- సర్కారుకు స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ నవీన్ నికోలస్ లేఖ
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని టీచర్ల ఖాళీల నేపథ్యంతో ఐదు జిల్లాల్లో తాత్కాలికంగా 1,428 మంది అకడమిక్ ఇన్ స్ట్రక్టర్లను( విద్యావలంటీర్లు) నియమించుకునేందుకు అనుమతి ఇవ్వాలని స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ డాక్టర్ నవీన్ నికోలస్ ప్రభుత్వాన్ని కోరారు. ఈ మేరకు ఇటీవల విద్యాశాఖ సెక్రెటరీకి ఆయన లేఖ శారు.
డీఈఓల నుంచి అందిన ప్రతిపాదనల ప్రకారం జోగులాంబ గద్వాలలో 244 మంది, నారాయణపేటలో 320 మంది, వికారాబాద్ లో 123 మంది, మేడ్చల్ మల్కాజ్ గిరిలో 520 మంది, రంగారెడ్డి జిల్లాలో 221 మంది అవసరమని తెలిపారు. డిప్యూటేషన్లు, రిటైర్‌మెంట్లు, బదిలీల నేపథ్యంలో ఆయా జిల్లాల్లో ఖాళీలు ఏర్పడ్డాయని లేఖలో పేర్కొన్నారు.
విద్యాప్రమాణాల పెంపునకు అకాడమిక్ ఇన్ స్ట్రక్టర్లు తక్షణ అవసరమని తెలిపారు. అయితే,గతంలో విద్యావాలంటీర్లకు రూ.12వేల వేతనం ఇచ్చే వాళ్లమని, ప్రస్తుతం అకాడమిక్ ఇన్ స్ట్రక్టర్లకు రూ.15,600 చెల్లించాల్సి ఉందని పేర్కొన్నారు. వీరి నియామకానికి కావాల్సిన నిధులను మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు.
