ఎల్లారెడ్డి కాంగ్రెస్‌‌లో వర్గపోరు

ఎల్లారెడ్డి కాంగ్రెస్‌‌లో వర్గపోరు

కామారెడ్డి, వెలుగు:  ఎల్లారెడ్డిలో కాంగ్రెస్ గ్రూప్ తగాదాలు వీడడం లేదు. ఇద్దరు ప్రధాన లీడర్లు నియోజకవర్గంలో పట్టు కోసం  ప్రయత్నిస్తుండడం.. వారికి పీసీసీ స్థాయిలో ముఖ్య నేతల అండదండలు ఉండడం.. పార్టీ పరిస్థితి ఎవరికి వారే యమునా తీరే అన్నట్లుగా తయారైంది. ముఖ్య నేతల మధ్య కొనసాగుతున్న వర్గపోరు కార్యకర్తలను అయోమయానికి గురిచేస్తోంది.

గెలిచిన ఏకైక సీటు..

గత అసెంబ్లీ ఎన్నికల్లో ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో  కాంగ్రెస్​పార్టీ గెలిచిన ఏకైక సీటు ఎల్లారెడ్డి. ఆయా నియోజకవర్గాల్లో కాంగ్రెస్ నుంచి పోటీ చేసిన హేమాహేమీలు ఓటమి చెందినప్పటికీ  జాజాల సురేందర్ విజయం సాధించడం అప్పట్లో రాజకీయంగా చర్చనీయాంశమైంది. కొన్నాళ్ల తర్వాత సురేందర్ కాంగ్రెస్‌‌కు గుడ్​బై చెప్పి గులాబీ కండువా కప్పుకున్నారు. అయితే టీఆర్ఎస్ ఆవిర్భావం నుంచి పట్టున్న ఎల్లారెడ్డిలో ఆ పార్టీ అభ్యర్థి ఏనుగు రవీందర్‌‌‌‌రెడ్డి ఓడిపోవడం, కాంగ్రెస్ సునాయాసంగా గెలుపొందడంతో నియోజకవర్గం లీడర్ల దృష్టిలో పడింది. దీంతో రానున్న ఎన్నికల కోసం ఇప్పటి నుంచే ఇక్కడ పట్టు సాధించేందుకు హస్తం నేతలు తహతహలాడుతున్నారు. ఈ క్రమంలో పార్టీ నియోజకవర్గ కోఆర్డినేటర్ వడ్డేపల్లి సుభాష్‌‌రెడ్డి, పీసీసీ ఐటీ సెల్​చైర్మన్, జహీరాబాద్ పార్లమెంట్ పరిధి ఇన్‌‌చార్జి కె.మదన్‌‌మోహన్‌‌రావు ఎల్లారెడ్డిపై స్పెషల్‌‌ ఫోకస్‌‌ పెట్టారు.
 
పట్టు కోసం పాట్లు..

2018లో ఎల్లారెడ్డి ఎమ్మెల్యేగా గెలిచిన జాజాల సురేందర్‌‌‌‌ టీఆర్‌‌‌‌ఎస్‌‌లో చేరిన తర్వాత నుంచి సుభాష్‌‌రెడ్డి నియోజకవర్గంలో పట్టు కోసం ప్రయత్నిస్తున్నారు. పీపీసీ ప్రెసిడెంట్ రేవంత్‌‌రెడ్డితో సన్నిహిత సంబంధాలు ఉండడంతో ఆయన మరింత ఉత్సాహంగా ముందుకు సాగుతున్నారు. కె.మదన్‌‌మోహన్‌‌రావు 2019  పార్లమెంట్ ఎన్నికల్లో జహీరాబాద్ ఎంపీగా కాంగ్రెస్ నుంచి పోటీ చేసి స్వల్ప ఓట్ల తేడాతో ఓడిపోయారు. కొన్నాళ్ల తర్వాత ఆయన కూడా ఎల్లారెడ్డి నియోజకవర్గంపై దృష్టి పెట్టడం షురూ చేశారు. అటు పార్టీ జాతీయ నేత రాహుల్‌‌గాంధీతో.. ఇటు స్టేట్‌‌లో పీసీసీ ప్రెసిడెంట్‌‌కు వ్యతిరేకంగా ఉండే లీడర్లతో సన్నిహితంగా ఉంటూ పట్టు కోసం పావులు కదుపుతున్నారు. నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటించడం, తన ట్రస్టు ద్వారా సామాజిక సేవల చేయడం, మండలాల వారీగా పార్టీ లీడర్లను తన వైపు తిప్పుకోవడం చేస్తున్నారు. అయితే మదన్‌‌మోహన్​రావుకు పోటీగా సుభాష్‌‌రెడ్డి కూడా మండలాల వారీగా తిరగడం మొదలుపెట్టారు. దీంతో నియోజకవర్గంలోని ఆయా మండలాల లీడర్లు రెండు వర్గాలుగా వీడిపోయారు.  

దాడులకు సైతం వెనుకాడ్తలే..

అధిపత్య పోరులో ఇద్దరు లీడర్ల అనుచరులు ఒకరిపై ఒకరు దాడులు చేసుకుంటున్నారు. నెలన్నర రోజుల కింద లింగంపేట మండలంలో  రెండు వర్గాలు ఘర్షణకు దిగారు. ఐదు రోజుల కింద రాజంపేట మండలం ఎల్లారెడ్డిపేట తండాలో మరోసారి కొట్టుకున్నారు. ఇరు వర్గాల లీడర్లు పోలీస్ స్టేషన్‌‌లో పరస్పరం ఫిర్యాదులు కూడా చేసుకున్నారు. ఘర్షణ తర్వాత మదన్‌‌మోహన్‌‌రావుతో పాటు ఆయన వర్గీయులు వెళ్లి హైదరాబాద్‌‌లో పార్టీ నేత మల్లు భట్టివిక్రమార్కను కలిసి ఫిర్యాదు చేశారు. సుభాష్‌‌రెడ్డితో పాటు ఆయన వర్గం లీడర్లు కూడా గాంధీ భవన్‌‌కు వెళ్లి మదన్‌‌మోన్‌‌పై కంప్లైంట్‌‌ చేశారు. రెండు నెలల కింద ఎల్లారెడ్డిలో జరిగిన పీసీసీ ప్రెసిడెంట్‌‌ రేవంత్‌‌రెడ్డి భారీ బహిరంగ సభలో కూడా ఫ్లెక్సీలు ఏర్పాటు విషయంలో ఇరువర్గాల మధ్య గొడవ జరిగింది. 

వేర్వేరుగా పార్టీ ప్రోగ్రామ్స్‌‌..

పార్టీ పిలుపునిచ్చే ప్రోగ్రాంలు, ఆందోళనలు సైతం వేర్వేరుగా నిర్వహిస్తున్నారు. ఒక వర్గం ఒక చోట చేస్తే.. మరో వర్గం ఇంకో చోట చేస్తోంది. నియోజకవర్గంలోని  మండలాల్లో రచ్చబండ ప్రోగ్రామ్స్‌‌ కూడా వేర్వేరుగా చేశారు. అగ్నిపథ్‌‌కు వ్యతిరేకంగా నియోజకవర్గ కేంద్రాల్లో చేపట్టిన సత్యాగ్రహ దీక్షలు సైతం మదన్‌‌మోన్‌‌రావు, సుభాష్‌‌రెడ్డి వర్గం వేర్వేరుగా నిర్వహించడం కార్యకర్తల్లో చర్చనీయాంశమైంది.