సెకండియర్ హాల్ టికెట్లు ఇవ్వకుండానే ఎంసెట్ అప్లికేషన్లు

సెకండియర్ హాల్ టికెట్లు ఇవ్వకుండానే ఎంసెట్ అప్లికేషన్లు

వెబ్ సైట్ అందుబాటులోకి వచ్చినా 
అప్లై చేసుకోవడానికి నో చాన్స్ 
ఇంటర్ బోర్డు, ఎంసెట్ కమిటీ 
మధ్య సమన్వయ లోపం 

హైదరాబాద్, వెలుగు: ఎంసెట్ అప్లికేషన్ల ప్రాసెస్ ప్రారంభమైనా స్టూడెంట్లు అప్లై చేసుకోవడానికి అవకాశం లేకుండా పోయింది. సెకండియర్ స్టూడెంట్లకు హాల్ టికెట్లు ఇవ్వకపోవడమే ఇందుకు కారణమైంది. ఇంటర్ బోర్డు, ఎంసెట్ అధికారుల మధ్య సమన్వయ లోపంతో ఈ పరిస్థితి తలెత్తింది. ఎంసెట్ వెబ్ సైట్ అందుబాటులోకి వచ్చినా, అప్లికేషన్లు తీసుకోకపోవడంతో స్టూడెంట్లు ఆందోళన చెందుతున్నారు. జులై 5 నుంచి 9 వరకు ఎంసెట్ జరగనుండగా, శనివారం నుంచి ఆన్​లైన్ లో అప్లికేషన్ల ప్రక్రియ మొదలైంది. అయితే అప్లైకి  ఇంటర్ హాల్​టికెట్ తప్పనిసరి. కానీ ఇంటర్ బోర్డు అధికారులు ఇంకా హాల్​ టికెట్లు ఇవ్వలేదు. ఈ విషయాన్ని పట్టించుకోని ఎంసెట్ అధికారులు... ఈ నెల20 నుంచి ఎంసెట్ అప్లికేషన్ల ప్రాసెస్ ప్రారంభించారు. దీంతో విద్యార్థుల్లో ఆందోళన మొదలైంది. 

ఫస్టియర్ హాల్​టికెట్ తోనూ అప్లైకి నో చాన్స్ 

పోయినేడాది1,500 మంది స్టూడెంట్లు ఎంసెట్ అప్లికేషన్లలో ఫస్టియర్ ​హాల్​టికెట్ పెట్టడంతో వారి రిజల్ట్​ ఇవ్వకుండా ఆపారు. సెకండియర్ ​హాల్ టికెట్ నంబర్ ఇచ్చాకే  రిజల్ట్ ప్రకటించారు. ఇప్పుడు ఫస్టియర్ హాల్​టికెట్ ద్వారా అప్లై చేసే ఆప్షన్​ను ఎంసెట్ అధికారులు వెబ్​సైట్ ​నుంచి తీసేశారు. సెకండియర్ హాల్​ టికెట్ వచ్చాక అప్లై చేసుకోవాలనే విషయాన్ని వెబ్​సైట్​లో కూడా పెట్టకపోవడంతో స్టూడెంట్లు టెన్షన్ పడుతున్నారు. దీనికి ఇంటర్ బోర్డు, ఎంసెట్ అధికారుల మధ్య సమన్వయ లోపమే కారణమని స్పష్టమవుతోంది. ఇంటర్ కంప్లీట్ అయినోళ్ల కోసం అప్లికేషన్ల ప్రక్రియ ప్రారంభించామని అధికారులు పేర్కొన్నారు. 

ఆందోళన  పడొద్దు
ఎంసెట్ అప్లికేషన్లకు మే18 వరకు అవకాశముంది. ఇప్పటికే ఇంటర్ పూర్తయిన స్టూడెంట్లు అప్లై చేసుకోవచ్చు. హాల్​టికెట్లు వచ్చిన తర్వాత సెంకడియర్ స్టూడెంట్లు దరఖాస్తు చేసుకోవాలి. అప్లై చేసుకోవడానికి చాలా టైమ్ ఉంది. స్టూడెంట్లు ఆందోళన చెందవద్దు. 
- గోవర్ధన్, ఎంసెట్ కన్వీనర్