- మంత్రి వివేక్ వెంకటస్వామి
రవీంద్రభారతి, వెలుగు: రాష్ట్రంలో యువ కళాకారులకు అవకాశాలు కల్పించడంలో యువ నాటకోత్సవాలు కీలక పాత్ర పోషిస్తాయని, ఇలాంటి వేదికలను సద్వినియోగం చేసుకుని యువత తమ ప్రతిభను ప్రదర్శించాలని రాష్ట్ర మైనింగ్, కార్మిక శాఖ మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి అన్నారు. తెలంగాణ సంగీత నాటక అకాడమీ ఆధ్వర్యంలో రవీంద్రభారతిలో ఏర్పాటు చేసిన మూడు రోజుల యువ నాటకోత్సవాలను బుధవారం ఆయన ప్రారంభించారు.
తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను కాపాడటంలో నాటక రంగానికి విశిష్ట స్థానం ఉందన్నారు. సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలోని ప్రజా ప్రభుత్వం కళలను ప్రోత్సహించేందుకు ప్రత్యేక నిధులు కేటాయిస్తోందని, యువత ఇలాంటి వేదికలను ఉపయోగించుకుని ఉన్నత స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు. అకాడమీ అధ్యక్షురాలు ప్రొఫెసర్ అలేఖ్య పుంజాల కృషిని ఈ సందర్భంగా మంత్రి అభినందించారు.
ఉత్సవాల్లో భాగంగా మొదటి రోజు తెలుగు యూనివర్సిటీ విద్యార్థులు ప్రదర్శించిన సామాజిక ఇతివృత్తం కలిగిన “డింభక రాజ్యం” వీధి నాటకం ప్రేక్షకులను ఆలోచింపజేసింది. అనంతరం ప్రదర్శించిన “గేమ్” , “శ్రీ మహిషాసుర మర్దని” నాటకాలు అలరించాయి.
