Ellyse Perry: ఆస్ట్రేలియా ఉమెన్స్ క్రికెట్ లెజెండ్, స్టార్ ఆల్ రౌండర్ ఎల్లిస్ పెర్రీ (Ellyse Perry) అంతర్జాతీయ క్రికెట్‌లో ఆల్-టైమ్ రికార్డును తన ఖాతాలో వేసుకుంది. ప్రస్తుతం ఇంగ్లాండ్ వేదికగా జరుగుతున్న ఉమెన్స్ టి20 వరల్డ్ కప్ 2026లో భాగంగా నెదర్లాండ్స్‌తో జరిగిన మ్యాచ్‌తో పెర్రీ ఒక అరుదైన మైలురాయిని అందుకుంది. ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే (పురుషులు, మహిళలలో) ఏకంగా 50 టీ20 వరల్డ్ కప్ మ్యాచ్‌లు ఆడిన మొట్టమొదటి ప్లేయర్‌గా పెర్రీ చారిత్రాత్మక రికార్డు సృష్టించింది.
అన్‌స్టాపబుల్ పెర్రీ:
35 ఏళ్ల ఎల్లిస్ పెర్రీ 2009లో జరిగిన మొట్ట మొదటి టి20 వరల్డ్ కప్ ఎడిషన్ నుంచి ఇప్పటి వరకు జరిగిన ప్రతి సిరీస్‌లోనూ ఆస్ట్రేలియా జట్టుకు ప్రాతినిధ్యం వహించింది. ఇప్పటి వరకు ఆడిన 50 వరల్డ్ కప్ మ్యాచ్‌ల్లో పెర్రీ 559 రన్స్ చేయడమే కాకుండా.. బౌలింగ్‌లోనూ రాణిస్తూ 42 వికెట్లు పడగొట్టింది. ఆస్ట్రేలియా జట్టు సాధించిన 6 వరల్డ్ కప్ టైటిల్స్ గెలవడంలో ఈమె కీ రోల్ ప్లే చేసింది. ఈ లిస్ట్‌లో పెర్రీ తర్వాత న్యూజీలాండ్ ప్లేయర్ సుజీ బేట్స్ (43 మ్యాచ్‌లు), రిటైర్ అయిన ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ అలిస్సా హీలీ (42 మ్యాచ్‌లు) తర్వాతి స్థానాల్లో ఉన్నారు. ఇక టీమిండియా కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ (41 మ్యాచ్‌లు) రేపు (జూన్ 21, ఆదివారం) సౌతాఫ్రికాతో జరగబోయే మ్యాచ్‌తో తన 42వ వరల్డ్ కప్ గేమ్ ఆడనుంది.
రోహిత్, కోహ్లీల వల్ల కాలేదు:
పురుషుల క్రికెట్‌లో ఎంతోమంది లెజెండ్స్ ఉన్నప్పటికీ ఎవరూ కూడా టీ20 వరల్డ్ కప్‌లో 50 మ్యాచ్‌ల మార్క్‌ను టచ్ చేయలేకపోయారు. 2024 టీ20 వరల్డ్ కప్ గెలిచిన తర్వాత రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలు ఈ ఫార్మాట్‌కు రిటైర్మెంట్ ప్రకటించారు. 2007 నుంచి 2024 వరకు అన్ని వరల్డ్ కప్‌లు ఆడిన హిట్ మ్యాన్.. పురుషుల క్రికెట్‌లో అత్యధికంగా 47 మ్యాచ్‌లు ఆడి టాప్‌లో కొనసాగుతున్నాడు. కానీ 50 మ్యాచ్‌ల మార్క్‌కు కొద్దిగా దూరంలోనే ఆగిపోయాడు. మరోవైపు, రన్ మెషిన్ విరాట్ కోహ్లీ తన కెరీర్‌లో 35 టీ20 వరల్డ్ కప్ మ్యాచ్‌లు మాత్రమే ఆడి ఈ లిస్ట్‌లో 7వ స్థానంలో ఉన్నాడు. ప్రస్తుతం వీరిద్దరూ కేవలం వన్డే ఫార్మాట్లో మాత్రమే ఆడుతున్నారు.
మెన్స్ క్రికెట్‌లో బట్లర్, షకీబ్ నెక్స్ట్:
పురుషుల టి20 వరల్డ్ కప్ చరిత్రలో రోహిత్ శర్మ (47) తర్వాత ఇంగ్లాండ్ కెప్టెన్ జోస్ బట్లర్, బంగ్లాదేశ్ ఆల్ రౌండర్ షకీబ్ అల్ హసన్‌లు చెరో 43 మ్యాచ్‌లతో రెండో స్థానంలో నిలిచారు. ఆ తర్వాత డేవిడ్ వార్నర్ (41), ఆదిల్ రషీద్ (38), మహ్మదుల్లా (37) ఉన్నారు. ఏదేమైనా పురుషుల కంటే ముందే మహిళల క్రికెట్ నుంచి ఎల్లిస్ పెర్రీ ఈ 50 మ్యాచ్‌ల హిస్టారికల్ రికార్డును అందుకోవడం విశేషం.
