ఎన్నికల్లో ఆలోచించి ఓటేయాలి : సబితా ఇంద్రారెడ్డి

ఎన్నికల్లో ఆలోచించి ఓటేయాలి : సబితా ఇంద్రారెడ్డి
  • కర్మన్​ఘాట్ నుంచి ఉత్సాహంగా నామినేషన్ ర్యాలీ

మహేశ్వరం, వెలుగు: ఎన్నికల్లో ఆలోచించి ఓటేయాలని బీఆర్ఎస్ మహేశ్వరం సెగ్మెంట్ ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి అన్నారు. ఒక ఆడబిడ్డ అయిన తనను మరోసారి ఆశీర్వదించి గెలిపిస్తే మీ సేవకురాలిగా సేవ చేస్తానని ఆమె తెలిపారు. శుక్రవారం మహేశ్వరం సెగ్మెంట్ అభ్యర్థిగా బీఆర్ఎస్ నుంచి ఆమె నామినేషన్ దాఖలు చేశారు. అంతకుముందు కర్మన్​ఘాట్ హనుమాన్ టెంపుల్ వద్ద ఆమె పూజ నిర్వహించారు. అనంతరం కార్యకర్తలతో కలిసి  బాలాపూర్ క్రాస్ రోడ్, శివాజీ చౌక్, పహాడీషరీఫ్​, తుక్కుగూడ సర్కిల్, మహేశ్వరం గేట్, సిరిపురం గేట్ మీదుగా మహేశ్వరం వరకు భారీ ర్యాలీ నిర్వహించారు.

బాలాపూర్, తుక్కుగూడ, మహేశ్వరంలో బీఆర్ఎస్ శ్రేణులు సబితకు క్రేన్ల సాయంతో భారీ పూలమాలలు వేశారు. ఈ సందర్భంగా సబితా ఇంద్రారెడ్డి మాట్లాడుతూ.. కాంగ్రెస్ వస్తే మోసాలుంటాయన్నారు. కరెంట్ ఉండదన్నారు. ఐదేళ్లుగా కనిపించని కొందరు నేతలు ఎన్నికలు రాగానే ఓట్ల కోసం వస్తుంటారని వారిని నమ్మి మోసపోవద్దని ఆమె తెలిపారు. మరోసారి బీఆర్ఎస్​ను గెలిపించుకోవాలన్నారు. అనంతరం ఆమె రిటర్నింగ్ ఆఫీసులో నామినేషన్ వేశారు. ర్యాలీలో రంగారెడ్డి జిల్లా జడ్పీ చైర్ పర్సన్ తీగల అనితా రెడ్డి, మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి, చేవెళ్ల సెగ్మెంట్ ఇన్​చార్జి పటోళ్ల కార్తీక్ రెడ్డి, పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.