మార్చి 21లోపు ఎలక్టోరల్ బాండ్ల పూర్తి వివరాలు ఇవ్వాలి: సుప్రీం

మార్చి 21లోపు ఎలక్టోరల్ బాండ్ల పూర్తి వివరాలు ఇవ్వాలి: సుప్రీం

ఎలక్టోరల్ బాండ్ల సమాచారం మొత్తం బహిర్గతం చేయాలని స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా(SBI)ను మరోసారి ఆదేశించింది సుప్రీంకోర్టు. వివరాలు ఇవ్వటంలో SBI సెలెక్టివ్ గా ఉండకూడదని సోమవారం స్పష్టం చేసింది అత్యున్నత న్యాయస్థానం. ఎలక్టోరల్  బాండ్ల నంబర్లను ఈసీకి ఇవ్వకపోవడంపై SBIని నిలదీసి ధర్మాసనం... నంబర్లతో సహా అన్ని వివరాలను ఈసీకి సమర్పించాలని ఆదేశించింది.  

ఏ సంస్థ, ఏ పొలిటికల్ పార్టీకి ఎంత ఫండ్ ఇచ్చిందో... తెలిపేలా ఆల్ఫా న్యూమరిక్ సీరియల్ కోడ్ తో సహా.. ఎలక్టోరల్ బాండ్ ల అన్ని వివరాలు.. మార్చి 21వ తేదీ లోపు తెలుపాలని SBIని ఆదేశించింది సుప్రీం.  తమ ఆధీనంలో ఉన్న ఎలక్టోరల్ బాండ్ల అన్ని వివరాలను బ్యాంక్ బహిర్గతం చేసిందని, వివరాలను దాచిపెట్టలేదని సూచిస్తూ గురువారం సాయంత్రం 5 గంటలలోపు అఫిడవిట్ దాఖలు చేయాలని SBI ఛైర్మన్ ను ఆదేశించింది ధర్మాసనం.

 సుప్రీం కోర్టు ఆదేశాల SBI ఇటీవల ఈసీకి ఎలక్టోరల్‌ బాండ్ల వివరాలను పీడీఎఫ్‌ రూపంలో అందించిన విషయం తెలిసిందే. దీంతో బాండ్ల వివరాలను ఈసీ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచింది.అయితే, ఎస్‌బీఐ.. బాండ్ల ఆల్ఫా న్యూమరిక్‌ నంబర్లను ఎన్నికల కమిషన్‌కు అందించకపోవడంపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. సీజేఐ జస్టిస్‌ డీవై చంద్రచూడ్‌ తో కూడిన ధర్మాసనం ఎస్‌బీఐ తీరును తప్పుపట్టింది. ఎలక్టోరల్‌ బాండ్ల వివరాల వెల్లడిపై తాము ఇచ్చిన ఆదేశాలను పూర్తిస్థాయిలో పాటించలేదంటూ మండిపడింది సుప్రీంకోర్టు.