- త్వరలో పింఛన్ల పెంపు.. ఈ అంశంపై
- సీఎంతో చర్చించినం: మంత్రి వివేక్
- ప్రజా సంక్షేమమే ధ్యేయంగా రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తున్నది
- చేగుంటలో డిగ్రీ కాలేజీ మంజూరు చేయిస్తానని హామీ
- చేగుంట, నార్సింగిలో కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ
మెదక్ (చేగుంట)/ సిద్దిపేట/కోల్‌బెల్ట్, వెలుగు: ప్రజా సంక్షేమమే ధ్యేయంగా రాష్ట్ర ప్రభుత్వం పనిచే స్తున్నదని, రాష్ట్రంలో 17 లక్షల ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం లక్ష్యమని మంత్రి వివేక్ వెంకటస్వామి తెలిపారు. అర్హులైన పేదలందరికీ ఇందిరమ్మ ఇండ్లు మంజూరవుతాయని చెప్పారు. మంజూరైన ఇండ్లు త్వరితగతిన పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని అధి కారులను ఆదేశించారు. బుధవారం మెదక్ జిల్లా చేగుంటలో దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్‌రెడ్డితో కలిసి చేగుంట మండలానికి చెందిన లబ్ధిదారులకు రూ.38,04,408, నార్సింగి మండలానికి చెందిన లబ్ధిదారులకు రూ.8,00,928 విలువైన కల్యాణ లక్ష్మి, షాదీముబారక్ చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి వివేక్ వెంకటస్వామి
మాట్లాడుతూ.. వచ్చే ఏడాది నియోజకవర్గానికి మరో 3,500 ఇండ్లు మంజూరవుతాయని చెప్పారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక టీచర్ పోస్టులు భర్తీ చేశామని, ఇందిరమ్మ ఇండ్లు, కొత్త రేషన్ కార్డులు, 200 యూనిట్ల ఫ్రీ కరెంట్, రూ.500 గ్యాస్, రేషన్ కార్డుదారులకు సన్నబియ్యం సరఫరాలాంటి సంక్షే మ పథకాలు అమలు చేస్తున్నట్టు చెప్పారు. పింఛన్ల పెంపునకు సంబంధించి సీఎం రేవంత్‌రెడ్డితో సమావేశం జరిగిందని, త్వరలోనే పింఛన్ల పెంపు అమలవుతుందని తెలిపారు.
విద్యతోనే మంచి ఆలోచన..
గ్రామీణ ప్రాంతాల్లోని విద్యార్థులకు విద్య అనేది చాలా ముఖ్యమని మంత్రి వివేక్ తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డితో మాట్లాడి చేగుంటలో ప్రభుత్వ డిగ్రీ కాలేజీ మంజూరు చేయిస్తానని హామీ ఇచ్చారు. చేగుంట పరిసర ప్రాంతాల్లోని కంపెనీలతో మాట్లాడి సీఎస్‌ఆర్ నిధులతో డిగ్రీ కాలేజీ పూర్తి అయ్యేలా చూడాలని అధికారులను ఆదేశించారు. ఉమ్మడి మెదక్ జిల్లా ఇన్‌చార్జి మంత్రిగా ఈ ప్రాంత అభివృద్ధికి కట్టుబడి ఉంటానని హామీ ఇచ్చారు. కొత్తగా ఎన్నికైన సర్పంచులను మంత్రి వెంకటస్వామి శాలువాలతో సన్మానించారు.
ఈ కార్యక్రమంలో కలెక్టర్ రాహుల్ రాజ్, తూప్రాన్ ఆర్డీవో జయచంద్రారెడ్డి పాల్గొన్నారు. అంతకుముందు చేగుంట గ్రామ పంచాయతీ ఆఫీస్‌ను మంత్రి వెంకటస్వామి సందర్శించారు. గ్రామ పంచాయతీకి నూతన భవనం మంజూరుకు కృషి చేస్తానని తెలిపారు. గ్రామాల్లో సీసీ రోడ్లు, డ్రైనేజీలు ఇతర మౌలిక వసతుల కల్పనకు సహాయ, సహకారాలు అందిస్తానని హామీ ఇచ్చారు. కొత్తగా ఎన్నికైన సర్పంచులు గ్రామాల అభివృద్ధికి అహర్నిశలు కృషి చేసి, ప్రజల మన్ననలు పొందాలని సూచించారు. కాగా, మందమర్రి పట్టణం పాతబస్టాండ్ ఏరియాలోని బెతెస్తా మినిస్ట్రీస్ చర్చిలో బుధవారం రాత్రి క్రిస్మస్ వేడుకల్లో మంత్రి పాల్గొని ప్రత్యేక ప్రార్థనలు చేశారు. మంత్రి వెంట మంచిర్యాల డీసీసీ ప్రెసిడెంట్ రఘునాథ్‌రెడ్డి, చర్చి పాస్టర్ జైపాల్ రెడ్డి, కాంగ్రెస్ టౌన్ ప్రెసిడెంట్ నోముల ఉపేందర్ గౌడ్, స్థానిక లీడర్లున్నారు. అలాగే, దుబ్బాక నియోజకవర్గం అభివృద్ధిపై ప్రత్యేక శ్రద్ధవహిస్తానని మంత్రి వివేక్ హామీ ఇచ్చారు. బుధవారం దౌల్తాబాద్‌లో కొత్త సర్పంచుల సన్మాన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ సత్తా చాటిందని, ఇదే స్ఫూర్తితో జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో కాంగ్రెస్ కార్యకర్తలు ఐక్యంగా పార్టీ అభ్యర్థులను గెలిపించడానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. అనంతరం దౌల్తాబాద్‌లో ప్రభుత్వం తరఫున నిర్వహించిన క్రిస్మస్ సంబురాల్లో మంత్రి వివేక్ పాల్గొన్నారు.
కేటీఆర్ లీడర్ షిప్ అట్టర్ ప్లాప్
కేటీఆర్ లీడర్ షిప్ అట్టర్ ప్లాప్ అయిందని, వరుస ఓటములతో ఆ పార్టీ రాబోయే కాలంలో గల్లంతవడం ఖాయమని మంత్రి వివేక్ వెంకటస్వామి అన్నారు. మంచిర్యాల జిల్లా మందమర్రి బీ1 కాంగ్రెస్ ఆఫీస్‌లో ఏర్పా టు చేసిన కార్యక్రమంలో మందమర్రి మండలం సారంగపల్లి గ్రామానికి చెందిన బీఆర్‌ఎస్ లీడర్లు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో మంత్రి సమక్షంలో కాంగ్రెస్‌లో చేరారు. వారికి కండువాలు కప్పి పార్టీలోకి మంత్రి ఆహ్వానిం చారు. కేటీఆర్ నాయకత్వంలో బీఆర్‌ఎస్ వరుసగా ఎన్నికల్లో ఓడిపోవడం, మరోపక్క కవిత ఆ పార్టీ బండా రం బయటపెట్టడం, హరీశ్ రావు షైన్ కావడంతో కేసీఆర్ ఫ్రస్ట్రేషన్‌కు గురవుతున్నారన్నారు. దిక్కుతోచని స్థితిలో కొడుకును కాపాడుకోవడం కోసం ఇష్టమొచ్చినట్టు మాట్లాడుతున్నారని విమర్శించారు.
