- మీ ప్రాబ్లమ్స్‌ను డిప్యూటీ సీఎం దృష్టికి తీసుకెళ్తా: మంత్రి వివేక్ వెంకటస్వామి
- త్వరలోనే యూనియన్ నేతలతో చర్చలు జరుపుతం
- కొత్త డిస్కం ఏర్పాటుతో ఎవరికీ నష్టం ఉండదని వెల్లడి
- ఎలక్ట్రిసిటీ ఎంప్లాయ్స్ యూనియన్ ప్లాటినం జూబ్లీ వేడుకల్లో పాల్గొన్న మంత్రి
హైదరాబాద్, వెలుగు: విద్యుత్ కార్మికుల సమస్యలను పరిష్కరిస్తామని కార్మిక శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి తెలిపారు. వాళ్ల సమస్యలను డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క దృష్టికి తీసుకెళ్తానని చెప్పారు. ఈఎస్‌ఐ, పీఎఫ్ కావాలని కార్మికులు కోరుతున్నారని, అందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. మంగళవారం హైదరాబాద్ శివారు మన్నెగూడలోని ఓ కన్వెన్షన్ సెంటర్‌లో తెలంగాణ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయ్స్ 1104 యూనియన్ ప్లాటినం జూబ్లీ వేడుకలు నిర్వహించారు. ఈ వేడుకల్లో టీజేఎస్ ప్రెసిడెంట్ ప్రొఫెసర్ కోదండరాంతో కలిసి మంత్రి వివేక్ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా యూనియన్ డైరీ, క్యాలెండర్, సావనీర్ ఆవిష్కరించారు. అనంతరం ఎలక్ట్రిసిటీ ఉద్యోగులు, కార్మికులు తమ సమస్యలు పరిష్కరించాలని వినతిపత్రం అందజేయగా, అందుకు కృషి చేస్తానని మంత్రి వివేక్ హామీ ఇచ్చారు. ‘‘నేను కార్మిక శాఖ మంత్రి అయ్యాక రెండు అంశాలపై ప్రధానంగా దృష్టిపెట్టాను. ఒకటి గిగ్ వర్కర్ల సంక్షేమం కోసం బోర్డు, రెండోది కనీస వేతన సవరణ. మీరు నా దృష్టికి తెచ్చిన వేతన సవరణ అంశాన్ని తప్పకుండా చేస్తాం. కాంట్రాక్ట్ ఉద్యోగులకు సైతం వేతన సవరణ చేస్తాం.
విద్యుత్ సమస్యలు పరిష్కరించాలని ప్రజలు కూడా నా దృష్టికి తెస్తున్నారు. ఈ సమస్యలను పరిష్కరించాల్సిన బాధ్యత కార్మిక శాఖ మంత్రిగా నాపై ఉంది. నేను మీతో కలిసి ఉంటాను. త్వరలో ప్రభుత్వం తరఫున మిమ్మల్ని పిలిపించి మాట్లాడుతాం. కొత్త డిస్కం ఏర్పాటుతో విద్యుత్ కార్మికులకు, ఉద్యోగులకు ఎలాంటి నష్టం ఉండదు” అని భరోసా ఇచ్చారు. మేనిఫెస్టోలో ఇచ్చిన అన్ని హామీలను నెరవేరుస్తామని తెలిపారు.
నాన్న బాటలో నడుస్తా..
ఎలక్ట్రిసిటీ ఎంప్లాయ్స్ యూనియన్ 75 ఏండ్ల వేడుకలు చేసుకోవడం గొప్ప విషయమని మంత్రి వివేక్ అన్నారు. కార్మికుల సమస్యలపై పోరాడడం వల్లనే ఇన్నేండ్లుగా యూనియన్ విజయవంతంగా నడుస్తున్నదని కొనియాడారు. ‘‘దేశంలో అందరికీ పెన్షన్లు ఇప్పించిన యూనియన్ మీది. 22 వేల మందిని రెగ్యులరైజ్ చేయించారు.
ఆర్టిజన్స్ సర్వీస్ ఐదేండ్లు పూర్త యిన తర్వాత అప్‌గ్రేడ్ చేయాల్సిన అంశాన్ని డిప్యూటీ సీఎం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తాను” అని హామీ ఇచ్చారు. ‘‘ఈ మీటింగ్‌కు వచ్చిన ఉద్యోగులు, కార్మికులు మా నాన్న కాకా వెంకటస్వామి గురించి గుర్తుచేస్తున్నారు. సమస్యలు పరిష్కరించాలని కోరుతూ చాలామంది విద్యుత్ ఉద్యోగులు మా నాన్న దగ్గరికి వచ్చేవారు. ఆయన వాళ్ల సమస్యల పరిష్కారానికి కృషి చేసేవారు. మేం కూడా నాన్న బాటలోనే నడుస్తాం” అని తెలిపారు.
