ఖాళీ అవుతున్నఎల్లంపల్లి

ఖాళీ అవుతున్నఎల్లంపల్లి
  • 19 టీఎంసీల నుంచి 9 టీఎంసీలకు పడిపోయిన నీటి నిల్వ

పెద్దపల్లి, కరీంనగర్, వెలుగుఎల్లంపల్లి ప్రాజెక్ట్​లోని నీళ్లన్నీ ఖాళీ అవుతున్నాయి.  ప్రాజెక్ట్​ నీటిని నంది మేడారం పంప్ ​హౌజ్​ ద్వారా మిడ్​మానేరుకు తరలిస్తుండటంతో ఎల్లంపల్లి నీటి నిల్వ 19 టీఎంసీల నుంచి 9 టీఎంసీలకు పడిపోయింది. ఎగువ నుంచి ఇన్​ప్లో నిలిచిపోవడం,  దిగువన ఉన్న మూడు పంప్​హౌజ్​ల నుంచి పంపింగ్​ నిలిపివేయడంతో ఎల్లంపల్లి ప్రాజెక్టులో నీళ్లు తగ్గిపోయాయి. ఏడాది పాటు పూర్తి నీటి సామర్థ్యం మెయింటేన్ చేస్తామని చెప్పిన ప్రభుత్వం.. గోదావరిలో సరిపడా వరద ప్రవాహం ఉన్నప్పటికీ ఎల్లంపల్లికి నీటి ఎత్తిపోతలు నిలిపివేసింది.

ఒక్కో పంప్ నుంచి 3,150 క్యూసెక్కులు

కొద్ది రోజుల కిందట కురిసిన భారీ వర్షాలకు కడెం ప్రాజెక్టు ద్వారా ఎల్లంపల్లి ప్రాజెక్టులోకి వరద నీరు వచ్చి చేరింది. దీంతో ప్రాజెక్టు పూర్తి సామర్థ్యానికి చేరుకుంది. ఎల్లంపల్లి ప్రాజెక్ట్​ పూర్తి స్థాయి నీటి మట్టం 20.175 టీఎంసీలు కాగా 19 టీఎంసీల నీళ్లు నిల్వ ఉంచి మిగిలిన నీళ్లను గోదావరికి వదిలారు. తాజాగా మిడ్ మానేరుకు నీళ్లను తరలిస్తుండటంతో ఎల్లంపల్లిలో నీటి నిల్వ 9 టీఎంసీలకు తగ్గిపోయింది. ఎల్లంపల్లి నుంచి నంది మేడారం రిజర్వాయర్​కు వచ్చిన నీళ్లను.. మూడు పంపుల ద్వారా లక్ష్మీపూర్​లోని గాయత్రి పంప్​హౌజ్​కు తరలిస్తున్నారు. ఒక్కో పంప్ హౌస్​ నుంచి రోజుకు  3,150 క్యూసెక్కుల నీళ్లు పంపింగ్ చేస్తున్నారు. ఆ తర్వాత గాయత్రి పంప్​హౌస్​నుంచి నీళ్లు మిడ్ మానేరుకు వెళ్తున్నాయి. ఈవిధంగా గడిచిన 15 రోజుల్లో ఎల్లంపల్లి ప్రాజెక్ట్​ నుంచి మిడ్​ మానేరుకు దాదాపు 11టీఎంసీల నీళ్లను తరలించారు.ఎగువ నుంచి ఎల్లంపల్లికి వరద ప్రవాహం తగ్గిపోవడంతో ప్రాజెక్టు నీటి మట్టం రోజురోజుకూ తగ్గుతున్నది. శనివారం ఇన్​ఫ్లో 2,500 క్యూసెక్యులు ఉండగా.. నంది పంప్​హౌజ్​, ఎన్టీపీసీ, హైదరాబాద్​ తాగునీటి అవసరాలు, పెద్దపల్లి, మంచిర్యాల జిల్లాల మిషన్​ భగీరథ కోసం 11,137 క్యూసెక్యుల నీటిని తరలిస్తున్నారు. ఎల్లంపల్లికి ఇన్​ఫ్లో కంటే ఔట్ ఫ్లో ఎక్కువగా ఉండటంతో ప్రాజెక్టులో నీటి మట్టం తగ్గిపోతోంది.

ఎల్లంపల్లికి పంపింగ్​ నిలిపివేత

కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా గోదావరి నదిపై నిర్మించిన మూడు బ్యారేజీల్లోని మూడు పంప్​హౌస్ ల ద్వారా ఎల్లంపల్లిలోకి నీళ్ల ఎత్తిపోతలను నిలిపివేశారు. ఓవైపు ప్రాజెక్ట్​కు ఇన్​ఫ్లో తగ్గిపోగా.. మరోవైపు ఎల్లంపల్లిలోకి పంపింగ్ చేయాల్సిన నీళ్లను నిలిపివేయడంతో ఎల్లంపల్లిలో నీళ్లు సగానికి పైగా తగ్గిపోయాయి. జయశంకర్​ భూపాలపల్లి జిల్లాలోని మేడిగడ్డ బ్యారేజీ వద్ద శనివారం 1,29,000 క్యూసెక్యుల ఇన్​ ఫ్లో ఉండగా 25 గేట్లు ఎత్తి నీటిని దిగువకు వదులుతున్నారు. అన్నారంలో నిర్మించిన సరస్వతి బ్యారేజీకి ఇన్​ఫ్లో 1,100 క్యూసెక్యులు మాత్రమే ఉన్నది.  దీంతో మొత్తం గేట్లు మూసివేశారు. సరస్వతి బ్యారేజీ  పూర్తి సామర్థ్యం 10.87 టీఎంసీలు కాగా ప్రస్తుతం 9,12 టీఎంసీల నీటి నిల్వ చేశారు. పెద్దపల్లి జిల్లాలోని మంథని మండలంలోని సిరిపురం వద్ద నిర్మించిన పార్వతి బ్యారేజీకి సైతం పూర్తి స్థాయిలో ఇన్​ఫ్లో తగ్గింది. పార్వతి బ్యారేజీలో ప్రస్తుతం 7.15 టీఎంసీల నీటిని నిల్వ చేశారు. ఎల్లంపల్లిలో ఏడాది పాటు పూర్తి స్థాయి నీటి మట్టం మెయింటేన్ చేసేందుకు దిగువ గోదావరి నీటిని ఎప్పటికప్పుడు ఎత్తిపోస్తామని ప్రభుత్వం ఇప్పటికే చెప్పింది. అయితే ప్రస్తుతం లక్ష్మీ, సరస్వతి, పార్వతి మూడు పంప్​హౌజ్​లోని పంపులను నడపక దాదాపు నెల రోజులు కావస్తున్నది.  లక్ష్మీ బ్యారేజీ వద్ద ఇన్​ఫ్లో కావాల్సినంతగా ఉన్నప్పటికీ ఎందుకు ఆ నీళ్లను ఎల్లంపల్లికి ఎత్తిపోయడం లేదనే అనుమానాలను వ్యక్తం అవుతున్నాయి. మూడు పంప్​హౌజుల్లో పంపులు సిద్ధంగా ఉన్నాయని చెప్తున్న అధికారులు..  ఎల్లంపల్లి ప్రాజెక్టులో పూర్తిస్థాయి నీటి సామర్ధ్యం మేర ఎందుకు నిల్వ చేయడం లేదనే ప్రశ్నకు అధికారులు సమాధానం దాటవేస్తున్నారు. దీనిపై కాళేశ్వరం ప్రాజెక్టు అధికారులను వివరణ కోరగా  ప్రభుత్వం నుంచి ఆదేశాలు వచ్చిన తర్వాత పంపులు అన్​ చేసి ఎల్లంపల్లి ప్రాజెక్టు నింపుతామని చెప్తున్నారు