ఎలక్ట్రానిక్ కాంటా.. రిమోట్ తోఫ్రాడ్!..పత్తి కొనుగోలులో దళారుల కొత్త మోసాలు

ఎలక్ట్రానిక్ కాంటా.. రిమోట్ తోఫ్రాడ్!..పత్తి కొనుగోలులో దళారుల కొత్త మోసాలు
  • క్వింటాకు 15  నుంచి 20 కేజీల వరకు  మోసం
  • ఏజెన్సీ ప్రాంతాలే టార్గెట్​గా  ప్రైవేట్ వ్యాపారుల దందా
  • గ్రామాల్లో వాహనాల్లో తిరుగుతూ రైతుల నుంచి కొనుగోలు
  • తాజాగా తల్లాడలో అక్రమాలకు పాల్పడిన నలుగురు అరెస్టు

ఖమ్మం, వెలుగు : ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతాల్లో దళారులు కొత్త దందాతో రైతులను మోసగిస్తున్నారు. వాహనాల్లో తిరుగుతూ రైతుల నుంచి పత్తి కొనుగోలు చేస్తున్నారు. తేమ శాతాన్ని, పత్తి నాణ్యతను బట్టి క్వింటాకు రూ.5 వేల నుంచి రూ.6 వేల లోపు మాత్రమే చెల్లిస్తున్నారు. అయితే.. క్వింటాకు 15 కేజీల నుంచి 20 కేజీల వరకు తక్కువ చూపిస్తూ తూకం వేస్తున్నారు. 

వ్యవసాయ మార్కెట్ కు తరలిస్తే వచ్చే రేటు తక్కువగా ఉండడం, రవాణా ఖర్చులు భారంగా ఉండడంతో ఇంటి వద్దకు వచ్చే దళారులకే అమ్ముకుంటున్నారు. దీంతో రైతులను నమ్మిస్తూనే కొందరు దళారులు తూకంలో అక్రమాలకు పాల్పడుతున్నారు. 

ఎలక్ట్రానిక్​కాంటాలను రిమోట్ సాయంతో కంట్రోల్ చేస్తున్నారు. తద్వారా రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. దళారులు కొనుగోలు చేసిన పత్తిని తల్లాడలోని ప్రైవేట్ పత్తి వ్యాపారులకు ఎక్కువ ధరకు వే బ్రిడ్జి కాంటా  ద్వారా అమ్ముతున్నారు. 

ఎలాంటి పర్మిషన్లు లేవు

గ్రామాల్లో పత్తి, మిర్చి వంటి పంటలను కొనుగోలు చేసే దళారులకు ఎలాంటి వ్యాపార లైసెన్సులు లేవు. ప్రభుత్వం నుంచి కూడా అనుమతులు లేకుండానే ఏండ్లుగా వ్యాపారం చేస్తున్నారు. వాహనాలకు మైక్ లు ఏర్పాటు చేసుకుని గ్రామాల్లో తిరుగుతూ కొనుగోలు చేస్తున్నారు. ఏన్కూరు, జూలూరుపాడు, కారేపల్లి, ములకలపల్లి నుంచి భద్రాచలం, చర్ల మండలాల్లో దళారులు ఎక్కువగా కొనుగోలు చేస్తూ మోసాలకు పాల్పడుతున్నారు. 

ఖమ్మంలో కొందరు జిన్నింగ్ మిల్లుల ఓనర్లు ఏజెంట్లను నియమించుకుని గ్రామాలకు పంపించి పత్తి కొనుగోలు చేయిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఇంతకుముందు సీసీఐ కేంద్రాల్లో  రైతుల పేరు మీద అమ్ముకునేవారు. ఇప్పుడు అలాంటి పరిస్థితి లేదు. కపాస్​కిసాన్​యాప్​ద్వారా స్లాట్ బుకింగ్ పద్ధతి లో అమ్ముకోవాల్సి ఉంటుంది. దీంతో కొత్త దందాకు పాల్పడుతున్నారు. 

తల్లాడలో ప్రైవేట్ పత్తి వ్యాపారులు లారీల్లో లోడ్ చేసి ఇతర రాష్ట్రాలకు తరలిస్తున్నారు. రెండు వారాల కింద తల్లాడలో పత్తి  తూకంలో మోసగిస్తున్నారని తూనికలు, కొలతల శాఖ అధికారులకు కొందరు రైతులు ఫిర్యాదు చేశారు. దీంతో గ్రామాలకు వెళ్లి దళారులను గుర్తించి పట్టుకునేందుకు ప్రయత్నించగా కాంటాతో సహా పారిపోయారు. 

ఇద్దరిపై పోలీసులు కేసు నమోదు చేశారు. తాజాగా రిమోట్ తో కాంటా మేనేజ్ చేసి రైతులను మోసగించిన నలుగురిని తల్లాడ పోలీసులు అరెస్ట్ చేశారు. మరో ఇద్దరు పరారీలో ఉన్నారు. కాంటాలతో పాటు ఆరు టాటా ఏస్​వెహికల్స్ సీజ్ చేశారు. ఇప్పటి వరకు ఎలాంటి అనుమతుల్లేని 65 మంది దళారులను బైండోవర్ చేశారు.

రైతులను మోసగించే దళారులపై పీడీ యాక్ట్ పెట్టాలి 

గ్రామాల్లో  దళారులు పత్తి, మిర్చి కొనుగోలు చేసి, ఎలక్ట్రానిక్​ కాంటాలను రిమోట్ కంట్రోల్ తో తూకం తక్కువ చూపించి రైతులను మోసగిస్తున్నారు. అలాంటి వారిపై పీడీ యాక్ట్ కేసులు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకోవాలి. ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలు, వ్యవసాయ మార్కెట్లలో తక్కువ ధర రావడంతోనే రైతులు గ్రామాల్లోనే  పంట అమ్ముకుంటున్నారు. దీన్ని ఆసరాగా చేసుకొని దళారులు చేస్తున్న మోసాలను రైతులు గుర్తించి జాగ్రత్త పడాలి.

- బొంతు రాంబాబు, తెలంగాణ రైతు సంఘం జిల్లా కార్యదర్శి-