వీధుల్లో వరద.. ఇండ్లలోనే జనం

వీధుల్లో వరద.. ఇండ్లలోనే జనం
  • చెన్నైని మళ్లీ ముంచెత్తిన వాన
  • 14కు పెరిగిన మృతుల సంఖ్య

చెన్నై: భారీ వర్షాలు, వరదలతో చెన్నై అతలాకుతలమవుతోంది. వీధులు చెరువులను తలపిస్తున్నాయి. గురువారం మరోసారి భారీ వర్షం కురవడంతో చెన్నై సహా శివారు జిల్లాల్లోని చాలా ప్రాంతాలు నీట మునిగాయి. నడుములోతు నీళ్లు పేరుకుపోవడంతో జనం ఇండ్లలోంచి బయటికివచ్చే పరిస్థితి లేకుండా పోయింది. నాలుగైదు రోజులుగా చెన్నైలోని చాలా ప్రాంతాలకు కరెంటు నిలిచిపోయింది. వర్షాలు, వరదల వల్ల చనిపోయిన వాళ్ల సంఖ్య 14 కు పెరిగింది. చెన్నై, పుదుచ్చేరితో సహా 8 జిల్లాలకు ప్రభుత్వం రెడ్ అలర్ట్ ప్రకటించింది. ఈ జిల్లాల్లో స్కూళ్లు, కాలేజీలకు వరుసగా నాలుగో రోజు సెలవు ప్రకటించారు.

చెన్నైకి సమీపంలోనే వాయుగుండం తీరం దాటడంతో మరో 48 గంటలు భారీ నుంచి అతి భారీ వర్షాలు పడొచ్చని వాతావరణ విభాగం హెచ్చరించింది. గంటకు 45 కిలోమీటర్ల వేగంతో గాలులు కొనసాగుతాయని అంచనా వేసింది. ప్రజలు ఆహారం, మంచినీళ్లు నిల్వ చేసుకోవాలని, అత్యవసరమైతే తప్ప ఇండ్లలోంచి బయటికి రావొద్దని ప్రభుత్వం కోరింది.

విమానాల రాక నిలిపివేత

ఎయిర్​పోర్టు వద్ద బలమైన గాలులు వీస్తుండడంతో ముందుజాగ్రత్త చర్యగా విమానాల ల్యాండింగ్​కు అధికారులు అనుమతివ్వలేదు. గురువారం మధ్యాహ్నం ఒంటిగంట నుంచి సాయంత్రం 6 గంటల వరకు చెన్నైకి రావాల్సిన విమానాలను వేరే ఎయిర్​పోర్టులకు మళ్లించారు. అయితే, ఇక్కడి నుంచి ఇతర ప్రాంతాలకు వెళ్లే విమానాల టైమింగ్ మార్చలేదని ఎయిర్​పోర్టు అధికారులు చెప్పారు. ప్రయాణికుల సేఫ్టీ కోసమే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ఆవడి, అంబత్తూరు వద్ద పట్టాలపై నీరు చేరడంతో చెన్నై సెంట్రల్ నుంచి తిరువళ్లూరుకు పలు సర్వీసులను నిలిపివేసినట్లు దక్షిణ రైల్వే తెలిపింది.

ఇండ్లలోకి జలగలు, పాములు

ఎడతెరిపి లేకుండా పడుతున్న వానలకు పెరంబూర్ బ్యారక్స్ రోడ్, పట్టాళం, పులియంతోప్ నీట మునిగాయి. వరదలతో రోడ్లు నదుల్ని తలపిస్తున్నాయి. డ్రైనేజీ నీళ్లతో కలిసి వరద నీరు ఇండ్లలోకి చేరింది. దీంతో అంటువ్యాధులు ప్రబలే ప్రమాదం ఉందని ప్రజలు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. ఇండ్లలోకి జలగలు, పాములు వస్తున్నాయని చాలామంది వేరే ప్రాంతాలకు వెళుతున్నారు. చెన్నైలోని ఒక్క తిరువికాస్ నగర్(జోన్6)​లోనే దాదాపు 40 వేల మందిపై ఎఫెక్ట్ పడిందని నివేదికలు చెప్తున్నాయి. నడుంలోతు నీళ్లుండటంతో సహాయ చర్యలు చేపట్టడం కష్టంగా మారిందని అధికారులు చెప్తున్నారు.

భుజాలపై మోసుకెళ్లి..

చెన్నైలోని ఓ శ్మశానం వద్ద సోయితప్పి పడి ఉన్న ఓ వ్యక్తిని మహిళా పోలీస్​ ఆఫీసర్ కాపాడారు. శ్మశానం నుంచి ఆటో వరకు భుజాలపై ఎత్తుకెళ్లి ఆస్పత్రికి తరలించిన వీడియో సోషల్ మీడియా లో వైరల్ అయింది. గురువారం టీపీ చట్రం ఏరియాలోని శ్మశాన వాటికలో ఉదయ్​కుమార్ అనే యువకుడు స్పృహ తప్పి పడి ఉన్నాడు. ఈ సమాచారం అందుకున్న ఇన్​స్పెక్టర్ రాజేశ్వరి.. వెంట నే అక్కడికి చేరుకున్నారు. ఆస్పత్రికి తరలించేందుకు ఆ యువకుడిని రాజేశ్వరి భుజాలపై మోసుకెళ్లి, 
ఓ ఆటోలో ఆస్పత్రికి తరలించారు.