- విద్యాశాఖ కార్యదర్శి యోగితా రాణా
- నైపుణ్యాభివృద్ధి’పై ఓయూలో ఉన్నతస్థాయి సమీక్ష
హైదరాబాద్, వెలుగు: ‘నైపుణ్యాభివృద్ధి’పై ఉస్మానియా యూనివర్సిటీలో బుధవారం ఉన్నత స్థాయి సమీక్ష జరిగింది. ప్రభుత్వ సలహాదారు కె. కేశవరావు, విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి యోగితా రాణా, కాలేజియేట్ కమిషనర్ శ్రీదేవసేన, ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ బాలకిష్టారెడ్డి, ఓయూ వీసీ కుమార్ సహా పలు వర్సిటీల వీసీలు, పారిశ్రామికవేత్తలు సుమారు 5 గంటల పాటు సుదీర్ఘంగా చర్చించారు.
వచ్చే విద్యాసంవత్సరం నుంచి స్కిల్ డెవలప్మెంట్ను సిలబస్లో అంతర్భాగం చేయాలని, స్కిల్ ఇకపై ఆప్షన్ కాకూడదని, తప్పనిసరి కావాలని యోగితా రాణా సూచించారు. విద్యార్థి కాలేజీలో చేరిన నాటి నుంచే ఇంటర్న్షిప్లు, ఇండస్ట్రీ ట్రైనింగ్ ఉండేలా రోడ్ మ్యాప్ సిద్ధం చేయాలని ఆదేశించారు. ఫ్యూచర్ రెడీ కోర్సుల్లో భాగంగా 4 వేల సీట్లు పెంచనున్నట్లు ప్రకటించారు.
కేవలం సమావేశాలు పెట్టి ప్రభుత్వాలను పొగడటం వల్ల ఉపయోగం లేదని, ఆలోచనలను ఆచరణలో పెడితేనే ఫలితం ఉంటుందని కె. కేశవరావు సూచించారు. ఇప్పటికే కొన్ని కాలేజీల్లో ఇంటర్న్షిప్లు ప్రయోగాత్మకంగా అమలవుతున్నాయని, ప్రిన్సిపాల్స్ చొరవ తీసుకుంటే మంచి ఫలితాలు వస్తాయని కమిషనర్ శ్రీదేవసేన పేర్కొన్నారు. సమావేశంలో ఐఐటీ, ఐఎస్‌బీ నిపుణులు, క్రెడాయ్ ప్రతినిధి శేఖర్ రెడ్డి తదితరులు పాల్గొని విద్యార్థులకు శిక్షణ ఇచ్చేందుకు సంసిద్ధత వ్యక్తం చేశారు.
