సియాటెల్: ఫిఫా వరల్డ్ కప్ ఫేవరెట్ జట్లలో ఒకటైన బెల్జియం తొలి మ్యాచ్‌లోనే నిరాశపర్చింది. గ్రూప్–జిలో భాగంగా మంగళవారం ఈజిప్ట్‌తో జరిగిన మ్యాచ్‌ను 1–1తో డ్రాగా ముగించింది. బెల్జియం స్టార్లు రొమేలు లుకాకు, కెవిన్ డి బ్రూయిన్‌లకు చాలా అవకాశాలు వచ్చినా గోల్స్‌గా మలచడంలో ఫెయిలయ్యారు.
ఆట 19వ నిమిషంలో ఇమామ్ అషూర్ అద్భుత గోల్‌తో ఈజిప్ట్‌కు ఆధిక్యాన్ని అందించాడు. ఇంటర్నేషనల్ కెరీర్‌లో అషూర్‌కు ఇది తొలి గోల్ కావడం విశేషం. తొలి హాఫ్ మొత్తం రక్షణాత్మక శైలిలో వైఫల్యాలు ఎదుర్కొన్న బెల్జియంను సెకండాఫ్‌లో లుకాక్‌కు ఆదుకున్నాడు. లేదంటే 2022 ఖతార్ వరల్డ్ కప్ తరహాలోనే ఈసారి కూడా బెల్జియం లీగ్ దశలోనే ఇంటిబాట పట్టే పరిస్థితి వచ్చేది.
సెకండాఫ్‌లో సబ్‌స్టిట్యూట్‌గా లుకాకు గ్రౌండ్‌లోకి రాగానే బెల్జియం ఫ్యాన్స్ చప్పట్లతో స్వాగతం పలికారు. వచ్చిన 23 సెకన్లలోనే మ్యాచ్ స్వరూపాన్ని మార్చేశాడు. ఈజిఫ్ట్ డిఫెన్స్‌ను ఛేదిస్తూ దాడులు తీవ్రతరం చేశాడు. ఈ క్రమంలో 66వ నిమిషంలో గ్రౌండ్ మధ్య భాగం నుంచి దూసుకెళ్తూ ప్రత్యర్థి గోల్ పోస్ట్ వైపు బంతిని నెట్టే ప్రయత్నం చేశాడు.
దాంతో బంతిని అడ్డుకోబోయిన ఈజిప్ట్ డిఫెండర్ మహ్మద్ హనీ కారణంగా ‘ఓన్ గోల్’ చేయడంతో బెల్జియం ఖాతా తెరిచింది. దాంతో స్కోరు 1–1తో సమమైంది. మ్యాచ్ అంతటా బెల్జియం ఎక్కువ భాగం బంతిని ఆధీనంలో ఉంచుకున్నా.. గోల్స్ చేయడంలో మాత్రం తడబడింది. మిడ్ ఫీల్డర్ బ్రూయిన్ 7, 53వ నిమిషాల్లో చేసిన గోల్స్ ప్రయత్నాలు కొద్దిలో తప్పిపోయాయి. మ్యాచ్ ముగిసే టైమ్‌లో లుకాక్‌కు హెడర్ ద్వారా గోల్ చేసే చాన్స్ వచ్చినా బంతి గోల్ పోస్ట్ పైనుంచి దూసుకుపోయింది.
- చివర్లో గట్టెక్కిన ఉరుగ్వే
మయామి గార్డెన్స్: సౌదీ అరేబియాతో జరిగిన మ్యాచ్‌లో ఉరుగ్వే చివర్లో గట్టెక్కింది. దాంతో ఇరుజట్ల మధ్య జరిగిన మ్యాచ్ 1–1తో డ్రా అయ్యింది. మ్యాచ్ 80వ నిమిషంలో స్టార్ ప్లేయర్ మాక్సీ అరాజో గోల్ చేయడంతో ఉరుగ్వే ఓటమి నుంచి తప్పించుకుని ఒక పాయింట్‌ను సాధించింది.
తొలి అర్ధభాగం మొత్తం సౌదీ హవానే కొనసాగింది. 41వ నిమిషంలో అబ్దుల్ ఎలా అల్‌అమ్రి వచ్చిన అవకాశాన్ని చక్కగా సద్వినియోగం చేసుకుని గోల్ కొట్టాడు. ఉరుగ్వే గోల్ కీపర్ ఫెర్నాండో ముస్లెరా హెడర్‌ను అడ్డుకున్నప్పటికీ రీ బౌండ్ అయిన బాల్‌ను అమ్రి గోల్ పోస్ట్‌లోకి పంపాడు. దాంతో సౌదీ 1–0 ఆధిక్యంలో నిలిచింది.
సెకండాఫ్‌లో ఉరుగ్వే స్ట్రాటజీని మార్చింది. ఎక్కువసేపు బంతిని ఆధీనంలో ఉంచుకుని సౌదీ గోల్ పోస్ట్‌లపై వరుసగా దాడులు చేసింది. మ్యాచ్ మొత్తంలో ఉరుగ్వే గోల్ కోసం 29 సార్లు ప్రయత్నించగా, సౌదీ కేవలం ఏడుసార్లకే పరిమితమైంది. ఓవరాల్‌గా 2022 ప్రపంచకప్‌లో అర్జెంటీనాను ఓడించి సంచలనం సృష్టించిన సౌదీ.. ఈ మ్యాచ్‌లోనూ అదే జోరును ప్రదర్శించింది.
