సంగారెడ్డి కలెక్టర్ ఆఫీస్ లో ఏసీబీ సోదాలు.. లంచం తీసుకుంటూ పట్టుబడ్డ విద్యాశాఖ అధికారి

సంగారెడ్డి కలెక్టర్ ఆఫీస్ లో ఏసీబీ సోదాలు..  లంచం తీసుకుంటూ పట్టుబడ్డ విద్యాశాఖ అధికారి

సంగారెడ్డి: సంగారెడ్డి కలెక్టర్ కార్యాలయ ప్రాంగణంలోని జిల్లా ఇంటర్మీడియట్ విద్యాధికారి కార్యాలయంలో అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు దాడులు నిర్వహించారు. ఓ ప్రైవేట్ కాలేజీకి అనుకూలంగా ఇన్‌స్పెక్షన్ రిపోర్ట్ ఇచ్చేందుకు లంచం డిమాండ్ చేసిన విద్యాశాఖ అధికారిని ఏసీబీ అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.

సంగారెడ్డి పట్టణంలోని ఓ ప్రైవేట్ కాలేజీని తనిఖీ చేసి, పాజిటివ్ రిపోర్ట్ ఇచ్చేందుకు సంబంధిత విద్యాశాఖ అధికారి గోవింద్ రామ్ రూ.50 వేల లంచం డిమాండ్ చేసినట్లు ఏసీబీ అధికారులు తెలిపారు.

ఈ క్రమంలో బాధితుడు గత వారం రూ.30 వేల నగదును అధికారికి ఇచ్చినట్లు సమాచారం. అనంతరం మిగిలిన రూ.20 వేల కోసం అధికారి ఫోన్ చేసి డబ్బులు ఇవ్వాలని డిమాండ్ చేయడంతో బాధితుడు ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు.

బాధితుడి ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగిన ఏసీబీ అధికారులు పక్కా ప్రణాళికతో ట్రాప్ నిర్వహించారు. సంగారెడ్డిలోని జిల్లా ఇంటర్మీడియట్ విద్యాధికారి కార్యాలయంలో రూ.20 వేల నగదును తీసుకుంటుండగా ఏసీబీ డీఎస్పీ సుదర్శన్ రెడ్డి ఆధ్వర్యంలోని బృందం గోవింద్ రామ్‌ను రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకుంది.

ALSO READ : తిరుమల వెళ్లే భక్తులకు LIC ద్వారా బీమా

అనంతరం కార్యాలయంలో ఏసీబీ అధికారులు తనిఖీలు నిర్వహించారు. నిందితుడిపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినట్లు అధికారులు తెలిపారు. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు ఏసీబీ దర్యాప్తు పూర్తయిన అనంతరం వెల్లడయ్యే అవకాశం ఉంది.