- దావత్‌కు వెళ్దామని నమ్మించి తీసుకెళ్లిన దంపతులు
- మరో వ్యక్తి సాయంతో
- గొంతుకు చున్నీ బిగించి హత్య
- అడవిలోనే పెట్రోల్ పోసి తగులబెట్టి.. ఏమి ఎరుగనట్టుగా తిరిగి ఇంటికి..
- వికారాబాద్ జిల్లా బంగడి
- వెల్కిచర్లలో దారుణ ఘటన
పరిగి వెలుగు : నగల కోసం పక్కింటి భార్యభర్తలు ఓ వృద్ధురాలిని చంపేశారు. దావత్‌కు రావాలని నమ్మంచి తీసుకెళ్లి మరో వ్యక్తితో సాయంతో గొంతుకు చున్నీ బిగించి చంపి సమీపంలోని అడవిలో పెట్రోల్‌పోసి తగలబెట్టారు. కొద్ది రోజులుగా తన తల్లి కనిపించడం లేదని కూతురు ఫిర్యాదు చేయగా, పోలీసుల విచారణలో అసలు విషయం బయటపడింది. వికారాబాద్‌జిల్లా పరిగి సీఐ ఆఫీసులో డీఎస్పీ శ్రీనివాస్ బుధవారం వివరాలను వెల్లడించారు.
కులకచర్ల మండలంలోని బండివెల్కిచర్ల గ్రామానికి చెందిన చిపిరి మంజుల, చిపిరి భీమయ్య భార్యాభర్తలు. కోడిగంటి అరుణ్‌కుమార్(బీరప్ప) వీరికి బంధువు. వీరి ఇంటి పక్కనే కొత్తబావి వెంకటమ్మ (65) ఉంటుంది. ఈమెకు భర్త చనిపోయాడు. ఒక్క కూతురు ఉండగా, కొన్నేండ్ల కింద గండీడ్మండలం పగిడ్యాల్గ్రామానికి చెందిన వ్యక్తికి ఇచ్చి పెండ్లి చేసింది. అప్పటి నుంచి ఇంట్లో ఒంటరిగానే ఉంటోంది. అయితే, వెంకటమ్మ దగ్గర కొంత బంగారం ఉంది. అప్పుడప్పుడు ఫంక్షన్లకు వేసుకుని వెళ్లి వస్తూ ఉంటుంది. బంగారానికి ధర పెరుగుతుండడంతో మంజుల, భీమయ్యలకు దుర్బుద్ధి పుట్టింది. వెంకటమ్మను చంపి బంగారం తీసుకోవాలని ప్లాన్‌వేశారు. విషయాన్ని బీరప్పకు చెప్పి సాయం కోరారు.
ఫంక్షన్‌కు వెళ్దామని చెప్పి ..
కులకచర్ల మండల పరిధిలోని తిర్మలాపూర్‌లో దావత్‌కు వెళ్దామని ఏప్రిల్ 4 న వెంకటమ్మకు చెప్పారు. దీంతో వెంకటమ్మ బంగారు నగలు వేసుకుని వారి వెంట వెళ్లింది. ముందు కులకచర్లలోని ఒక కల్లు దుకాణంలో మద్యం తాగించారు. తర్వాత సమీపంలోని అటవీ ప్రాంతం దగ్గరలోనే దావత్ఉందని తీసుకువెళ్లారు. అడవిలోకి తీసుకువెళ్లి చున్నీతో గొంతు నులిమి చంపారు. తర్వాత ఆమె మెడలోని నాను, కమ్మలు, గుండ్లు, కాళ్ల కడియాలు, పట్ట గొలుసులు, రెండు సెల్ఫోన్లు తీసుకున్నారు.
డెడ్‌బాడీని ఎవరూ గుర్తు పట్టకుండా రాళ్ల మధ్య వేసి పెట్రోల్ పోసి నిప్పంటించారు. ఆభరణాలను, సెల్ ఫోన్లను కామునిపల్లిలో దాచారు. ఏమీ తెలియనట్టు ఇంటికి వెళ్లిపోయారు. తల్లికి ఫోన్ చేస్తే కలవకపోవడంతో ఏప్రిల్5 తేదీన వెంకటమ్మ బిడ్డ బాపనిపల్లి లక్ష్మి పోలీసులు ఫిర్యాదు చేయగా, విచారణలో పక్కింటి వారే నిందితులని తేలింది. మృతదేహం పూర్తిగా కాలిపోగా, చిన్న చీర ముక్క ద్వారా వెంకటమ్మను ఆమె బిడ్డ గుర్తించింది. ముగ్గురిని అరెస్ట్‌చేసి బంగారు ఆభరణాలను రికవరీ చేశారు. కేసు ఛేదించిన కులకచర్ల ఎస్సై రమేశ్‌కుమార్‌ను అభినందించారు.
