విద్యుత్ బిల్ ఫెడరల్ స్పూర్తికి విరుద్ధం

విద్యుత్ బిల్ ఫెడరల్ స్పూర్తికి విరుద్ధం

న్యూఢిల్లీ: ప్రతిపక్షాల నిరసనల మధ్యే విద్యుత్​ సవరణ చట్టాన్ని కేంద్ర ప్రభుత్వం లోక్​సభలో ప్రవేశపెట్టింది. కేంద్ర విద్యుత్​ శాఖ మంత్రి ఆర్​కే సింగ్​ సోమవారం లోక్​సభలో ఎలక్ట్రిసిటీ(సవరణ) బిల్లు 2022ను ప్రవేశపెట్టారు. అయితే ప్రతిపక్షాల నిరసనల నేపథ్యంలో ఈ బిల్లుపై విస్తృతంగా చర్చించేందుకు వీలుగా పార్లమెంటరీ స్టాండింగ్​ కమిటీ(పీఎస్సీ)కి పంపుతున్నట్టు లోక్​సభ స్పీకర్​ ఓం బిర్లా ప్రకటించారు. మరోవైపు ఈ బిల్లుకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా విద్యుత్​ ఉద్యోగులు ఆందోళనలకు దిగారు. 

సభలో ప్రతిపక్షాల ఆందోళన

కమ్యూనికేషన్​ మాదిరిగానే విద్యుత్​ను ప్రైవేటుపరం చేసేందుకు అనుమతించేదే ఈ బిల్లు. ఇది పార్లమెంట్​ ఆమోదం పొందితే కస్టమర్లు తమకు నచ్చిన విద్యుత్​ సప్లయర్​ను ఎంచుకునే వీలుంటుంది. ఇందుకుగానూ విద్యుత్​ చట్టంలోని సెక్షన్​42, సెక్షన్​ 14, సెక్షన్​ 62,  సెక్షన్​ 166, సెక్షన్​ 146, సెక్షన్​ 152లకు సవరణలు చేయాల్సి ఉంటుంది. అయితే ఈ బిల్లు రాష్ట్ర ప్రభుత్వాల హక్కులను కాలరాస్తోందంటూ ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి. దీనిని లోక్​సభలో ప్రవేశపెట్టడాన్ని తీవ్రంగా వ్యతిరేకించాయి. కాంగ్రెస్​ సభ్యులు మనీశ్​ తివారీ, అధిర్​ రంజన్​ చౌధురి, ఆర్ఎస్పీ ఎంపీ ఎన్​కే ప్రేమచంద్రన్, సీపీఎం ఎంఏ ఆరిఫ్, టీఎంసీ సభ్యుడు సౌగతరాయ్, డీఎంకే లీడర్ టీఆర్ బాలు తదితరులు ఈ బిల్లు ఫెడరల్​ స్ఫూర్తికి విరుద్ధమని మండిపడ్డారు. ఈ బిల్లుపై రాష్ట్ర ప్రభుత్వాలతో సంప్రదింపులు జరపాల్సిన బాధ్యత కేంద్రంపై ఉందని ప్రేమచంద్రన్​ అన్నారు. ఒకే ఏరియాలో ఎక్కువ ప్రైవేట్​ కంపెనీలు విద్యుత్​ సరఫరా చేసేందుకు ఈ బిల్లు వీలు కల్పిస్తుందని, ఇది లాభాలను ప్రైవేటుపరం చేసేందుకు, నష్టాలను జాతీయం చేసేందుకు దారి తీస్తుందని మనీశ్​​ తివారీ ఆందోళన వ్యక్తం చేశారు. విద్యుత్​ పంపిణీలో కేంద్రం పాత్రను తగ్గించుకునేందుకే ఈ బిల్లును తీసుకొచ్చారని ఆరోపించారు. తమిళనాడు ప్రభుత్వం కొన్నేండ్లుగా రైతులకు ఉచిత విద్యుత్​ అందిస్తోందని, ఈ బిల్లు వల్ల పేద రైతులపై భారం పడుతుందని టీఆర్ బాలు అన్నారు. 

ప్రతిపక్షాలది రాద్ధాంతం: కేంద్రం

ప్రతిపక్షాలు అనవసరంగా ఈ బిల్లుపై రాద్ధాంతం చేస్తున్నాయని, లేనిపోని అపోహలు సృష్టిస్తున్నారని విద్యుత్​ శాఖ మంత్రి ఆర్​కే సింగ్​ కౌంటర్ ఇచ్చారు. రైతులకిచ్చే ఉచిత విద్యుత్​పై ఎలాంటి ప్రభావం ఉండదని, వారికి ఇచ్చే సబ్సిడీని ఎత్తేసే అవకాశంలేదని చెప్పారు. ఈ బిల్లుపై విస్తృతంగా చర్చించేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామన్నారు. మంత్రి కామెంట్లతో ప్రతిపక్షాలు ఆందోళనకు దిగాయి. ప్రభుత్వ తీరును నిరసిస్తూ సభ నుంచి వాకౌట్​ చేశాయి. ప్రతిపక్షాల అభ్యంతరాల నేపథ్యంలో ఈ బిల్లుపై సంప్రదింపులకు వీలుగా స్టాండింగ్​ కమిటీకి సిఫారసు చేస్తున్నట్టు స్పీకర్​ ప్రకటించారు.

దేశవ్యాప్తంగా విద్యుత్​ ఉద్యోగుల ఆందోళనలు

విద్యుత్​ సవరణ బిల్లును వ్యతిరేకిస్తూ అన్ని రాష్ట్రాల్లో పవర్​ సెక్టార్​ ఉద్యోగు లు, ఇంజనీర్లు ఆందోళనకు దిగారు. ధర్నాలు, ర్యాలీలు చేపట్టారు. నల్ల బ్యాడ్జీలతో నిరసన తెలిపారు. విద్యుత్​ వినియోగదారులకు ఇచ్చే సబ్సిడీలన్నీ ఈ బిల్లుతో రద్దవుతాయ ని ఆలిండియా పవర్​ ఇంజనీర్స్ ఫెడరే షన్ ఆరోపించింది. పేదలే కాకుండా విద్యుత్​ ఉద్యోగులకూ ఇబ్బందేనని ఆందోళన వ్యక్తంచేసింది.