రాహుల్​గాంధీకి ఈసీ నోటీసులు.. మోదీపై ‘పనౌటీ’ వ్యాఖ్యలు.. వివరణ కోరిన కమిషన్

రాహుల్​గాంధీకి ఈసీ నోటీసులు..  మోదీపై ‘పనౌటీ’ వ్యాఖ్యలు.. వివరణ కోరిన కమిషన్

న్యూఢిల్లీ: ఎన్నికల సభలో ఇటీవల కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ప్రధాని మోదీని ఉద్దేశించి చేసిన కామెంట్లపై వివరణ ఇవ్వాలంటూ ఎన్నికల సంఘం ఆయనకు గురువారం నోటీసులు జారీ చేసింది. శనివారంలోగా వివరణ ఇవ్వాలని నోటీసుల్లో పేర్కొంది. రాజకీయ ప్రత్యర్థులపై అవాస్తవ, నిరాధార ఆరోపణలు చేయడాన్ని మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ కింద నిషేధించినట్లు చెప్పిన ఈసీ, రాహుల్ దాన్ని ఉల్లంఘించారని నోటీసులో ఎత్తి చూపింది. అహ్మదాబాద్‌‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో ఇటీవల జరిగిన ప్రపంచకప్‌‌ ఫైనల్స్‌‌లో ఆస్ట్రేలియా చేతిలో భారత్‌‌ ఓడిపోయింది. ఈ మ్యాచ్ చూసేందుకు  ప్రధాని మోదీ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

ఈ నేపథ్యంలో టీమిండియా ఓటమిపై రాహుల్‌‌ రాజస్థాన్ లోని ఎన్నికల ర్యాలీలో స్పందిస్తూ.. ప్రపంచకప్‌‌ చేజారడానికి కారణం మోదీనే అంటూ పరోక్షంగా వ్యాఖ్యానించారు. ‘‘భారత జట్టు బాగా ఆడి ప్రపంచ కప్ గెలిచేది.. కానీ పనౌటీ(అపశకునం) రావడంతో మ్యాచ్ ఓడిపోయాం’’ అంటూ మోదీని ఉద్దేశిస్తూ పరోక్షంగా కామెంట్స్ చేశారు. ఈ కామెంట్స్ పై బీజేపీ నేతలు మండిపడ్డారు. రాహుల్‌‌పై చర్యలు తీసుకోవాలని ఈసీకి ఫిర్యాదు చేశారు. స్పందించిన ఈసీ వివరణ ఇవ్వాలని రాహుల్​ను ఆదేశించింది. నవంబర్ 25 సాయంత్రం 6 గంటలలోపు స్పందించాలని, అప్పటికి జవాబు అందకపోతే, కమిషన్ తగిన చర్య తీసుకుంటుందని నోటీసులో పేర్కొంది.