
- అక్రమాలకు అడ్డుకట్ట వేయడానికి ఈసీ నిర్ణయం
న్యూఢిల్లీ: ఓటర్ల జాబితాలో సవరణలకు సంబంధించి ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకుంది. జాబితాలో మార్పుల పేరుతో జరిగే అక్రమాలకు చెక్ పెట్టేందుకు నిబంధనలను సవరించింది. ఇకపై ఓటర్ జాబితాలో పేర్ల చేరికలు, తొలగింపులతో పాటు ఎలాంటి మార్పులు చేయాలన్నా దరఖాస్తుతో పాటు ఆధార్ తో లింక్ చేసిన ఫోన్ నెంబర్ ఇవ్వడం తప్పనిసరి. ఈ నిర్ణయంతో అక్రమాలకు చెక్ పడుతుందని ఎన్నికల సంఘం అధికారులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. కాగా, బిహార్ లోని అలంద్ లో ఓటర్ జాబితాలో పేర్లు తొలగించాలంటూ 6,018 అప్లికేషన్లు ఆన్ లైన్ లో అందాయని, వాటిని పరిశీలించగా కేవలం 24 దరఖాస్తులు మాత్రమే సక్రమమని, మిగతావన్నీ తప్పుడు దరఖాస్తులని తేలిందని ఎన్నికల సంఘం అధికారులు తెలిపారు.
ఈ నేపథ్యంలోనే ఓటర్ జాబితా సవరణల సందర్భంగా అక్రమాలకు తావివ్వకూడదని తాజా నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. కర్నాటకలో పెద్ద సంఖ్యలో ఓట్ల చోరీ జరిగిందని, కాంగ్రెస్ పార్టీ మద్దతుదారుల ఓట్లు పెద్ద సంఖ్యలో తొలగించారని లోక్ సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఆరోపించిన విషయం తెలిసిందే. ఈ విషయంపై కర్నాటక సీఐడీ విచారణ చేపట్టగా.. అవసరమైన వివరాలు అందజేయడానికి ఈసీ నిరాకరిస్తోందని రాహుల్ ఆరోపించారు.