీచర్లు, ఇతర స్టాఫ్‌తో చర్చించి విద్యార్థులపై ఒత్తిడికి గల కారణాలను తెలుసుకునే ప్రయత్నం చేసింది.