
రాజన్న సిరిసిల్ల, వెలుగు : మానకొండూరు టికెట్ ఇస్తామని తనకు హామీ ఇచ్చి ఇప్పుడు మోసం చేశారని ఓయూ విద్యార్థి నాయకుడు, సెంట్రల్ ఫిల్మ్ సెన్సార్ బోర్డు మెంబర్ దరువు ఎల్లన్న అన్నారు. విద్యార్థి నాయకుడిని చట్టసభకు పంపిస్తారని ఆశిస్తే తన నమ్మకాన్ని వమ్ముచేశారని ఆయన వాపోయారు. బీజేపీలో ఏండ్లుగా పనిచేస్తున్న వారిని పక్కన పెట్టి కొత్తగా పార్టీలోకి వచ్చిన వారికి టికెట్లు ఇచ్చారని మండిపడ్డారు.
శనివారం రాజన్నసిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంటలో మీడియాతో ఆయన మాట్లాడారు. కేసులను భరిస్తూ జైళ్లపాలయిన కార్యకర్తలను పట్టించుకోలేదన్నారు. బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్వత్వానికి,సెంట్రల్ ఫిల్మ్ సెన్సార్ బోర్డు మెంబర్ పదవికి రాజీనామా చేస్తున్నానని ఎల్లన్న తెలిపారు.