పేదలు బాగుపడాలన్నదే బీఆర్ఎస్ లక్ష్యం : శ్రీనివాస్ యాదవ్

పేదలు బాగుపడాలన్నదే బీఆర్ఎస్ లక్ష్యం :  శ్రీనివాస్ యాదవ్
  •     మంత్రి, సనత్​నగర్ ఎమ్మెల్యే అభ్యర్థి తలసాని శ్రీనివాస్ యాదవ్
  •     పద్మారావునగర్​లోని పలు కాలనీల్లో పాదయాత్ర చేస్తూ ఎన్నికల ప్రచారం 

పద్మారావునగర్, వెలుగు : పేదలు బాగుపడాలన్నదే తమ లక్ష్యమని మంత్రి, సనత్​గర్ సెగ్మెంట్ బీఆర్ఎస్ అభ్యర్థి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. సోమవారం ఎన్నికల ప్రచారంలో భాగంగా పద్మారావునగర్, నాగదేవత టెంపుల్, ఈశ్వరమ్మ బస్తీ, హమాలీ బస్తీ, చిదానందం కాలనీ  ప్రాంతాల్లో ఆయన పాదయాత్ర చేపట్టారు. ఇంటింటికి తిరుగుతూ ప్రచారం నిర్వహించారు. ప్రతి ఇంటి వద్ద స్థానికులు మంత్రికి శాలువాలు కప్పి, పూలమాలలు వేసి, మంగళ హారతులు పట్టి ఘన స్వాగతం పట్టారు.  ఈశ్వరమ్మ బస్తీ, పద్మారావునగర్ ఏరియా బస్తీల్లో ఉన్న అన్ని సమస్యలను పరిష్కరించామన్నారు.  

ఇంకా ఏమైనా సమస్యలు ఉంటే మళ్లీ వచ్చేది బీఆర్ఎస్ సర్కారే కనుక వాటిని కూడా పరిష్కరిస్తామని వెల్లడించారు. నిరుపేదలు అత్యధికంగా ఉండే హమాలీ బస్తీలో అన్ని సౌకర్యాలతో కూడిన డబుల్ బెడ్రూం ఇండ్ల నిర్మాణాలను ఎన్నికలు పూర్తయిన తర్వాత చేపట్టి తీరుతామని స్పష్టం చేశారు. ఇటీవల ఎంతో ఘనంగా నూతన బొడ్రాయిని ప్రతిష్టించుకున్నామన్నారు. మూడోసారి బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత రూ.400కు వంట గ్యాస్ సిలిండర్ అందజేస్తామన్నారు. అభివృద్ధి కోసం పాటుపడుతున్న బీఆర్ఎస్​ పార్టీకి అండగా ఉండాలని కోరారు.

మంత్రి వెంట ప్రచారంలో కార్పొరేటర్ కుర్మ హేమలత, పద్మారావు నగర్ పార్టీ ఇంచార్జి గుర్రం పవన్ కుమార్ గౌడ్, బన్సీలాల్ పేట డివిజన్ అధ్యక్షుడు వెంకటేషన్ రాజు, నాయకులు పాషా, యాదగిరి యాదవ్, సుధాకర్ రెడ్డి, శ్రీనివాస్, హమాలీ బస్తీ అధ్యక్షుడు సుభాష్, సత్యనారాయణ, సంపత్ ఉన్నారు. మంత్రికి సాయి విజ్ఞాన భారతి కాలేజీ స్టూడెంట్లు గులాబీ పూలను అందజేసి ఘన స్వాగతం పలికారు. కాలేజీ కరస్పాండెంట్ సాయి బాబా మంత్రిని శాలువాతో సత్కరించారు.

పద్మారావునగర్​లోని లక్ష్మి అపార్ట్ మెంట్, సప్తగిరి అపార్ట్ మెంట్ వాసులతో మంత్రి తలసాని వేర్వేరుగా సమావేశమయ్యారు. ఎంఎన్ కే అపార్ట్ మెంట్ వాసులతో మంత్రి ఫేస్ టు ఫేస్ నిర్వహించారు. అనంతరం రాంగోపాల్ పేట డివిజన్ బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు చెందిన యువకులు వెస్ట్ మారేడ్ పల్లిలో మంత్రి తలసాని సమక్షంలో బీఆర్ఎస్ లో చేరారు.