కొత్త మున్సిపాలిటీల్లో వృద్ధుల కష్టాలు

కొత్త మున్సిపాలిటీల్లో వృద్ధుల కష్టాలు
  • పెన్షన్ డబ్బుల కోసం లబ్ధిదారుల అవస్థలు
  • పోస్టాఫీసుల వద్ద గంటల కొద్దీ నిరీక్షణ
  • బ్యాంకు ఖాతాల్లో జమచేయని ఆఫీసర్లు 
  • వీలిన గ్రామాల లబ్ధిదారులకు తప్పని దూరభారం

రామకృష్ణాపూర్,వెలుగు: కొత్త మున్సిపాలిటీల్లో ఆసరా లబ్ధిదారులకు ఇబ్బందులు తప్పడంలేదు. పాత మున్సిపాలిటీల్లో పెన్షన్ డబ్బులు​లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేస్తున్నారు. ఈ విధానం కొత్త వాటిలో అమలు చేయకపోవడంతో దూరంలో ఉన్న పోస్టాఫీసులకు వెళ్లి వృద్ధులు, దివ్యాంగులు గంటల తరబడి నిరీక్షిస్తున్నారు.మంచిర్యాల జిల్లాలో ఏడు మున్సిపాలిటీలున్నాయి. ఇందులో మంచిర్యాల, మందమర్రి, బెల్లంపల్లి పాత మున్సిపాలిటీలు కాగా.. గ్రామపంచాతీల నుంచి కొత్తగా క్యాతన్​పల్లి, నస్పూర్, చెన్నూరు, లక్సెట్టిపేట మున్సిపాలిటీలుగా ఏర్పడి మూడేళ్లు దాటింది. క్యాతన్​పల్లి, చెన్నూరు, లక్సెట్టిపేట, నస్పూర్ మున్సిపాలిటీల్లో సుమారు 10,500 మంది ఆసరా లబ్ధిదారులు ఉన్నారు. ఆగస్టు నుంచి కొత్తగా క్యాతనపల్లికి 452, చెన్నూరు 338, లక్సెట్టిపేట 414, నస్పూర్​కు 1,232 కొత్తగా పెన్షన్లు మంజూరయ్యాయి.

గంటల కొద్దీ నిరీక్షణ...

పాత మున్సిపాల్టీలైనా మంచిర్యాల, మందమర్రి, బెల్లంపల్లిల్లో పెన్షన్​లబ్ధిదారులకు నేరుగా వారి బ్యాంకు ఖాతాలో డబ్బులు జమ చేస్తున్నారు. కొత్త మున్సిపాలిటీల్లో అలాంటి పద్ధతి లేకపోవడంతో వృద్ధులు పెన్షన్​ఇచ్చే రోజు తెల్లవారుజామున ఏడు గంటలకే ఆయా మున్సిపాలిటీల్లోని పోస్టాఫీస్​లు, ఇతర ప్రదేశాలకు చేరుకుంటున్నారు. నడవలేని స్థితిలో ఉన్న వారు ఆటోల ద్వారా వస్తున్నారు. విలీన గ్రామాల ప్రజలైతే ఐదారు కి.మీ దూరం ప్రయాణం చేసి..గంటల కొద్దీ నిరీక్షిస్తున్నారు. క్యాతనపల్లిలోని రామకృష్ణాపూర్​పోస్టాఫీస్​వద్ద పింఛన్  తీసుకోవడానికి పడరానిపాట్లు పడుతున్నారు. సిబ్బంది పెన్షన్లు కాకుండా తమకు ఇతర పనులు, లెటర్లు పంపిణీ చేయాల్సి ఉందంటూ వృద్ధులు, దివ్యాంగులతో కఠినంగా వ్యవహరిస్తున్నారు. కొంద మంది ఆఫీసర్లు సాంకేతిక లోపం, బ్యాంకు నుంచి క్యాష్​ ఆలస్యంగా తెచ్చామని సాకులు చెబుతూ ఇబ్బందిపెడుతున్నారు. ఇంకొన్ని మున్సిపాలిటీల్లో బయోమెట్రిక్​ ద్వారా వేలి ముద్రలు మ్యాచ్​కాని వృద్ధులు, దివ్యాంగులపై ఆఫీసర్లు దురుసుగా ప్రవర్తిస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ఇంకొన్ని చోట్ల చిలర్ల లేవంటూ పైన వచ్చే రూ.16 కోత ఇవ్వడంలేదరు. పాత మున్సిపాలిటీల్లో కొనసాగుతున్న మాదిరిగా పెన్షన్​బ్యాంకు ఖాతాలో జమచేయాలని లబ్ధిదారులు కోరుతున్నారు.

పైసలు బ్యాంకులో వేయండి...

రామకృష్ణాపూర్ పోస్టాఫీస్​కు వెళ్లుడు...అక్కడికి పోయినకం మెట్లు ఎక్కేందుకు గోసపడుతున్నాం. గంటల కొద్దీ నిరీక్షిస్తే తమకు ఇతర పనులున్నాయంటూ ఆఫీసర్లు డబ్బులు ఇయ్యడానికి ఆలస్యం చేస్తున్రు. బ్యాంకుల్లో డబ్బులు జమచేస్తే ఓపిక ఉన్నప్పుడు తీసుకుంటాం. 

– రాజమ్మ, క్యాతనపల్లి

తిరుగుడు ఇబ్బందిగా ఉంది..

పెన్షన్ డబ్బుల కోసం నెలలో రెండు, మూడు సార్లు తిరుగుతున్నా. ఎప్పుడు పైసలు ఇస్తున్రో తెలుస్తలేదు. గట్టిగా అడిగితే వేలి ముద్రలు పడటం లేదని వెళ్లగొడుతున్నారు. బ్యాంకు ద్వారా పెన్షన్ ఇస్తే బాధలు తప్పుతయి.

- గుప్పెటి మల్లికాంబా, నస్పూర్

ముసలోళ్లు గోసపడుతున్రు..

ఆర్కేపీ పోస్టాఫీస్​వద్ద పెన్షన్ తీసుకోవడం కోసం ముసలోళ్లు, దివ్యాంగులు గోపడుతున్రు. పోస్టీఫీస్, మున్సిపల్​ ఆఫీసర్లు కనికరం చూపడంలేదు. మంచినీళ్లు కూడా ఇస్తలేరు. లబ్ధిదారులు అప్పుడ్పుడు స్పృహతప్పి కిందపడుతున్నారు.

- వీరమల్ల పాలరాజయ్య, 
బీజేపీ లీడర్