హైదరాబాద్, వెలుగు: రాష్ట్రవ్యాప్తంగా ఈనెల 11 నుంచి 17వ తేదీ వరకు విద్యా వారోత్సవాలు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రజా పాలన - ప్రగతి ప్రణాళిక 99 రోజుల యాక్షన్ ప్లాన్లో భాగంగా ఈ వేడుకలను నిర్వహించనున్నారు. దీనికి అనుగుణంగా రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో షెడ్యూల్ ప్రకారం కార్యక్రమాలు చేపట్టాలని స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ నవీన్ నికోలస్ ఉత్తర్వులు జారీచేశారు. సర్కారు స్కూళ్ల బలోపేతానికి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు, సాధించిన విజయాలను ప్రజల్లోకి తీసుకెళ్లడమే వారోత్సవాల ప్రధాన ఉద్దేశమని పేర్కొన్నారు.
వార్షికోత్సవాల్లో భాగంగా తొలిరోజు సోమవారం పౌండేషన్ డే నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా పూర్తయిన అడిషనల్ క్లాస్ రూములు, స్కూల్ బిల్డింగులు, ల్యాబొరేటరీలు, టాయిలెట్లు తదితర వాటిని ప్రారంభించనున్నారు. దీంతో పాటు కొత్తగా మంజూరైన పనులకూ భూమి పూజ చేయనున్నారు. సమగ్ర శిక్ష, పీఎంశ్రీ, సీఎస్ఆర్ నిధులు, క్యూర్ నిధులతో వీటిని చేపట్టనున్నారు. ఈ కార్యక్రమాల్లో ప్రజాప్రతినిధులు ఏఏపీసీ కమిటీ సభ్యులు, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొనేలా చర్యలు తీసుకోవాలని అధికారులు సూచించారు.
