వడాపావ్ కోసం ఆగితే..నగలు ఎత్తుకపాయె

వడాపావ్ కోసం ఆగితే..నగలు ఎత్తుకపాయె
  • పుణెలో రూ.5 లక్షల విలువైన నగలు ఎత్తుకెళ్లిన దొంగలు 

న్యూఢిల్లీ : ఓ వృద్ధ దంపతులు వడాపావ్ తిందామని ఆగితే, దొంగలు వాళ్ల నగలు ఎత్తుకెళ్లారు. ఈ ఘటన పుణెలో జరిగింది. సిటీకి చెందిన ఓ పెద్దాయన, ఆయన భార్య గురువారం బ్యాంక్ కు వెళ్లారు. అక్కడ పని చూసుకుని తిరిగి ఇంటికి వెళ్తుండగా వడాపావ్ తిందామని మార్గమధ్యలో ఆగారు. పెద్దాయన రోడ్డు పక్కన స్కూటీని ఆపి షాప్ లోపలికి వెళ్లగా, ఆయన భార్య అక్కడే స్కూటీ దగ్గర ఉంది. ఇంతలో అక్కడికి ఓ వ్యక్తి వచ్చి అక్కడే తచ్చాడుతూ ఉన్నాడు. 

ఆ టైమ్ లో మరో వ్యక్తి అటు నుంచి బైక్ పై వెళ్తూ ఏదో కిందపడిపోయిందని అక్కడున్న పెద్దాయన భార్యకు చెప్పాడు. ఆమె అది తీసుకుందామని కిందికి చూడగా, అప్పటికే అక్కడున్న మరో వ్యక్తి స్కూటీకి ముందటి భాగంలో ఉన్న కవర్ ను ఎత్తుకుని పరారయ్యాడు. అందులో రూ.5 లక్షల విలువైన నగలు, బ్యాంక్ డాక్యుమెంట్లు, సెల్ ఫోన్ ఉన్నదని బాధితులు వాపోయారు. దీనిపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు.