- ఆచారాల ప్రకారం పూజలు నిర్వహించిన
- దబ్బగట్ల, పెనక వంశీయులు
- కొండాయి, పూనుగొండ్ల నుంచి మేడారం వచ్చిన పూజారులు
- గద్దెలపై ధ్వజస్తంభాల ప్రతిష్టతో ఘనంగా తొలి ఘట్టం
- విశిష్ట తంతులో పాల్గొన్న మంత్రి సీతక్క, జిల్లా అధికారులు
- డోలు వాయిద్యాలు, ఆదివాసీ నృత్యాలతో సందడి
ములుగు/తాడ్వాయి, వెలుగు: ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారంలో కొత్తగా నిర్మించిన రాతి శిలల నడుమ గద్దెలపై గోవిందరాజులు, పగిడిద్ద రాజు కొలువుదీరారు. ప్రభుత్వ మాస్టర్ ప్లాన్ప్రకారం నిర్వహిస్తున్న పనుల్లో భాగంగా ఒకే వరుసలోకి గద్దెల నిర్మాణం పూర్తికావడంతో పూజారులు సాంప్రదాయ పూజలు నిర్వహించారు. బుధవారం గోవిందరాజులు, పగిడిద్దరాజు గద్దెలకు ప్రాణప్రతిష్టను వైభవంగా నిర్వహించారు. కొత్తగా నిర్మించిన గద్దెలన్నింటినీ సాంప్రదాయబద్ధంగా అలంకరించారు. దీంతో తొలి ఘట్టం ప్రారంభమైంది. గద్దెలపై ధ్వజస్తంభాలను ఏర్పాటు చేశారు. రాష్ట్ర పంచాయతీరాజ్‌శాఖ మంత్రి సీతక్క పాల్గొన్నారు.
దబ్బగట్ల, పెనక వంశీయుల రహస్య పూజలు..
ఏటూరునాగారం మండలం కొండాయి గ్రామం నుంచి దబ్బగట్ల వంశీయులైన గోవిందరాజుల పూజారులు దబ్బకట్ల గోవర్ధన్ ఆధ్వర్యంలో మేడారానికి తరలివచ్చారు. ఉదయం 6 గంటలకు డప్పు చప్పుళ్లు, డోలు వాయిద్యాల నడుమ నూతన గజ స్తంభాన్ని భుజాలపై ఎత్తుకొని పసుపు, కుంకుమ, కొబ్బరి, నూతన వస్త్రాలతో పాత గద్దెకు చేరుకున్నారు. అక్కడ పూజలు నిర్వహించి.. కొత్తగా ఏర్పాటు చేసిన గద్దె వద్దకు వచ్చారు. పూలు, నూతన వస్త్రాలతో గద్దె చుట్టూ అలంకరించిన పూజారులు.. పూజలు చేశారు. అనంతరం గజ స్తంభాన్ని కొత్త గద్దెపై ప్రతిష్టించారు. మహబూబాబాద్ జిల్లా గంగారం మండలం పూనుగొండ్ల నుంచి పెనక వంశీయులైన పగిడిద్దరాజు పూజారులు బుచ్చి రామయ్య, రాజేశ్వర్ ఆధ్వర్యంలో మేడారానికి చేరుకొని.. గజస్తంభానికి పసుపు, కుంకుమ, నూతన వస్త్రాలు కట్టి పాత గద్దె వద్ద ఆదివాసీ సాంప్రదాయం ప్రకారం పూజలు చేశారు. పసుపు, కుంకుమ, చీర సారె, పండ్లు, గాజులు నూతన వస్త్రాలు సమర్పించారు. అక్కడి నుంచి కొత్తగా ఏర్పాటు చేసిన పగిడిద్దరాజు గద్దెకు చేరుకొని రహస్య పూజలు చేశారు. అనంతరం గజస్తంభం ఏర్పాటు చేసి కొబ్బరికాయలు కొట్టారు. ఈ కార్యక్రమంలో మంత్రి సీతక్క, జిల్లా కలెక్టర్ దివాకర టీఎస్, ఎస్పీ సుధీర్ రామ్నాథ్ కేకన్, మేడారం పూజారుల సంఘం అధ్యక్షుడు సిద్ధబోయిన జగ్గారావు, సారలమ్మ పూజారి కాక సారయ్య, కాక వెంకటేశ్వర్లు, బయక్కపేట సమ్మక్క పూజారులు చంద పరమయ్య, గోపాలరావు, వెంకన్న, పూనుగండ్ల పగిడిద్దరాజు పూజారులు, కొండాయి గోవిందరాజుల పూజారులు పాల్గొన్నారు. ఆదివాసీలు సాంప్రదాయ నృత్యాలు చేశారు.
పూజారుల అనుమతితోనే గద్దెల పున:ప్రతిష్టాపన: మంత్రి సీతక్క
ఆదివాసీల ఇలవేల్పు సమ్మక్క తల్లిది బండారి గోత్రమని, అందుకే ఆదివాసీలకు పసుపే సర్వస్వమని మంత్రి సీతక్క అన్నారు. పూజారుల అనుమతితోనే గద్దెల పున:ప్రతిష్టాపన చేస్తున్నామని, పూర్వీకులతో సంక్రమించిన ప్రకృతి సిద్ధాంతాన్ని ఆచరిస్తున్నామని పేర్కొన్నారు. ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారంలో బుధవారం జరిగిన గోవిందరాజులు, పగిడిద్ద రాజుల గద్దెల పున:ప్రతిష్టాపన కార్యక్రమంలో పాల్గొన్న అనంతరం ఆమె మీడియాతో మాట్లాడారు. పూజారులతో అనేకసార్లు సమావేశాలు నిర్వహించి.. ఒకే లైన్‌లో వనదేవతలు ఉండడంతో భక్తులు దర్శనాలు చేసుకోవడానికి సులువుగా ఉంటుందని నిర్ణయం తీసుకున్నట్టు చెప్పారు. మొదటి ఘట్టం ప్రారంభమైందని, అన్ని కార్యక్రమాలను సకాలంలో పూర్తి చేస్తామని తెలిపారు.
పూర్వం గిరిజనులు ఎలాంటి వ్యాధుల బారిన పడినా పసుపును వాడుకున్నారని చెప్పారు. ఆదివాసీల సాంప్రదాయం ప్రకారం ప్రతీ పని కుడి నుంచి ఎడమవైపు నడుస్తుందని, నవగ్రహాలు సైతం కుడి నుంచి ఎడమవైపే తిరుగుతున్నాయని వివరించారు. స్వస్తిక్ ఏర్పాటు చేసే విషయంలో సైతం ప్రకృతి సిద్ధాంతాన్ని ఆచరించామన్నారు. ఎలాంటి ఇబ్బంది లేకుండా సమ్మక్క–సారలమ్మ జాతర జరుపుతామని సీతక్క తెలిపారు. మేడారంలో కొనసాగుతున్న పనులను పరిశీలించారు. మాస్టర్ ప్లాన్ పురోగతి గురించి కలెక్టర్, ఎస్పీలను అడిగి తెలుసుకున్నారు.
