కేసీఆర్ అరాచక పాలన అంతం.. మోడీ వల్లే సాధ్యం : ఏలేటి మహేశ్వర్ రెడ్డి

 కేసీఆర్ అరాచక పాలన అంతం.. మోడీ వల్లే సాధ్యం : ఏలేటి మహేశ్వర్ రెడ్డి

పార్టీ మారుతున్నారంటూ వచ్చిన వార్తలకు కాంగ్రెస్ సీనియర్ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి తెరదించారు. ఏప్రిల్ 13వ తేదీ గురువారం ఢిల్లీలో బీజేపీలో జేపీ నడ్డా సమక్షంలో చేరారు. అంతకుముందు..తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జీ తరుణ్ చుగ్ తో సమావేశం అయ్యారు మహేశ్వర్ రెడ్డి. ఆయన వెంట రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు బండి సంజయ్, ఇతర నేతలు ఉన్నారు.

ఈ సందర్భంగా కేసీఆర్ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు తరుణ్ చుగ్. కేసీఆర్ అరాచక పాలన అంతం.. ప్రధాని నరేంద్ర మోడీ వల్లే సాధ్యం అని చెప్పారు. మహేశ్వర్ రెడ్డి చేరికతో బీజేపీ మరింత బలోపేతం అవుతుందన్నారు. 

బీజేపీ బలోపేతం కోసం పని చేస్తా : ఏలేటి

ప్రధాని నరేంద్ర మోడీ వల్ల తెలంగాణలో అరాచక పాలనకు అంతం వస్తుందని ఏలేటి మహేశ్వరరెడ్డి చెప్పారు. మోడీ నాయకత్వంలో బీజేపీ పార్టీ బలోపేతం కోసం పని చేస్తానని తెలిపారు. కేసీఆర్ అరాచక పాలన అంతం చేయటం బీజేపీకే సాధ్యమని, అందుకే తాను బీజేపీలో చేరానని తెలిపారు. కొంతకాలం నుంచి కాంగ్రెస్, బీఆర్ఎస్ కలిసి అడుగులు వేస్తున్నాయని, రెండు పార్టీలు కూడా కలిసికట్టుగా పని చేస్తున్నాయన్నారు. అవినీతిపై పోరాటం చేయాల్సిన కాంగ్రెస్ పార్టీ.. నిస్తేజంగా ఉందన్నారు. బీఆర్ఎస్ తో కాంగ్రెస్ పొత్తు ఉంటుందని కొందరు సీనియర్స్ అంటే.. పొత్తు లేదని మరికొందరు కామెంట్స్ చేస్తున్నారని.. క్లారిటీ, నిబద్దత లేదని.. అంతా గందరగోళంగా ఉందన్నారు. కాంగ్రెస్ పార్టీలో కోవర్టులు ఉన్నారని.. పార్టీ వాళ్లు వ్యాఖ్యలు చేస్తూ.. కార్యకర్తలను అయోమయానికి గురి చేస్తున్నారని అన్నారు.
15 ఏళ్లుగా నిబద్దత కలిగిన కార్యకర్తగా పని చేశానన్నారు. 

తెలంగాణలో నియంతపాలన పోవాలి : బండి సంజయ్ 

ఏలేటి మహేశ్వర్ రెడ్డి కాంగ్రెస్ కోసం కష్టపడి పని చేశారని బండి సంజయ్ చెప్పారు. జేపీ నడ్డా సమక్షంలో మహేశ్వర్ రెడ్డి పార్టీలో చేరడం సంతోషంగా ఉందన్నారు. బీజేపీలో ఆయనకు సరైన ప్రాధాన్యత ఇస్తామన్నారు. తెలంగాణలో నియంతపాలన పోవాలని, పేదల రాజ్యం, రామ రాజ్యం రావాలన్నారు. మోడీ నాయకత్వంలో కేసీఆర్ అవినీతి పాలనా అంతం అవుతుందన్నారు. అందరం కలిసి బీజేపీ బలోపేతానికి కృషి చేస్తామని చెప్పారు. నిర్మల్ లోనే కాకుండా.. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని ప్రాంతాలను మహేశ్వర్ రెడ్డి ప్రభావితం చేయగలరని తెలిపారు.