- సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు
హనుమకొండ/వర్ధన్నపేట, వెలుగు: ఎన్నికల సమయంలో కాంగ్రెస్ నేతలు ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చకుంటే ప్రభుత్వంపై తిరుగుబాటు తప్పదని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు హెచ్చరించారు. హనుమకొండలోని గుండ్లసింగారం భూపోరాట కేంద్రంలో సురవరం సుధాకర్ రెడ్డి నగర్ పేరుతో నిర్మించిన సీపీఐ కార్యాలయాన్ని పార్టీ రాష్ట్ర సహాయ కార్యదర్శి తక్కళ్లపల్లి శ్రీనివాస్‌రావుతో కలిసి ప్రారంభించారు.
ఈ సందర్భంగా కూనంనేని మాట్లాడుతూ పేదలందరికీ ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేస్తామని, ప్రభుత్వ భూముల్లో గుడిసెలు వేసుకుని ఉంటున్న వారికి జీవో 58 ప్రకారం పట్టాలు ఇస్తామని హామీ ఇచ్చిందని గుర్తు చేశారు. ఇప్పటి వరకు ఆ హామీ అమలు చేయడం లేదన్నారు. గుడిసెలు వేసుకొని ఉంటున్న కుటుంబాలకు వెంటనే పట్టాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు.
ప్రధాని మోదీ బంగారం కొనవద్దని పేదలకు నీతులు చెబుతూ, పెద్దలకు అనుకూలంగా మెదులుతున్నారని విమర్శించారు. గుండ్ల సింగారంలో గుడిసెలు వేసుకొని ఉంటున్న పేదలందరికీ సీఎంతో మాట్లాడి పట్టాలు ఇప్పించేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు.
అసైన్మెంట్ భూములు పేదలకు అప్పగించాలి
ప్రభుత్వ, అసైన్డ్ భూములు ఆక్రమించిన వారిపై చర్యలు తీసుకొని, ఆ భూములను పేదలకు అప్పగించాలని కూనంనేని డిమాండ్ చేశారు. ఐనవోలు మండలం వెంకటాపురంలో కట్టా మనోజ్ రెడ్డి ప్రభుత్వ, అసైన్డ్ భూములను ఆక్రమించుకున్నాడనే ఆరోపణల నేపథ్యంలో పార్టీ నాయకులతో కలిసి ఆ భూములను పరిశీలించారు. అక్కడికి చేరుకున్న మనోజ్ రెడ్డి 1954 నుంచి ఆ భూములు తమవేనంటూ వివరించే ప్రయత్నం చేయగా, ఇద్దరి మధ్య స్వల్ప వాగ్వాదం జరిగింది.
కూనంనేని మాట్లాడుతూ నిజాం కాలంలో కమ్యూనిస్టులు 10 లక్షల ఎకరాలకు పైగా పేదలకు పంచారన్నారు. ఆ తరువాత భూస్వాములు వాటిని మళ్లీ లాక్కున్నారని తెలిపారు. వెంకటాపూర్ లో ప్రభుత్వం పేదలకు అసైన్మెంట్ చేసిన భూములను ఆక్రమించుకున్నారని చెప్పారు. పేదలకు న్యాయం జరిగేంత వరకు పోరాటం చేస్తామని తెలిపారు. జిల్లా కార్యదర్శి కర్రె భిక్షపతి, నేతలు తోట భిక్షపతి, మద్దెల ఎల్లేశ్, అదరి శ్రీనివాస్, మండ సదాలక్ష్మి, వలీ ఉల్లాఖాద్రి పాల్గొన్నారు.
