Cricket: లక్నో పిచ్పై విమర్శలు..క్యూరేటర్పై వేటు

Cricket: లక్నో పిచ్పై విమర్శలు..క్యూరేటర్పై వేటు

టీమిండియా, న్యూజిలాండ్  రెండో టీ20కు వేదికైన లక్నో పిచ్పై సర్వత్రా విమర్శలు వ్యక్తమైన నేపథ్యంలో పిచ్ క్యూరేటర్పై ఉత్తరప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్ వేటు వేసినట్లు తెలుస్తోంది. తక్షణమే క్యూరేటర్ సురేందర్ ను బాధ్యతల నుంచి తప్పించినట్లు యూపీ మీడియా పేర్కొంది. 

చెత్త పిచ్..

లక్నోలోని అటల్ బిహారీ వాజ్ పేయి ఏకనా క్రికెట్ స్టేడియంలో జరిగిన రెండో మ్యాచ్ లో తక్కువ స్కోర్లు నమోదయ్యాయి. బంతి గింగిరాలు తిరిగిన పిచ్ పై బ్యాట్స్ మన్ వంద పరుగులు చేయడానికే అపసోపాలు పడ్డారు. కనీసం ఒక్క సిక్స్ కూడా నమోదు చేయలేదు. టీ20ల్లో ఏమాత్రం ఊహించని స్పిన్ వికెట్‌ను చూసిన భారత్, న్యూజిలాండ్ ఆటగాళ్లు,  ప్రేక్షకులు షాక్‌కు గురయ్యారు. మ్యాచ్ చప్పగా సాగడంపై టీమిండియా కెప్టెన్ హార్దిక్ పాండ్యా అసంతృప్తి వ్యక్తం చేశాడు. ఇదో చెత్త పిచ్ అని చెప్పాడు. టీ20లకు ఈ పిచ్ ఏ మాత్రం సరిపోదన్నాడు. 

ఐపీఎల్ ఆడేందుకు రారు..

లక్నో లాంటి పిచ్‌లను టీ20లకు తయారు చేస్తే ఐపీఎల్ ఆడేందుకు ఎవరూ భారత్‌కు రారని టీమిండియా మాజీ ఓపెనర్ గౌతమ్ గంభీర్  సెటైర్లు వేశాడు.  గతేడాదే ఐపీఎల్‌లోకి ఎంట్రీ ఇచ్చిన లక్నో సూపర్ జెయింట్స్‌కు  ఇదే  హోం గ్రౌండ్ అవనుంది. ఈ నేపథ్యంలో రెండో టీ20 మ్యాచ్ కు తయారుచేసిన పిచ్‌ను ఐపీఎల్ మ్యాచ్‌లకు తయారుచేస్తే అది మొదటికే మోసం వస్తుందని బీసీసీఐ ఆందోళన వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో  ఉత్తరప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్‌  లక్నో పిచ్ క్యూరేటర్ సురేందర్‌పై వేటు వేసినట్లు  తెలుస్తోంది. 

కొత్త పిచ్‌ను సిద్దం 

లక్నో  పిచ్ క్యూరేటర్‌పై చర్యలు తీసుకున్నామని తెలిపిన యూపీ క్రికెట్ అసోసియేషన్... త్వరలోనే  కొత్త వికెట్‌ను రూపొందిస్తామని వివరణ ఇచ్చినట్లు సమాచారం.