వరద నీటిని ఒడిసి పడుతున్నరు..ఎల్ నినో దృష్ట్యా నీటి సంరక్షణకు చర్యలు

వరద నీటిని ఒడిసి పడుతున్నరు..ఎల్ నినో దృష్ట్యా నీటి సంరక్షణకు చర్యలు
  • ఏజెన్సీ గ్రామాల్లో ముమ్మరంగా జల సంరక్షణ పనులు
  • రూ.72.45 కోట్లతో నీటి కుంటలు, కందకాల త్వవకాలు

జయశంకర్ భూపాలపల్లి, వెలుగు: ప్రతి ఏడాది వర్షాకాలంలో కురిసే వాన నీటిలో అధిక భాగం వృథాగా ఆవిరవుతోంది. భూగర్భ జలాలు  తగ్గుతుండడంతో నీటి కొరత ఏర్పాడుతోంది. పైగా  ఈసారి ఎల్ నినో ప్రభావంతో వర్షాభావ పరిస్థితులు ఏర్పడే అవకాశముందని వాతావరణ శాస్ర్తవేత్తలు హెచ్చరిస్తున్నారు. 

ఈ నేపథ్యంలో కేంద్ర జలసంరక్షణ అభియాన్ ద్వారా గ్రామీణ ప్రాంతాలు, అటవీ ప్రాంతాల్లో వరద నీటిని ఒడిసి పట్టి, భూగర్భ జలాలు పెంచేందుకు చర్యలు చేపడుతున్నారు. అటవీ గ్రామాల్లోని గుట్టలపై పడిన వర్షపు నీరు దిగువకు వృథాగానే పోతోంది. వ్యవసాయ, పారిశ్రామిక అవసరాలు పెరుగుతుండడంతో ఏటికేడు నీటి కొరత తీవ్రమవుతోంది. 

ఎల్ నినో తో ఏర్పడే నీటి ముప్పును అధిగమించే దిశగా ప్రత్యామ్నాయ చర్యలు చేపడుతున్నారు. వర్షపు నీరు, అటవీ ప్రాంతాల్లోని వరద నీటిని నేరుగా భూమిలోకి ఇంకే విధంగా ఉపాధి హామీ పథకం కింద నీటి నిల్వ కందకాలు, ఊట కుంటలు, ఫామ్ పాండ్లు, ఇంకుడు గుంతలు నిర్మించడం, చెరువులు, కుంటల్లో పూడికతీత పనులను ముమ్మరం చేశారు. 

రూ.72.45 కోట్లతో జలసంరక్షణ పనులు..

జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో కేంద్ర జల సంరక్షణ అభియాన్ కింద రూ.72.45 కోట్లతో విస్తృతంగా పనులు చేపడుతున్నారు. ఇందులో 92 సామూహిక ఊట కుంటలు, 640 నీటి కుంటలు, 9 ఫామ్ పాండ్లు, 20 నీటి నిల్వ కందకాలు, 485 చెరువులు, కుంటల్లో పూడికతీత, ఇంకుడు గుంతల నిర్మాణ పనులు వేగవంతం చేశారు. 

మొత్తం 1,251 పనులకు గాను 424 పనులు ప్రస్తుతం పురోగతిలో ఉన్నాయి. కాటారం, మహదేవపూర్, పలిమెల, మల్హర్‌‌‌‌రావు, మహాముత్తారం, భూపాలపల్లి అటవీ ప్రాంతాల్లో నీటి కుంటల నిర్మాణంపై ప్రత్యేక దృష్టి సారించారు. ఈ కుంటలు అటవీ జంతువుల దాహార్తిని తీర్చడంతో పాటు భూగర్భ జలాల మట్టాన్ని పెంచి బోర్లు, బావుల్లో నీటి నిల్వ సామర్థ్యాన్ని మెరుగుపరచనున్నాయి.

 ఈ దిశగా ఈజీఎస్ ఆఫీసర్లు దృష్టి సారించారు. రేగొండ, గణపురం, చిట్యాల, టేకుమట్ల మండలాల్లోని కొండలు, గుట్టల ప్రాంతాలను గుర్తించి, వాటి దిగువ భాగాల్లో నీటి నిల్వ కందకాలు నిర్మిస్తున్నారు. చిన్నపాటి వర్షాలకే గుట్టల నుంచి ప్రవహించే నీటిని కందకాల వైపు మళ్లించేలా వంపు ప్రాంతాల్లో భారీగా తవ్వకాలు చేపడుతున్నారు. దీంతో భూగర్భ జలాల పెరుగుదలకు గణనీయంగా దోహదం కానుంది. నీటి నిల్వలు పెరగడం వల్ల అడవుల్లో పచ్చదనం పెరిగి, అటవీ జంతువులు, పశువులకు మేత, తాగునీటి వసతి దొరుకుతుందని అటవీ గ్రామాల ప్రజలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. 

కాంక్రీట్ తో భూగర్భ జలాలకు ఆపద..

పట్టణాలతో పాటు గ్రామాల్లో కాంక్రీట్ నిర్మాణాలు భారీగా పెరిగిపోయాయి. ప్రధాన రహదారులు, పాటి కాలనీలు, ఇంటి ఆవరణాల సైతం పూర్తిగా కాంక్రీట్ తో కప్పేస్తున్నారు. ఫలితంగా భారీ వర్షాలు కురిసినా నీరు భూమిలోకి ఇంకకుండా నేరుగా ప్రవహించి వెళ్లిపోతోంది. 

దీంతో భూగర్భ జలాల నిల్వలు తగ్గిపోతూ బోర్లు, బావులు ఎండిపోతున్నాయి. ఈ పరిస్థితిని అధిగమించేందుకు ఇళ్ల ఆవరణల్లో, ప్రభుత్వ కార్యాలయాల ప్రాంగాణాల్లో ఇంకుడు గుంతల నిర్మాణానికి ప్రధాన్యం ఇస్తున్నారు. నీటి వినియోగంలో పొదుపు పాటిస్తూ, వర్షపు నీటి సంరక్షణకు ప్రాధాన్యం ఇవ్వడం ద్వారా భవిష్యత్​ తరాలకు నీటి భద్రత కల్పించవచ్చని పర్యావరణ వేత్తలు సూచిస్తున్నారు.