రెండు మూడు రోజుల్లో డీఎస్సీ జీవో

రెండు మూడు రోజుల్లో డీఎస్సీ జీవో

హైదరాబాద్, వెలుగు: సర్కారు స్కూల్స్​లో టీచర్ పోస్టుల భర్తీకి సంబంధించి విధివిధానాల తయారీలో విద్యాశాఖ నిమగ్నమైంది. దీనికి సంబంధించి రెండు, మూడు రోజుల్లోనే జీవో ఇచ్చేందుకు కసరత్తు చేస్తున్నది. ఇప్పటికే రాష్ట్రంలో 5,089 రెగ్యులర్ టీచర్ పోస్టులతో పాటు, 1,523 స్పెషల్ టీచర్ పోస్టుల భర్తీకి ఫైనాన్స్ డిపార్ట్​మెంట్ క్లియరెన్స్ ఇచ్చింది. దీంతో స్కూల్ ఎడ్యుకేషన్ అధికారులు పరీక్ష నిర్వహణ గైడ్​లైన్స్, షెడ్యూల్ ఇచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. 

1 నుంచి 7వ తరగతులకు అనుగుణంగా స్థానికతలో మార్పులతో పాటు 95 శాతం లోకల్ కేటగిరీ ఉద్యోగాలు, కొత్త రిజర్వేషన్ల అమలు తదితర అంశాలను దాంట్లో పేర్కొననున్నారు. ఈ క్రమంలోనే రోస్టర్ పాయింట్లపై స్పష్టత ఇవ్వనున్నారు.  ప్రస్తుతం ఆన్​లైన్​లో ఎగ్జామ్ నిర్వహించాలనే ప్రతిపాదనలూ వస్తున్నాయి. రాత పరీక్షను రెండు రోజుల్లో మూడు సెషన్లలో పూర్తి చేయొచ్చు. అదే ఆన్​లైన్ పరీక్ష అయితే, కనీసం వారం నుంచి పది రోజుల పాటు నిర్వహించాల్సి వస్తుంది. దీంతో, అన్ని రోజుల పాటు ఆన్​లైన్​ ఎగ్జామ్స్ స్లాట్ దొరుకుతుందా లేదా అనేదానిపైనా అధికారులు చర్చలు జరుపుతున్నారు. సర్కారు ఇచ్చే జీవోలో దీనిపై స్పష్టత రానున్నది.