- కేరళలో 78.23 శాతం, పుదుచ్చేరిలో 89.87 శాతం నమోదు
- రెండు రాష్ట్రాలు, ఒక యూటీ అసెంబ్లీలకు ముగిసిన పోలింగ్
తిరువనంతపురం/ గువాహటి/ పుదుచ్చేరి: కేరళ, అస్సాం, పుదుచ్చేరిలో గురువారం జరిగిన అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌లో భారీగా ఓటింగ్ నమోదైంది. సాయంత్రం 6 గంటలకు పోలింగ్ ముగిసే సమయానికి కేరళలో 78.23 శాతం, అస్సాంలో 85.64%, పుదుచ్చేరిలో 89.87% పోలింగ్ నమోదైనట్లు ఎన్నికల సంఘం వెల్లడించింది. మూడు రాష్ట్రాల్లోని మొత్తం 296 నియోజకవర్గాల్లో 5.3 కోట్ల మంది పౌరులు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. కేరళలో 140 నియోజకవర్గాల్లో 2.71 కోట్ల మంది ఓటర్లు పోలింగ్‌లో పాల్గొన్నారు. ఉదయం 7 గంటలకే పోలింగ్ ప్రారంభమైన కేరళలో, ముఖ్యమంత్రి పినరయి విజయన్ ఓటు వేసిన తర్వాత ఎన్నిక కీలకమైనదని, ఎల్డీఎఫ్మళ్లీ అధికారంలోకి రావాలని పిలుపు నిచ్చారు. ప్రతిపక్ష నాయకుడు వీడీ సతీశన్, కేంద్ర సహాయ మంత్రి సురేశ్ గోపి, కేపీసీసీ అధ్యక్షుడు సన్ని జోసఫ్ కూడా పోలింగ్‌లో పాల్గొన్నారు. సినీ రంగం నుంచి మోహన్‌లాల్ ఉదయం 7 గంటలకే తిరువనంతపురంలో ఓటు వేశారు. పృథ్వీరాజ్ సుకుమారన్, దుల్ఖర్ సల్మాన్ కూడా తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. 77.63% పోలింగ్‌తో కోజికోడ్ జిల్లా రాష్ట్రంలో అగ్రస్థానంలో నిలవగా, 81.99%తో కున్నత్తునాడ్ తొలి స్థానంలో ఉంది.
అస్సాంలో హింసాత్మక ఘటనలు
అస్సాంలోని 126 నియోజకవర్గాల్లో 2.5 కోట్ల మంది ఓటర్లు పోలింగ్‌లో పాల్గొన్నారు. సౌత్ సాల్మారా-మంకాచర్ జిల్లాలో అత్యధికంగా 84.24 శాతం పోలింగ్ నమోదైంది. సీఎం హిమంత బిశ్వ శర్మ పోలింగ్‌కు ముందు కామాఖ్యా దేవి ఆలయంలో పూజలు నిర్వహించిన తర్వాత, భార్య రినికి భుయాన్ శర్మ, పిల్లలతో కలిసి ఓటు వేశారు. కాంగ్రెస్ అధ్యక్షుడు గౌరవ్ గొగోయ్ జోర్హాట్లో ఓటు వేసి ప్రజలు చరిత్రాత్మక తీర్పు ఇస్తారని విశ్వాసం వ్యక్తం చేశారు. గాయకుడు పాపన్ గౌహతిలో ఓటు వేసి యువతను పోలింగ్‌లో పాల్గొనమని విజ్ఞప్తి చేశారు. పోలింగ్ సజావుగా సాగినప్పటికీ రాష్ట్రంలో అక్కడక్కడ హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్నాయి. తముల్పూర్, శివసాగర్ నియోజకవర్గాల్లో పోలింగ్‌కు ముందురోజు రాత్రి ఘర్షణలు జరగ్గా ఏడుగురిని అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. పుదుచ్చేరిలో 30 నియోజకవర్గాలకు 9.5 లక్షల మంది ఓటు వేశారు. పుదుచ్చేరిలో మాన్నడిపేట్ నియోజకవర్గంలో బీజేపీ, కాంగ్రెస్ మద్దతుదారుల మధ్య స్వల్ప ఘర్షణ జరిగింది. కాగా ఈ మూడు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు మే 4న వెలువడనున్నాయి.
ఓటర్లకు రోబో వెల్కమ్..
పుదుచ్చేరిలోని చిదంబరనార్ ప్రభుత్వ స్కూళ్లో ‘నీలా’ అనే రోబో సంప్రదాయ దుస్తులు ధరించి, పూల పళ్లెం పట్టుకుని ఓటర్లను స్వాగతించింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తో పనిచేసే 'రోబో నీలా'కు లెహంగా వేసి, ముస్తాబు చేసి పోలింగ్‌బూత్ వద్ద ఉంచారు. ఇది పోలింగ్ కేంద్రానికి వచ్చే ఓటర్లకు వెల్ కమ్ చెప్తూ, స్వీట్లు పంపిణీ చేసింది. చాలామంది నీలాతో మాట్లాడడానికి, ప్రశ్నలు అడిగేందుకు పోటీపడ్డారు
