ఆరు రాష్ట్రాల హోం సెక్రటరీలపై ఈసీ వేటు

ఆరు రాష్ట్రాల హోం సెక్రటరీలపై ఈసీ వేటు
  • బాధ్యతల నుంచి తప్పిస్తూ ఉత్తర్వులు
  • గుజరాత్, బిహార్, యూపీ, హిమాచల్, జార్ఖండ్, ఉత్తరాఖండ్ ప్రభుత్వాలకు ఆదేశాలు
  • ఖాళీల భర్తీకి అధికారుల షార్ట్ లిస్ట్ పంపించాలని సూచన
  • వెస్ట్ బెంగాల్ డీజీపీ రాజీవ్ కుమార్​ ట్రాన్స్​ఫర్
  • వివేక్ సహాయ్​ను డీజీపీగా నియమిస్తున్నట్టు ప్రకటన
  • మిజోరం, మహారాష్ట్రలోనూ పలువురు అధికారుల తొలగింపు

న్యూఢిల్లీ: సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఆరు రాష్ట్రాల హోంశాఖ సెక్రటరీలపై సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ వేటు వేసింది. గుజరాత్, బిహార్, ఉత్తరప్రదేశ్, హిమాచల్​ప్రదేశ్, జార్ఖండ్​, ఉత్తరాఖండ్ రాష్ట్రాల హోంశాఖ కార్యదర్శులతో పాటు మరికొంత మంది ఉన్నతాధికారులను విధుల నుంచి తొలగించాల్సిందిగా ఈసీ సోమవారం ఆదేశించింది. అదేవిధంగా, వెస్ట్​బెంగాల్ డీజీపీ రాజీవ్ కుమార్​​ను బాధ్యతల నుంచి తప్పిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. వెస్ట్ బెంగాల్​లో కొన్నేండ్లుగా ఎప్పుడు ఎన్నికలు జరిగినా అల్లర్లు చెలరేగుతున్నాయి. వీటిని నియంత్రించడంలో డీజీపీ రాజీవ్ కుమార్​ విఫలం అయ్యారు. 

దీనికితోడు ఆ రాష్ట్ర సీఎం మమతా బెనర్జీ, టీఎంసీ నేతలతో ఆయనకు సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. ఈ క్రమంలోనే రాజీవ్ కుమార్​ను బాధ్యతల నుంచి తప్పించినట్టు ఎన్నికల వర్గాలు చెప్తున్నాయి. కాగా, రాజీవ్ కుమార్​ స్థానంలో వెస్ట్ బెంగాల్ డీజీపీగా 1988 ఐపీఎస్ బ్యాచ్​కు చెందిన వివేక్ సహాయ్​ను నియమిస్తున్నట్టు ప్రకటించింది.

హోంగార్డ్స్ డైరెక్టర్ జనరల్ అండ్ కమాండెంట్ జనరల్ గా ఉన్న సహాయ్.. వెస్ట్ బెంగాల్ డీజీపీగా వ్యవహరిస్తారని ఈసీ వెల్లడించింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. అయితే, రాజీవ్​ కుమార్​ను సార్వత్రిక ఎన్నికలతో ఎలాంటి సంబంధం లేదని ఇన్ఫర్మేషన్ అండ్ టెక్నాలజీ డిపార్ట్​మెంట్​కు ట్రాన్స్​ఫర్ చేసింది.

ఎలక్షన్ కమిషనర్లు భేటీ..ఎన్నికల నిర్వహణపై చర్చ

సోమవారం ఉదయం సెంట్రల్ ఎలక్షన్ కమిషనర్లు సుఖ్​బీర్ సింగ్ సంధు, జ్ఞానేశ్ కుమార్ తో చీఫ్ ఎలక్షన్ కమిషనర్ రాజీవ్ కుమార్ భేటీ అయ్యారు. ఎన్నికల ప్రక్రియపై చర్చించారు. లోక్​సభతో పాటు అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న రాష్ట్రాల్లోని రాజకీయ పరిస్థితులపై మాట్లాడుకున్నారు. గతంలో ఎన్నికల సందర్భంగా అల్లర్లు జరిగిన రాష్ట్రాల్లో పోలింగ్ నిర్వహణపై చర్చించారు. 13 రాష్ట్రాల్లోని 26 అసెంబ్లీ స్థానాలకు కూడా ఉప ఎన్నికలు నిర్వహించనున్నారు.

శాంతియుత వాతావరణంలో ఎన్నికల ప్రక్రియ పూర్తి చేసేందుకు తీసుకోవాల్సిన చర్యలపై చర్చించుకున్నారు. ఆ తర్వాత ఆరు రాష్ట్రాల హోంశాఖ సెక్రటరీలు, వెస్ట్ బెంగాల్ డీజీపీతో పాటు పలువురు సీనియర్ అధికారులను బాధ్యతల నుంచి తప్పిస్తున్నట్టు ప్రకటించారు. సీఎంవోలో పని చేసే అధికారులు ఒకటి కంటే ఎక్కువ బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. అందుకే వారిని అదనపు బాధ్యతల నుంచి తొలగించినట్టు తెలుస్తున్నది.

యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ ప్రిన్సిపల్ సెక్రటరీగా ఉన్న సంజయ్ ప్రసాద్.. 2022 నుంచి హోంశాఖ సెక్రటరీగా అదనపు బాధ్యతలు నిర్వరిస్తున్నారు. కాగా, వెస్ట్ బెంగాల్ డీజీపీని బాధ్యతల నుంచి తప్పించినా.. అధికారంలో ఉన్న తృణమూల్ కాంగ్రెస్ మాత్రం స్పందించలేదు. బెంగాల్​లో ఎన్నికలు జరిగినప్పుడల్లా అల్లర్లు చెలరేగుతూ వస్తున్నాయి. గతేడాది జూన్​లో జరిగిన పంచాయతీ ఎన్నికల సందర్భంగా అక్కడ గొడవలు జరిగాయి. ఈ అల్లర్లలో పది మందికి పైగా చనిపోయారు.

ముంబై మున్సిపల్ అధికారులపై వేటు 

ఆయా రాష్ట్రాల్లో ఖాళీ అయిన స్థానాలను భర్తీ చేసేందుకు అర్హత ఉన్న అధికారుల షార్ట్ లిస్ట్ రెడీ చేసి వెంటనే పంపించాల్సిందిగా ఆయా రాష్ట్ర ప్రభుత్వాలను ఈసీ ఆదేశించింది. మిజోరాం, హిమాచల్​ప్రదేశ్ సీఎం ఆఫీస్​లకు అనుబంధంగా ఉన్న సీనియర్ అధికారులను కూడా ఈసీ బదిలీ చేసింది. మహారాష్ట్రలోని కొంత మంది అధికారులను కూడా బాధ్యతల నుంచి తప్పించింది. బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ ఇక్బాల్ సింగ్ చాహల్​తో పాటు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పలు మున్సిపాలిటీల్లో కీలక బాధ్యతలు నిర్వర్తిస్తున్న అధికారులపై కూడా వేటు వేసింది. సార్వత్రిక ఎన్నికల కోడ్‌‌‌‌‌‌‌‌ అమల్లోకి వచ్చాక ఈసీ తొలిసారి ఈ చర్యలు తీసుకుంది.