ఎమ్మెల్సీ పోలింగ్​కు సర్వం సిద్ధం

ఎమ్మెల్సీ పోలింగ్​కు సర్వం సిద్ధం
  • డిస్ట్రిబ్యూషన్ కేంద్రాలను పరిశీలించిన ఎన్నికల అధికారులు, కలెక్టర్లు 
  •     సామగ్రితో పోలింగ్​ కేంద్రాలకు చేరుకున్న సిబ్బంది  
  •     ఖమ్మం జిల్లాలో 118, భద్రాద్రికొత్తగూడెం జిల్లాలో 55 సెంటర్ల ఏర్పాటు 

భద్రాద్రికొత్తగూడెం/ఖమ్మం టౌన్, వెలుగు : ఖమ్మం, వరంగల్, నల్గొండ గ్రాడ్యుయేట్​ఎమ్మెల్సీ ఎన్నిక పోలింగ్​కు సర్వం సిద్ధం చేసినట్లు ఎన్నికల అధికారులు తెలిపారు. ఎన్నికల సంఘం మార్గదర్శకాల మేరకు పోలింగ్ విధులు సమర్థవంతంగా నిర్వహించాలని సిబ్బందికి సూచించారు. ఆదివారం ఖమ్మంలోని ఎస్ఆర్ అండ్ బీజీఎన్ఆర్ డిగ్రీ కళాశాలలో ఏర్పాటు చేసిన డిస్ట్రిబ్యూషన్ కేంద్రాన్ని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ వీపీ గౌతమ్ పరిశీలించారు.  ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పోలింగ్ సామగ్రితో పోలింగ్ కేంద్రాలకు చేరుకొని, ఆదివారం రాత్రి పోలింగ్ కేంద్రాలలోనే బస చేయాలన్నారు. 

సోమవారం నాటి పోలింగ్ కోసం అన్ని ఏర్పాట్లు చేసుకోవాలని తెలిపారు.  ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ జరుగుతుందని చెప్పారు. ఉదయం 7.30 గంటల కల్లా పోలింగ్ ఏజెంట్ల సమక్షంలో జంబో బాక్సుల సీలింగ్ ప్రక్రియ చేపట్టాలన్నారు. జంబో బాక్సు ఖాళీగా ఉన్నట్లు చూపించి, అడ్రస్ ట్యాగ్ చేయాలని, బాక్స్ మూతపెట్టి 2 తాళాలు వేసి, స్టిక్కర్ చేయాలని సూచించారు. పోలింగ్ కేంద్రంలో 8 వందల ఓట్ల కంటే ఎక్కువ ఓట్లు ఉంటే, రెండు ఓటింగ్ కాంపార్టుమెంట్లు ఏర్పాటు చేసుకోవాలని చెప్పారు. 

బాక్సుల సీలింగ్ పై పూర్తి అవగాహన కలిగి ఉండాలన్నారు. ప్రతీ ఓటర్ ను ప్రిస్కింగ్ చేసి, తనిఖీల తర్వాత అనుమతించాలన్నారు. జిల్లాలో 118 పోలింగ్ కేంద్రాలు 40 లోకేషన్లలో ఏర్పాటుచేశామన్నారు. 50,676 మంది పురుషులు, 33,199 మంది మహిళలు, నలుగురు ట్రాన్సజెండర్లతో కలిపి మొత్తం 83,879 మంది పట్టభద్రులు తమ ఓటును వినియోగించుకోనున్నారని తెలిపారు. 

రిజర్వ్ తో కలుపుకొని 129 బ్యాలెట్ బాక్సులు ఎన్నికలకు సిద్ధం చేసినట్లు వెల్లడించారు. 142 మంది పీవోలు, 142 మంది ఏపీవోలు, 284 మంది ఓపీవోలు పోలింగ్ విధులకు నియమించినట్లు చెప్పారు. 15 సెక్టార్ల ఏర్పాటుచేసి, 15 మంది సెక్టార్ అధికారులు నియామకం చేసినట్లు తెలిపారు. పోలింగ్ అనంతరం ఎస్ఆర్ అండ్​ బీజీఎన్ఆర్ డిగ్రీ కళాశాల వద్ద ఏర్పాటు చేసిన రిసిప్షన్ కేంద్రానికి బ్యాలెట్ బాక్సులు వస్తాయని, అక్కడి నుంచి కౌంటింగ్ కోసం నల్గొండకు ఆర్టీసీ డీజీటీ వాహనాల్లో ఎస్కార్ట్ పోలీస్ బందోబస్తు తో చేరుకుంటాయని వివరించారు. 

భద్రాద్రికొత్తగూడెం జిల్లాలో... 

జిల్లాలో ఎమ్మెల్సీ ఎన్నికకు సంబంధించి 40,106 మంది ఓటర్లు ఉన్నట్లు కలెక్టర్​ ప్రియాంక అల తెలిపారు. లక్ష్మీదేవిపల్లిలోని శ్రీరామచంద్ర డిగ్రీ కాలేజ్​లో ఏర్పాటు చేసిన పోలింగ్​ డిస్ట్రిబ్యూషన్​ కేంద్రాన్ని కలెక్టర్​ సందర్శించారు. పోలింగ్​ సామగ్రిని చెక్​ చేశారు. పోలింగ్​ టైంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు. జిల్లా వ్యాప్తంగా 55 పోలింగ్​ కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు. 

జిల్లాలోని ఐదు నియోజకవర్గాల్లో 22,590 మంది పురుషులు, 17,516 మంది మహిళా ఓటర్లున్నారని తెలిపారు. చర్ల మండలంలోని గవర్నమెంట్​ హైస్కూల్​లో ఏర్పాటు చేసిన పోలింగ్​ కేంద్రంలోని అత్యధికంగా 1,122మంది ఓటర్లు, ఆళ్లపల్లిలోని జడ్పీహెచ్​ఎస్​​ హైస్కూల్​లో ఏర్పాటు చేసిన పోలింగ్​ కేంద్రంలో తక్కువగా 293 ఓటర్లున్నారని వివరించారు. చెక్​ లిస్ట్​ ఆధారంగా ఎన్నికల నిర్వహణకు అవసరమైన పోలింగ్​ సామగ్రి ఉందోలేదో సరిచూసుకోవాలన్నారు. ఎలాంటి పొరపాట్లకు తావు లేకుండా ఎన్నికలు నిర్వహించేలా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. పోస్టల్​ బ్యాలెట్​ ద్వారా ఇప్పటికే 252 మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారని తెలిపారు.