- ఏటూరు నాగారంలో 11.5 సెం.మీ. వర్షపాతం నమోదు
- మూడు రోజులు తేలికపాటి వర్షాలుంటాయన్న ఐఎండీ
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో ఎట్టకేలకు శుక్రవారం పలు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడ్డాయి. ముఖ్యంగా ములుగు, వరంగల్, హనుమకొండ జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో వానలు పడుతున్నాయి. ఆ జిల్లాలతో పాటు కామారెడ్డి, సంగారెడ్డి, జయశంకర్ భూపాలపల్లి, మంచిర్యాల, పెద్దపల్లి, మహబూబ్‌నగర్, నారాయణపేట, జోగులాంబ గద్వాల, వనపర్తి, నాగర్‌కర్నూల్, నల్గొండ జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురిశాయి. అత్యధికంగా ములుగు జిల్లా ఏటూరు నాగారంలో 11.5 సెంటీ మీటర్ల వర్షం కురిసింది.
వరంగల్ జిల్లా గీసుగొండలో 7.4 సెంటీ మీటర్లు, పైడిపల్లిలో 6.3, హనుమకొండలో 6.1, ఖాజీపేటలో 5.7, వరంగల్ జిల్లా గొర్రెకుంటలో 5.6, హనుమకొండ జిల్లా చింతగట్టులో 5.5, జోగులాంబ గద్వాల జిల్లా అల్వాల్పాడులో 5.4, నాగర్‌కర్నూల్ జిల్లా కోడేరులో 4.6, సంగారెడ్డి జిల్లా సిర్గాపూర్‌లో 4.4, గద్వాల జిల్లా తిమ్మనదొడ్డిలో 4.2 సెంటీ మీటర్ల చొప్పున వర్షపాతం నమోదైంది. మిగిలిన ప్రాంతాల్లోనూ మోస్తరు వానలు పడ్డాయి. రాష్ట్రంలో అల్పపీడన ప్రభావంతో మూడు రోజుల పాటు తేలికపాటి వర్షాలు పడుతాయని వాతావరణ శాఖ వెల్లడించింది. శుక్రవారం పలు చోట్ల భారీ వర్షాలు పడినా.. శనివారం నుంచి మాత్రం తగ్గుతాయని, తేలికపాటి వానలే ఉంటాయని తెలిపింది. అదే సమయంలో గాలుల ప్రభావం కొనసాగుతుందని వెల్లడించింది. రాష్ట్రవ్యాప్తంగా గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని పేర్కొంది. హైదరాబాద్‌లో మబ్బు పట్టి ఉంటుందని తెలిపింది.
