
వ్యవసాయంలో పంజాబ్ రైతులు వినూత్న పద్దతిని వినియోగిస్తున్నారు. సుకాసుకాకే పానీ అంటూ నీటి ఎద్దడి ఉన్న ప్రాంతాల్లో వరిసాగుకు కావాల్సిన నీటిని అందిస్తున్నారు. ఈ పద్దతిని అధికారికంగా ఆల్టర్నేట్ వెట్టింగ్ అండ్ డ్రైయింగ్(AWD) అని పిలుస్తున్నారు. అంటే పొలం ఎండిపోయిన తర్వాత నీరుపోయడం అని అర్థం. నేలను నిరంతరం నీటిలో ఉంచకుండా ఓ నిర్దిష్ట స్థాయికి ఎండిన తర్వాత నీటిని పెట్టడం ద్వారా పంటలకు సమర్థవంతంగా నీరు అందించేందుకు ఈ పద్దతి సాయపడుతుంది.
ఎలా పనిచేస్తుంది..
రైతులు 2 అడుగుల పొడవు గల సాధారణ PVC పైపులను పొలాల్లో ఏర్పాటు చేస్తారు. ఈపైపుకు చుట్టు రంధ్రాలు చేస్తారు. తర్వాత పొలంలో రెండు ఫీట్ల లోతుకు పాతుతారు. పైపు లోపల నీటి మట్టాన్ని ఎప్పటికప్పుడు చెక్ చేస్తుంటారు. ఆ పైపులో నీరు కనిపిస్తే పంటకు నీరు అవసరం లేదు. అది పొడిగా ఉంటే నీరు పెట్టే సమయం వచ్చిందని దానర్ధం.. దీనిని దృష్టిలో పెట్టుకొని పంటకు నీరందిస్తారు.
ఈపద్దతి ద్వారా వరి పంటలకు ఎక్కువ నీరు అందించే సాధారణ విధానానికి స్వస్తి పలకవర్చు. నీటి ఎద్దడి ఉన్న ప్రాంతాల్లో ఇది బాగా ఉపయోగపడుతుంది.. సాంప్రదాయ పద్దతులతో పోలిస్తే 3నుంచి 4 రెట్ల నీటి వినియోగాన్ని తగ్గిస్తుంది.
ప్రయోజనాలు
నీటి ఆదా.. వరి లాంటి నిత్యం నీరు కావాల్సిన పంటలకు నీటి వినియోగాన్ని 20 నుంచి -40శాతం తగ్గిస్తుంది. భూగర్భజలాలు వేగంగా క్షీణిస్తున్న పంజాబ్ వంటి నీటి కొరత ప్రాంతాలలో ఇది చాలా ఉపయోగపడుతుంది. నీటి కొరత ఉన్న ఎక్కడైన ఈ పద్దతిని ఉపయోగించవచ్చు.
పర్యావరణ ప్రభావం..పొలాల నుంచి మీథేన్ ఉద్గారాలను తగ్గిస్తుంది..షీత్ బ్లైట్ వంటి వ్యాధులు రాకుండా నివారిస్తుంది. తద్వారా పురుగుమందుల అవసరాలను తగ్గిస్తుంది. నేల ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది.
ఖర్చు ఆదా.. పంటలకు తక్కువ టైం నీరందించడం ద్వారా కరెంట్ ఆదా, ఈ పైపులను తరచుగా సహాయక సంస్థలు ఉచితంగా అందిస్తాయి.
పంట దిగుబడి: పంటకు సరియైన రీతిలో నీరందించడం ద్వారా దిగుబడిని పెంచుతుంది.
పంజాబ్‌లో అమలు
మానవ్ వికాస్ సంస్థాన్ ,ది నేచర్ కన్జర్వెన్సీ వంటి సమూహాల నేతృత్వంలో PRANA ప్రాజెక్ట్ కింద ఈ టెక్నాలజీని అమలు చేస్తున్నారు. ఫతేఘర్ సాహిబ్, జలంధర్, లూధియానా, మలేర్‌కోట్ల, సంగ్రూర్ ,పాటియాలా వంటి జిల్లాల్లో 75వేల పైగా ఎకరాల్లో ఈ పద్దతిని వినియోగిస్తున్నారు. ఇటీవల 30వేల పైపులు పంపిణీ చేశారు. రైతు క్షేత్ర కేంద్రాలు, డెమో ప్లాట్లు ,పీర్ లెర్నింగ్ ద్వారా శిక్షణ ఇస్తున్నారు.
ఈ విధానం రికార్డు వరి సాగు చేస్తున్న పంజాబ్ ఎదుర్కొంటున్న సవాళ్లను పరిష్కరిస్తూ, కొత్త పద్దతుల్లో వ్యవసాయాన్ని ప్రోత్సహిస్తుంది.