ఎల్‌నినో ఎఫెక్ట్.. భారీగా తగ్గిన పంటల సాగు..ఆహార ద్రవ్యోల్బణం తప్పదా?

ఎల్‌నినో ఎఫెక్ట్.. భారీగా తగ్గిన పంటల సాగు..ఆహార ద్రవ్యోల్బణం తప్పదా?

ఎల్ నినో ఎఫెక్ట్ తో దేశవ్యాప్తంగా పంటల సాగు విస్తీర్ణం గణనీయంగా తగ్గింది. 12 శాతం వర్షపాతం లోటుతో ఖరీఫ్ లో చాలా రాష్ట్రాల్లో పంటల సాగు ఆందోళనకరంగా మారింది. ఎల్‌నినో ప్రభావంతో లోటు వర్షపాతం, నీటి కొరత కారణంగా వరి సాగు ఊహించని రీతిలో తగ్గింది. మొక్కజొన్న, సోయాబీన్, పత్తి సాగు విస్తీర్ణం కూడా క్షీణించింది.  ఖరీఫ్ ముగిసే సమయానికే ఇలా ఉంటే ఖరీఫ్ పరిస్థితి మరింత దారుణంగా ఉంటుందని కేంద్ర ప్రభుత్వం ప్రకటించడంతో రాబోయే రోజుల్లో ఆహార కొరత తప్పదని ఆందోళనలు వ్యక్త మవుతున్నాయి. 

చాలా రాష్ట్రాల్లో పలు పంటల్లో ఖరీఫ్ సాగు విస్తీర్ణం తగ్గింది. వరి సాగు విస్తీర్ణం అత్యధికంగా 16.32 లక్షల హెక్టార్లు తగ్గింది. మొక్కజొన్న, సోయాబీన్, పత్తి సాగు విస్తీర్ణం కూడా క్షీణించింది. అయితే పప్పుధాన్యాలు, చిరుధాన్యాల సాగు పెరిగింది. వర్షాలు తక్కువగా కురిసిన ప్రాంతాలు, జలాశయాల్లో నీటి నిల్వలు తగ్గిన ప్రాంతాలు, నేలలో తేమ సరిపోని ప్రాంతాల్లో ఎక్కువ పంటల సాగు మందగించింది. 

దీనికి తోడు భారీ వర్షాలు, వరదల కారణంగా పలు రాష్ట్రాల్లో సుమారు 6.11 లక్షల హెక్టార్ల పంటలు ప్రభావితమయ్యాయి. మరోవైపు 2026 చివరి నాటికి ఎల్‌నినో మరింత బలపడే అవకాశం ఉందని అంతర్జాతీయ వాతావరణ అంచనాలు సూచిస్తున్నాయి.

అయినప్పటికీ దేశవ్యాప్తంగా వ్యవసాయ సంక్షోభం లేదని, ఖరీఫ్ ఉత్పత్తిలో గణనీయమైన తగ్గుదల ఉండదని కేంద్ర వ్యవసాయ శాఖ చెబుతోంది. నీరు అవసరమయ్యే పంటలకు బదులుగా పప్పుధాన్యాలు, నూనెగింజలు సాగు చేయాలని సూచిస్తోంది.  అక్టోబర్‌లో ప్రారంభమయ్యే రబీ సాగు క్రమంలో ఈ వ్యూహాన్ని  పాటించాలని రైతులను కోరుతోంది. 

 ఆహార ధాన్యాలను ఉత్పత్తి లక్ష్యం కుదింపు..

2026-27లో 373.93 మిలియన్ టన్నుల ఆహార ధాన్యాలను ఉత్పత్తి చేయాలని కేంద్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. 2025-26లో నమోదైన రికార్డు స్థాయి 376.56 మిలియన్ టన్నుల ఉత్పత్తితో పోలిస్తే ఇది 2.63 మిలియన్ టన్నులు తక్కువ. అయితే గత ఏడాది నిర్దేశించిన 362 మిలియన్ టన్నుల ప్రారంభ లక్ష్యం కంటే మాత్రం ఇది ఎక్కువ.  కేంద్ర వ్యవసాయ శాఖ లెక్కల ప్రకారం.. కొత్త లక్ష్యంలో ఖరీఫ్ పంటల వాటా 196.21 మిలియన్ టన్నులు, రబీ పంటల వాటా 177.72 మిలియన్ టన్నులుగా ఉంది.

ఎల్‌నినో పరిస్థితులు, నీటి లభ్యత, నేలలో తేమ తదితర అంశాలను శాస్త్రీయంగా అంచనా వేసిన తర్వాతే ఈ లక్ష్యాలను నిర్ణయించినట్లు కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ తెలిపారు. ప్రస్తుతం దేశంలో వర్షపాతం సుమారు 12 శాతం లోటుగా ఉంది. దీంతో వర్షాభావ పరిస్థితులు ఉన్న ప్రాంతాల్లో పంటల సాగు విధానాలను మార్చే దిశగా ప్రభుత్వం చర్యలు చేపడుతోందన్నారు. 

ఓ వైపు ఎల్ నినో ప్రభావం, కొన్ని రాష్ట్రాల్లో భారీ వర్షాలు , వరదలో పంట సాగు ప్రభావితం అయినప్పటికీ  ఖరీఫ్ ఉత్పత్తిలో గణనీయమైన తగ్గుదల ఉండదని మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ తెలిపారు.దేశవ్యాప్తంగా వ్యవసాయ సంక్షోభం లేదని చెబుతున్నారు.