గొర్రెల పెంపకందార్ల సంఘాలకు .. ఎన్నికలు నిర్వహించాలె

గొర్రెల పెంపకందార్ల సంఘాలకు .. ఎన్నికలు నిర్వహించాలె

హైదరాబాద్‌‌‌‌, వెలుగు: గొర్రెల పెంపకందార్ల సహకార సంఘాలకు వెంటనే ఎన్నికలు నిర్వహించాలని గొర్రెలు, మేకల పెంపకందార్ల సంఘం (జీఎంపీఎస్‌‌‌‌) డిమాండ్ చేసింది. మంగళవారం సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఉడుత రవీందర్‌‌‌‌ ఆధ్వర్యంలో రాష్ట్ర సహకార ఎన్నికల కమిషనర్‌‌‌‌  వంగాల సుమిత్రకు వినతిపత్రం అందించారు. ఈ సందర్భంగా రవీందర్‌‌‌‌ మాట్లాడుతూ.. రాష్ట్ర వ్యాప్తంగా 8,135 ప్రాథమిక గొర్రెల పెంపకందార్ల సహకార సంఘాలున్నాయని, వీటిలో ఎక్కువశాతం సంఘాల పాలకవర్గాల పదవీ కాలం పూర్తయిందన్నారు. 

పశుసంవర్ధక శాఖ పరిధిలో నిర్వహించే ఎన్నికలు,  సహకార శాఖకు బదిలీ చేశారని,  కొత్త నిబంధనల ప్రకారం ఫొటో ఓటర్ల జాబితా ప్రక్రియతో మరింత జాప్యం జరుగుతోందన్నారు. ఎన్నికల నిర్వహణకు అయ్యే ఖర్చులు  సొసైటీలు  భరించాలనడం మరింత ఆర్థిక భారం అవుతుందన్నారు. ఈ ఎన్నికలు ఆలస్యం కావడంతో సొసైటీలు డీసీసీబీ ఎన్నికల్లో ఓటు హక్కును కోల్పోయాయని తెలిపారు. 

ఎన్నికల కమిషన్  స్పందించి  ప్రతి జిల్లాకొక అధికారిని ప్రత్యేకంగా కేటాయించాలని, ఓటర్ల జాబితా తయారీని సులభతరం చేసి, ఎన్నికల ఖర్చులు తగ్గించి, కొత్త జిల్లాల ప్రాతిపదికన జిల్లా యూనియన్లు ఏర్పాటు చేసి ఎన్నికలు నిర్వహించాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు కాడబోయిన లింగయ్య, రాష్ట్ర సహాయ కార్యదర్శులు అమీర్‌‌‌‌పేట్‌‌‌‌ మల్లేశ్, కాల్వ సురేశ్ తదితరులు పాల్గొన్నారు.