మిడ్​ డే మీల్స్ బకాయిలు చెల్లించినం.. హ‌రీశ్ రావు లేఖ‌కు విద్యా శాఖ జవాబు

మిడ్​ డే మీల్స్ బకాయిలు చెల్లించినం.. హ‌రీశ్ రావు లేఖ‌కు విద్యా శాఖ జవాబు

 

  • త్వరలో మరో రూ.53 కోట్లు విడుదల చేస్తామని వెల్లడి

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో మిడ్​ డే మీల్స్ బిల్లులకు సంబంధించి గ‌త డిసెంబ‌రు నాటికి బ‌కాయి పడిన రూ.50 కోట్లతో పాటు అద‌నంగా మ‌రో రూ.50.45 కోట్లను విడుద‌ల చేశామని విద్యా శాఖ స్పష్టం చేసింది. త్వరలో మ‌రో రూ.53.07 కోట్లను విడుద‌ల చేస్తామని పేర్కొంది.  విద్యా శాఖ స‌మ‌స్యలపై స్పందించాలని సీఎం రేవంత్  రెడ్డికి మాజీ మంత్రి హ‌రీశ్ రావు రాసిన లేఖ‌కు ఆ శాఖ స్పందించింది. గ‌త ప్రభుత్వ హ‌యాంలో 5,089 పోస్టుల‌తో డీఎస్సీ విడుద‌ల చేస్తే, తాజాగా ఆ నోటిఫికేష‌న్‌ను ర‌ద్దుచేసి అంత‌కు రెట్టింపు సంఖ్య 11,069 పోస్టుల‌తో  నోటిఫికేష‌న్ విడుద‌ల చేశామని, ఈ నెల18 నుంచి డీఎస్సీ ప‌రీక్షలు ప్రారంభం కానున్నాయ‌ని వెల్లడించింది. మ‌ధ్యాహ్న భోజ‌న కుక్  క‌మ్  హెల్పర్లకు రాష్ట్ర ప్రభుత్వం జూన్  వ‌ర‌కు నెల‌కు రూ.వెయ్యి చొప్పున చెల్లించిందని, అద‌నంగా ప్రభుత్వం చెల్లిస్తున్న రూ.2 వేలల్లో 80 శాతం చెల్లింపులు పూర్తయ్యాయని, మిగిలిన రూ.9.44 కోట్లు త్వర‌లోనే చెల్లిస్తామని వెల్లడించింది.

 ‘‘గ‌త ప్రభుత్వం పెండింగ్‌లో పెట్టిన 9, 10వ త‌ర‌గ‌తుల వంట ఖ‌ర్చుల‌కు సంబంధించిన బిల్లులు రూ.8.74 కోట్లు డీఈఓల‌కు ఇప్పటికే చెల్లించాం. మిగిలిన బ‌కాయిలు త్వరలోనే విడుద‌ల చేస్తాం. కోడిగుడ్ల బిల్లుల‌కు సంబంధించి మార్చి నెల వ‌ర‌కు రూ.13.82 కోట్ల చెల్లింపులు పూర్తయ్యాయి. మ‌రో రూ.8.48 కోట్లు చెల్లిస్తాం” అని విద్యా శాఖ అధికారులు తెలిపారు. అలాగే పారిశుద్ధ్య కార్మికుల‌ను నియ‌మించాల‌ని రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయించిందని గుర్తుచేశారు.