వాషింగ్టన్/న్యూఢిల్లీ: భారత్‌లో స్టార్‌లింక్ ఇంటర్నెట్ సేవలను ప్రారంభించేందుకు అనుమతి ఇంకా రాలేదంటూ అమెరికన్ బిలియనీర్ ఎలాన్ మస్క్ మరోసారి అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈసారి రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముకేశ్ అంబానీ పేరును నేరుగా ప్రస్తావిస్తూ.. “భారతదేశంలో అసలు బాస్ అంబానీనా?” అని ‘ఎక్స్’లో ప్రశ్నించారు.
స్టార్‌లింక్‌కు భారత్‌లో కార్యకలాపాలు ప్రారంభించేందుకు నియంత్రణ సంస్థల నుంచి అవసరమైన అనుమతులు రాకపోవడంపై ఆయన స్పందిస్తూ.. స్టార్‌లింక్ ఇప్పటికే 165కి పైగా దేశాల్లో లైసెన్స్ పొందిందని, భారత్‌లోని అన్ని చట్టాలు, ప్రభుత్వ నిబంధనలను పాటించేందుకు తమ సంస్థ ఐదేళ్లుగా ప్రయత్నిస్తోందని చెప్పారు.
అయినప్పటికీ లైసెన్స్ ఎందుకు ఇంకా రాలేదని ప్రశ్నించారు. కొంతమంది “ఒలిగార్కులు(అత్యంత ప్రభావం ఉన్న ధనవంతులు/వ్యాపారవేత్తలు)’’ తమ గుత్తాధిపత్య ప్రయోజనాలను కాపాడుకోవడానికి స్టార్‌లింక్‌ను భారత్‌లోకి రాకుండా అడ్డుకుంటున్నారని అంతకుముందు ఆయన ఆరోపించారు. అయితే, భారత ప్రభుత్వం మస్క్ ఆరోపణలను తిరస్కరించింది.
కేంద్ర ప్రభుత్వం ఏమన్నదంటే..
శాటిలైట్ ఇంటర్నెట్ సేవలకు అనుమతులు ఇచ్చే విధానం న్యాయంగా, అన్ని కంపెనీలకు సమానంగా ఉందని.. స్టార్‌లింక్‌పై ఎలాంటి వివక్ష లేదని కేంద్ర ఐటీ, కమ్యూనికేషన్స్ మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. కేంద్రం వెల్లడించిన వివరాల ప్రకారం.. భారత్‌లో ప్రస్తుతం ఎలాన్ మస్క్‌కు చెందిన స్టార్‌లింక్, రిలయన్స్‌కు చెందిన జియో శాట్‌కామ్, భారతి ఎయిర్‌టెల్ మద్దతు ఉన్న యూటెల్‌శాట్ వన్‌వెబ్ అనే మూడు కంపెనీలకు శాటిలైట్ కమ్యూనికేషన్ లైసెన్స్‌లు ఇచ్చారు. అయితే ఈ మూడు కంపెనీలు కూడా వెంటనే వాణిజ్య సేవలు ప్రారంభించలేవు. అవసరమైన భద్రతా తనిఖీలు, స్పెక్ట్రమ్‌కు సంబంధించిన అనుమతులు ఇంకా పూర్తికావాల్సి ఉంది.
భద్రతా పరిశీలన ప్రక్రియ మూడు కంపెనీల విషయంలోనూ కొనసాగుతోందని కేంద్రం తెలిపింది. కేంద్ర కమ్యూనికేషన్స్ శాఖ సహాయ మంత్రి చంద్రశేఖర్ పెమ్మసాని కూడా దీనిపై స్పందిస్తూ.. అన్ని శాటిలైట్ కమ్యూనికేషన్ కంపెనీలకు లైసెన్స్‌లు, తాత్కాలిక స్పెక్ట్రమ్ కేటాయింపులు ఇచ్చామని, ప్రస్తుతం భద్రతా అనుమతి కోసం ఈ విషయం హోం మంత్రిత్వ శాఖ వద్ద పరిశీలనలో ఉందని తెలిపారు. జియో, వన్‌వెబ్ కూడా అనుమతుల కోసం వెయిట్ చేస్తున్నాయన్నారు.
రాహుల్‌కు మస్క్ థ్యాంక్స్
భారతదేశంలో అసలు బాస్ అంబానీనా..? అంటూ ఎక్స్‌లో మస్క్ పెట్టిన పోస్టుకు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ స్పందించారు. “వెల్‌కమ్ టు ఇండియా, ఎలాన్. మరో వ్యక్తి గురించి కూడా తెలుసుకున్న తర్వాత మీ పరిస్థితి ఎలా ఉంటుందో వేచి చూడండి” అని కామెంట్ చేశారు. అంబానీ మాత్రమే కాదు.. మరో రియల్ బాస్ ఉన్నారని.. ఆయనే గౌతమ్ అదానీ అనే అర్థంలో రాహుల్ ఇలా స్పందించారు. తన పోస్టుపై స్పందించిన రాహుల్‌కు మస్క్ థ్యాంక్స్ చెప్తూ, ఆయన పోస్టును రీట్వీట్ చేశారు. “ధన్యవాదాలు, రాహుల్. ఇది నిజంగా ఆందోళన కలిగించే విషయం” అని సమాధానం ఇచ్చారు.
