27న మేయర్‌‌, చైర్‌‌ పర్సన్ల ఎన్నిక!

27న మేయర్‌‌, చైర్‌‌ పర్సన్ల ఎన్నిక!
  •     క్యాంపు రాజకీయాలకు చెక్​పెట్టేలా వెంటనే ప్రక్రియ
  •     25న రిజల్ట్​ తర్వాత నోటీసివ్వనున్న ఈసీ
  •     26న రిపబ్లిక్​డే ఉండటంతో ఆ మరునాడు ఎన్నిక
  •     కరీంనగర్​కు 28న మేయర్, డిప్యూటీ మేయర్​ ఎలక్షన్

హైదరాబాద్, వెలుగు: మున్సిపల్‌‌ చైర్‌‌ పర్సన్లు, కార్పొరేషన్ల మేయర్ల ఎన్నిక 27వ తేదీన నిర్వహించనున్నారు. 120 మున్సిపాలిటీలు, 9 కార్పొరేషన్లలో పోలింగ్‌‌ బుధవారం ముగియగా.. ఎక్కడైనా రీపోలింగ్‌‌ అవసరమైతే శుక్రవారం రోజున నిర్వహిస్తారు. 25న ఓట్ల లెక్కింపు, రిజల్ట్స్​ ప్రకటన తర్వాత.. మేయర్‌‌, చైర్‌‌ పర్సన్‌‌, డిప్యూటీ మేయర్‌‌, డిప్యూటీ చైర్ పర్సన్‌‌, ఎక్స్‌‌ అఫీషియో మెంబర్ల ఎన్నికకు సంబంధించి ఫామ్‌‌-2, 3 లను జారీ చేస్తారు. మున్సిపల్‌‌  కౌన్సిల్‌‌ను సమావేశపర్చి గెలిచిన కౌన్సిలర్లు/కార్పొరేటర్లతో ప్రమాణ స్వీకారం చేయిస్తారు. తర్వాత మేయర్‌‌, చైర్‌‌ పర్సన్‌‌ ఎన్నిక ప్రక్రియ చేపడతారు. ఎన్నికైన వారిలో ఒక మెంబర్​ మేయర్‌‌/ చైర్‌‌ పర్సన్‌‌ క్యాండిడేట్‌‌ను ప్రతిపాదించాలి, మరో మెంబర్​ మద్దతు ఇవ్వాలి. పోటీలో ఒకరే ఉంటే ఏకగ్రీవంగా ఎన్నికైనట్టు ప్రకటిస్తారు. ఎక్కువ మంది ఉంటే చేతులెత్తే ప్రక్రియలో ఓటింగ్‌‌ నిర్వహించి విజేతను ప్రకటిస్తారు. ఆ రోజు ఎన్నిక నిర్వహించేందుకు అవకాశం లేకపోతే మరుసటి రోజుకు వాయిదా వేస్తారు. డిప్యూటీ మేయర్లు, వైస్‌‌ చైర్మన్లు, ఎక్స్‌‌ అఫీషియో మెంబర్ల ఎన్నికకూ ఇదే పద్ధతి పాటిస్తారు.

క్యాంపు రాజకీయాలకు చెక్​ పెట్టేలా..

మున్సిపల్‌‌  ఎలక్షన్ల రిజల్ట్  ప్రకటించిన తర్వాతి రోజే మేయర్‌‌, చైర్‌‌ పర్సన్‌‌, డిప్యూటీ మేయర్‌‌, వైస్‌‌ చైర్‌‌ పర్సన్‌‌, ఎక్స్‌‌ అఫీషియో మెంబర్ల ఎన్నిక నిర్వహించాలని ఎలక్షన్‌‌ కమిషన్‌‌  నిర్ణయించింది. 25న రిజల్ట్​ ఉంది. ఆ మరుసటిరోజు 26నే రిపబ్లిక్‌‌ డే కావడంతో 27వ తేదీన ఎన్నిక నిర్వహించనున్నట్టు అధికారులు తెలిపారు. దీనివల్ల క్యాంపు రాజకీయాలకు తెరపడుతుందని పేర్కొన్నారు. ఇక కరీంనగర్‌‌ కార్పొరేషన్‌‌ రిజల్ట్​ 27న ఉండటంతో.. 28నే మేయర్, డిప్యూటీ మేయర్ల ఎన్నిక పూర్తిచేస్తామని వెల్లడించారు.